
సగం ప్రపంచ జనాభా దక్షిణాసియాలోనే
ఈ చిత్రం భూమిపై జనాభా వ్యాప్తిని సూచిస్తోంది. ప్రపంచంలోని సగం జనాభా చిత్రంలో నల్లగా కనిపిస్తున్న ప్రాంతంలో నివసిస్తుండగా... మిగతా సగం పసుపుగా కనిపిస్తున్న ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆశ్చర్య పరిచే వాస్తవమేంటంటే ప్రపంచంలో అత్యధిక జనాభా ఆసియా ఖండంలోని కొన్ని పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. నాసా పరిశోధక విభాగం సూచించిన గణాంకాల ఆధారంగా ఈ మ్యాప్ రూపొందించారు. కనిపిస్తున్న ఈ చిత్రంలో ప్రపంచం మొత్తాన్ని మూడు కోట్ల చిన్న గదులుగా విడగొట్టారు. ఒక్కో గది వైశాల్యాన్ని మూడు మైళ్లుగా నిర్ధారించారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న జనాభా ఆధారంగా ఆ గదికి నలుపు, పసుపు రంగులను కేటాయించారు.
ఎనిమిది వేల పైచిలుకు జనాభా నివసించే ప్రాంతానికి పసుపు రంగు, ఎనిమిది వేల లోపు జనాభా నివసించే ప్రాంతానికి నలుపు రంగు ఇస్తే ప్రపంచంలో జనాభా వ్యాప్తి చిత్రంలో చూపిన విధంగా వచ్చింది. గంగా సింధు మైదానం, తూర్పు చైనాలోని కొన్ని ప్రాంతాలు భూగోళం మొత్తం మీద అత్యధిక జన సాంద్రత గల ప్రాంతాలుగా నిలిచాయి. అమెరికాలో పట్టణ జనసాంద్రతతో పోల్చితే ఆఫ్రికా ఖండంలో తీరప్రాంతంలోని కొన్ని పట్టణాలు, నైలు నదీ పరీవాహక ప్రాంతంలో జనసాంద్రత అధికంగా ఉంది. 2100 సంవత్సరానికి ప్రపంచ జనాభా పదకొండు వందల కోట్లకు చేరుకుంటుందని, ఇందులో 400 కోట్లు ఆఫ్రికా ఖండంలోనే నివసిస్తారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.