ఆఫ్ఘన్ టీవీ స్టేషన్‌లో ఉగ్రవాదుల భీభత్సం
జలాలాబాద్: గుర్తు తెలియని ఉగ్రవాదులు ఏకంగా అఫ్ఘనిస్థాన్ అధికారిక టీవీ చానెల్ భవనంపై దాడికి దిగారు. జలాలాబాద్‌లోలోని ఓ భవనంలో గల టీవీ స్టేషన్‌లోకి చొరబడి ఇష్టారీతిన కాల్పులకు తెగబడ్డారు. ఓ ఇద్దరు ఉగ్రవాదులు తమను తాము పేల్చుకున్నట్లు తెలుస్తోంది. మరో ఉగ్రవాది మాత్రం ఇప్పటికీ పోరాడుతున్నాడట. బుధవారం ఉదయం మొదలైన ఈ దాడి ప్రస్తుతం కూడా కొనసాగుతోంది.
భద్రతా బలగాలకు సాయుధుడికి మధ్య కాల్పులు ఇంకా జరుగుతున్నాయని ప్రావిన్షియల్ గవర్నర్ అధికారిక ప్రతినిధి అత్తౌల్లా ఖుగ్యానీ విలేకరులకు తెలిపారు. ‘ఎంతమంది సాయుధులు టీవీ స్టేషన్‌లోకి చొరబడ్డారనే విషయాన్ని మేం ఇప్పుడే స్పష్టం చేయలేము. పైగా వారు ఎవరు? వారి టార్గెట్ ఏమిటనే విషయం ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి లోపలికి ముగ్గురు చొరబడినట్లు కనిపిస్తోంది. వారిలో ఇద్దరు తమను తాము పేల్చేసుకోగా ఒకరు మాత్రం బలగాలతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది’ అని ఖుగ్యానీ అన్నారు. ప్రస్తుతం దాడి జరుగుతున్న ప్రాంతానికి పాకిస్థాన్‌తో సరిహద్దు ఉంది.