
'గ్రేట్ వాల్' దెబ్బతింటున్నా..
బీజింగ్ః ఆధునిక మానవుని ఇంజనీరింగ్ నైపుణ్యానికి, శతాబ్దాల చరిత్రకు మారుపేరైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా.. రోజురోజుకూ అంతరించిపోతోంది. ప్రకృతి బీభత్సాలకు, వాతావరణ మార్పులకు ఈ చరిత్రాత్మక కట్టడంలోని వినియోగంలో ఉన్న మార్గం.. చాలాభాగాల్లో పాడైపోయింది. గోడ పొడవునా చాలాప్రాంతాల్లో మొక్కలు మొలిచి, రంధ్రాలు ఏర్పడటంతో దాదాపు 2 వేల కిలోమీటర్ల మేర ఇప్పటికే నిరుపయోగంగా మారిపోయింది. ప్రస్తుతం షాంగ్జీ ప్రాంతంలో హైవేల నిర్మాణంతో గ్రేట్ వాల్ లో మూడు విభాగాలు దెబ్బతిన్నట్లు నివేదికలు చెప్తున్నాయి.
శతాబ్దాల చరిత్ర కలిగిన చైనా గ్రేట్ వాల్ దెబ్బతింటున్నా పట్టించుకునేవారే కనిపించడం లేదు. సాంస్కృతిక వారసత్వ సంపదైన గోడను తిరిగి నిర్మించడమంటే మాటలు కాదు. మరమ్మతులు చేయడమూ కష్టమైన పనేనంటూ నిపుణులు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాచీన సంపదను... కాపాడుకోవడం ఒక్కటే.. మార్గంగా కనిపిస్తుంది. అయితే స్థానికంగా నిర్మిస్తున్న హైవేలు గ్రేట్ వాల్ కు సంకటంగా మారాయి. యూలిన్, జింగ్బైన్ నగరాలను కలుపుతూ 94 కిలోమీటర్ల మేర చేపట్టిన రహదారి నిర్మాణం.. రాష్ట్రస్థాయి రక్షణలో ఉన్న క్వీన్ డినాస్టీ (క్రీస్తు పూర్వం 206-221) మింగ్ డినాస్టీ (1368-1644) ల మీదుగా జరుగుతుండటం చారిత్రక కట్టడానికి తీరని విఘాతం కలిగించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆరు గ్రేట్ వాల్ అవశేషాలు కలిగిన, 48 చరిత్రపూర్వ ప్రదేశాల్లో ప్రాజెక్టును నిలిపివేయాలని అధికారులను కోరుతూ జూలైలో సాంస్కృతిక వారసత్వ యూలిన్ బ్యూరో ఓ పత్రాన్ని జారీ చేసింది.
ఇప్పటికే రాష్ట్ర సాంస్కృతిక వారసత్వ శాఖ అనుమతి లేకుండా రహదారుల నిర్మాణం జరుగుతోందని, ఇప్పటికైనా ఈ ప్రాజెక్టును నిలిపివేయని పక్షంలో మూడు చరిత్రాత్మక ప్రదేశాలు దెబ్బతినే అవకాశం ఉందని బ్యూరో సిబ్బంది చెప్తున్నారు. అవశేషాలను రక్షించడంకోసం తాము ప్రత్యేక ప్రణాళికలు అభివృద్ధి చేస్తున్నామని, బిల్లర్ల సహాయంతో దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తిస్తామని బ్యూరో సిబ్బంది అంటున్నారు. మింగ్ రాజవంశం నిర్మించిన 6,200 కిలోమీటర్ల గోడలో సుమారు 30 శాతం ఇప్పటికే కనుమరుగైనట్లు అధికారులు చెప్తున్నారు.