
శిఖరము అంచు.. ముక్తిని పంచు!
సాక్షి, స్కూల్‌ఎడిషన్: ఆశ్రీతులకు ఆశ్రయమిచ్చేది ఆశ్రమం. అందులో హిందూ సన్యాసులంటే అది మఠం. బౌద్ధసాధువులంటే బౌద్ధారామం. ప్రపంచంలో ఇలాంటి ఆశ్రమాలు బోలెడన్నీ ఉన్నాయి. భారతదేశంలో వీధికో ఆశ్రమం ఉంది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగానే ఆశ్రమాల్లోనూ తేడాలున్నాయి. కొన్ని ఆశ్రమాలు జనావాసాలకు దగ్గరగా ఉండి సులభంగా సందర్శించేందుకు వీలుంటుంది. మరి కొన్ని మారుమూల ప్రాంతాల్లోని కొండలు, పర్వతాలపై ఉంటాయి. ఒకప్పుడు ఈ ఆశ్రమాలను చేరుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. కఠోర శ్రమ, పట్టుదల, నిష్ట ఉన్న వారే ఈ ఆరామాలను చేరుకోనేవారు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఆశ్రమాలన్నీ ప్రఖ్యాత పర్యాటక స్థలాలుగా మారిపోయాయి. రోపింగ్, ట్రెక్కింగ్, ఆశ్రమం వరకు మెట్ల నిర్మాణం వంటి ఏర్పాట్ల ద్వారా ఈ ఆరామాలను సందర్శించేందుకు వీలుకల్పించారు. అలాంటి వాటిపై ఓ లుక్కేద్దాం.
హ్యాంగింగ్ మొనాస్ట్రీ, చైనా
చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ హెంగ్ పర్వతపు పశ్చిమ అంచున భూమి నుంచి 75 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. దీనిని వేలాడే ఆశ్రమం అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అద్భుత నిర్మాణాల్లో ఇది ఒకటి. ఈ పర్వతం డాటాంగ్ నగరానికి 60 కి.మీ దూరంలో ఉంది. చైనాలోని ప్రముఖ టూరిస్ట్ గమ్యస్థానంగా, చారిత్రక స్థలంగా విలసిల్లుతోంది. క్రీ.శ 491లో ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. చైనాలో బుద్ధిజమ్, టావోయిజమ్, కన్ఫూషియనిజమ్‌లతో కూడిన ఏకైక టెంపుల్ ఇదే. ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ టెంపుల్స్‌లో ఇది ఒకటి.
మెటియోరా, గ్రీస్
ఈ ఆశ్రమం గ్రీస్‌లో ఉంది. గ్రీకు భాషలో ‘మెటియోరా’ అంటే గాలిలో వేలాడతీసినది లేదా పైన ఉండే స్వర్గం లేదా ఆకాశం మధ్యలో ఉండేది అని అర్థం. ఈ ఆరామం ఆరు మఠాల కలయికగా ఎత్తై కొండపైన ఉంది. గ్రీస్‌లోని పవిత్రమైన ఆశ్రమాల్లో ముఖ్యమైంది. మధ్య గ్రీస్‌లోని పిండస్ పర్వతాలకు సమీపంలో కాలాంబాకా పట్టణానికి దగ్గరలో ఉంది. కొండపైన ఈ ఆరు ఆరామాలను నిర్మించారు. ఈ ఆశ్రమాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. 11వ శతాబ్దంలో సన్యాసులు ఈ ఆశ్రమాల్లో నివసించేవారు. ప్రస్తుతం ఇది గ్రీస్‌లో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా నిలుస్తోంది.
టాంగ్ కాలాట్, మైన్మార్
మైన్మార్‌లోని పోపా అగ్నిపర్వతంపై బాగాన్ నగరానికి 50 కి.మీ దూరంలో ఉంది. సముద్రమట్టానికి 737 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్రముఖ బౌద్ధఆరామం. దీన్ని చేరుకునేందుకు పర్వతం కింది నుంచి 777 మెట్లను నిర్మించారు. మైన్మార్‌లో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రదేశాల్లో ఇది ఒకటి. పోపా పర్వతంపై ఉన్న గుళ్లను, ఈ ఆశ్రమాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు.
టాక్ట్‌సాంగ్ పాల్‌ఫుగ్, భూటాన్
ఈ ఆశ్రమాన్ని ‘ద టైగర్స్ నెస్ట్’ అని కూడా పిలుస్తారు. హిమాలయ పర్వతప్రాంతంలోని ప్రముఖ బౌద్ధ ఆరామం. భూటాన్‌లోని పారో లోయకు ఆనుకోని ఉన్న పర్వతపు అంచున నిర్మించిన గుళ్ల సముదాయం. సముద్రమట్టం కన్నా 3120 మీటర్ల ఎత్తులో ఉంది. టాక్ట్‌సాంగ్ సెంగే సామ్‌డప్ గుహలో 1692లో నిర్మించారు. ఈ ఆశ్రమం భూటాన్‌లోనే ప్రముఖ పర్యాటక స్థలంగా, సాంస్కృతిక కేంద్రంగా పరిఢవిల్లుతోంది.
సుమేలా మొనాస్ట్రీ, టర్కీ
1600 సంవత్సరాల క్రితం టర్కీలోని అల్‌టెమ్‌డెరే లోయను ఆనుకోని ఉన్న పర్వతంపై నిర్మించారు. సముద్రమట్టం కంటే 1200 మీటర్ల ఎత్తులో ఉంది. రాతితో నిర్మించిన చర్చి, విద్యార్థులు చదువుకునేందుకు గదులు, లైబ్రరీ ఈ ఆశ్రమంలో ఉన్నాయి. టర్కీలోని ప్రముఖ పర్యాటకస్థలాల్లో ఇది ఒకటి. ఈ ఆరామంలోని గోడలపై ఏసుక్రీస్తు, మేరీ మాత జీవితవిశేషాలకు వివరిస్తూ గీసిన కుడ్యచిత్రాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. 1923 నుంచి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మ్యూజియంగా మార్చింది.