ఐదు బ్యాంకులపై హ్యాకర్ల దాడులు
జేపీ మోర్గాన్ ఛేజ్ సహా.. ఐదు ప్రముఖ అమెరికన్ బ్యాంకులపై హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడ్డారు. ఒక్క నెలలోనే వరుసపెట్టి ఈ అన్ని బ్యాంకుల మీద దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ బ్యాంకుల నెట్వర్కులలోకి హ్యాకర్లు చొచ్చుకెళ్లి, గిగాబైట్ల కొద్దీ సమాచారాన్ని సంగ్రహించారు. సేవింగ్స్ ఖాతాల సమాచారం మొత్తాన్ని సేకరించారు. దీంతో అక్కడి సైబర్ సెక్యూరిటీ నిపుణులు కలవరపడుతున్నారు. ఇది చాలా అత్యాధునికమైన సైబర్ దాడి అని వాళ్లంటున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల ఉద్దేశం, లక్ష్యం ఏంటో స్పష్టంగా తెలియలేదని, ఎఫ్బీఐ దీనిపై దర్యాప్తు చేస్తోందని చెబుతున్నారు.
ఈ కంప్యూటర్ నెట్వర్కుల విషయాన్ని తేల్చడానికి పలు సెక్యూరిటీ సంస్థలను రంగంలోకి దింపారు. అయితే.. ఈ సైబర్ దాడికి పాల్పడినవాళ్లు ఏమైనా డబ్బును కూడా నొక్కేశారా.. లేదా కేవలం సమాచారానికే పరిమితం అయ్యారా అన్న విషయం కూడా ఇంతవరకు తెలియలేదు. సాధారణంగా తమలాంటి కంపెనీలపై ప్రతిరోజూ సైబర్ దాడులు జరుగుతూనే ఉంటాయని, వాటిని ఎదుర్కోడానికి పలు రకాలుగా తాము రక్షణ ఏర్పాట్లు కూడా చేసుకుంటామని జేపీ మోర్గాన్ ప్రతినిధి పాట్రీషియా వెక్స్లర్ తెలిపారు.
మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా తీసిన కొన్ని వీడియోలకు ప్రతీకారంగానే తాము ఈ దాడులకు పాల్పడినట్లు హ్యాకర్లు చెబుతున్నారు. ఆ వీడియోను ఇంటర్నెట్ నుంచి పూర్తిగా తొలగించేవరకు దాడులు చేస్తూనే ఉంటామని కూడా హెచ్చరించారు. ఇది బహుశా ఇరానీ ప్రభుత్వానికి చెందిన ముసుగు సంస్థ అయి ఉంటుందని అమెరికా నిఘా అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఇంతకుముందు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఫ్లేమ్, స్టక్స్నెట్ అనే రెండు కంప్యూటర్ వైరస్లను తయారుచేశాయని, ఇరాన్ కంప్యూటర్ల మీద నిఘాకోసం వీటిని ఉపయోగించాయని పరిశోధకులు అంటున్నారు.