
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ల దశాబ్దాల గ్రీన్‌కార్డ్ ఎదురుచూపులకు అంతం పలికే దిశగా ఒక వినూత్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా ఏకమొత్తంలో 2500 డాలర్లను చెల్లిస్తే సత్వరమే గ్రీన్‌కార్డును అందించాలన్నదే ఆ ప్రతిపాదన. ప్రస్తుతం గ్రీన్‌కార్డుల జారీకి దేశాలవారీగా కోటా పరిమితి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే.. అమెరికాలో ఉంటున్న వేలాది భారతీయుల శాశ్వత నివాస స్వప్నం నెరవేరుతుంది.
2500 డాలర్ల అదనపు చెల్లింపు ప్రతిపాదనను అమెరికాకు చెందిన ‘ఇమిగ్రేషన్ వాయిస్’ అనే స్వచ్ఛంద సంస్థ తెరపైకి తెచ్చింది. భారత్ సహా పలు దేశాల ఇమిగ్రేషన్ సమస్యల పరిష్కారానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. ఈ అదనపు వసూలు వల్ల దాదాపు 4 బిలియన్ డాలర్లు(400 కోట్ల డాలర్లు) ఆర్థిక వ్యవస్థలోకి చేరుతాయని, ఆ మొత్తాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యమైన మెక్సికో గోడ నిర్మాణానికి, అలాగే, దేశ అంతర్గత భద్రతను పటిష్టపరిచేందుకు వినియోగించవచ్చని ఆ సంస్థ సూచిస్తోంది.
వాషింగ్టన్‌కు చెందిన ఈ స్వచ్ఛంద సంస్థ పలువురు అమెరికన్ చట్టసభ్యులతో ఈ అంశంపై సంప్రదింపులు కొనసాగిస్తోంది. త్వరలో అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టనున్న డ్రీమర్ల (డిఫర్డ్ యాక్షన్ అగైనెస్ట్ చైల్డ్‌వుడ్ అరైవల్స్) ప్యాకేజీలో ఈ ప్రతిపాదనను చేర్చాలని కాంగ్రెస్ సభ్యులపై ఒత్తిడి తీసుకొస్తోంది.
హెచ్–1బీ వీసాలపై అమెరికా వచ్చిన దాదాపు 10–15 లక్షల మంది భారతీయులు గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్నారు. కోటా పరిమితి కారణంగా గ్రీన్‌కార్డ్ పొందేందుకు నిపుణులైన భారతీయ వలసదారులు 25 ఏళ్ల నుంచి 92 ఏళ్ల వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని జీసీ రిఫార్మ్స్ అనే సంస్థ చెబుతోంది. ప్రస్తుతం వీసా చట్టంలో సంస్కరణలకు ఉద్దేశించిన ‘హెచ్‌ఆర్ 392’(ద ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ యాక్ట్) బిల్లు ఆమోదానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అయితే ఆ బిల్లుకు 300 మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతు ఉన్నా ఇప్పట్లో ఆమోదం పొందేలా కన్పించడం లేదు. అందువల్ల తాజా ప్రతిపాదనను త్వరలో అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టబోయే డ్రీమర్ల(డీఏసీఏ) ప్యాకేజీలో అనుబంధంగా చేర్చాలని ఇమిగ్రేషన్ వాయిస్ డిమాండ్ చేస్తోంది. దీంతో అందరికీ ప్రయోజనం ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధి లియోన్ ప్రెస్కో తెలిపారు. ‘మెక్సికో గోడ నిర్మాణానికి అమెరికా డబ్బును వాడకూడదని ట్రంప్ భావిస్తున్నారు. మరోవైపు మెక్సికో కూడా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు.
ఈ నేపథ్యంలో గ్రీన్‌కార్డులకు అదనంగా 2,500 డాలర్లను వసూలు చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలి’ అని ఆయన వాదిస్తున్నారు. ఈ ప్రతిపాదన కాంగ్రెస్‌కు నచ్చినా.. డీఏసీఏ బిల్లులో దీనిని చేర్చే విషయం అనుమానాస్పదమేనని ఆయన అన్నారు. తమ ప్రతిపాదనపై అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కెవిన్ యోదెర్, తులసీ గబ్బర్డ్‌లు వైట్‌హౌస్‌తో పాటు కాంగ్రెస్ నాయకత్వానికి లేఖలు రాశారని, డీఏసీఏ బిల్లులో చేర్చాలని వారు కోరారని ఆయన వెల్లడించారు.
‘గ్రీన్‌కార్డు కోసం దశా బ్దాలు ఎదురుచూసే అవసరం లేకుండా ఐదారేళ్లలో వచ్చేలా చూస్తే ఇక్కడి భారతీయులు సహా.. చాలామంది దరఖాస్తుదారులు 2,500 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఒకేసారి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. మెక్సికో గోడ కోసం దాదాపు 25 బిలియన్ డాలర్లు అవసరం. తాజా గ్రీన్‌కార్డు ప్రతిపాదనతో గోడ కోసం 4 బిలియన్ డాలర్లు సేకరించవచ్చు’ అని ప్రెస్కో వెల్లడించారు.
స్వచ్ఛందమే..
ఈ ప్రతిపాదన ప్రకారం నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం గ్రీన్‌కార్డు పొందాలంటే ఒకేసారి అదనంగా 10 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని ‘ఇమిగ్రేషన్ వాయి స్’ సహ వ్యవస్థాపకుడు అమన్ కపూర్ తెలిపారు. ఈ ఫీజును గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు మాత్రమే చెల్లిస్తారని, స్వచ్ఛందంగానే వసూలు చేస్తారన్నారు. ఫీజు చెల్లించడం ఇష్టం లేకపోతే గ్రీన్‌కార్డు కోసం వరుసలో వేచి ఉండక తప్పదని అన్నారు. పదేళ్ల వ్యవధిలో గ్రీన్‌కార్డుకు 2,500 డాలర్ల చొప్పున 4 బిలియన్ డాలర్లు వసూలు కావచ్చని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment