
ఇల్లు కొంటే ఇల్లాలు ఉచితం!
పెళ్లి చేసుకోవడం.. ఇల్లు కట్టుకోవడం.. మనిషి జీవితంలో ఈ రెండే కదా అత్యంత ఘనకార్యాలు! అందుకేనేమో ఒకేసారి ఇంటితోపాటు ఇల్లాలినీ సొంతం చేసుకోండి అంటూ 40 ఏళ్ల వినాలియా ప్రకటించిన బంపర్ ఆఫర్ ప్రస్తుతం ఇండోనేషియాలో హాట్ టాపిక్గా మారింది.
జావా దీవిలో నివసిస్తున్న బ్యుటీషియన్ వినాకు సొంతగా ఓ పార్లర్తోపాటు రెండతస్తుల ఇల్లుంది. కొన్నేళ్ల కిందట భర్తను కోల్పోయిన ఆమె ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది. ఈ మధ్యే పిల్లకు తండ్రి, తనకో తోడు కోసం రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకు అవసరమయ్యే డబ్బు కోసం ఇంటిని అమ్మిపెట్టమని ప్రాపర్టీ సెల్లర్ అయిన తన స్నేహితుణ్ణి సంప్రదించింది. ఆ స్నేహితుడు తెలివిగా ప్రకటనలో కొన్ని కీలక మార్పులు చేశాడు.
వినాలియా ఇంటిని కొన్న వ్యక్తి.. ఆమెను పెళ్లి కూడా చేసుకోవచ్చని ఆన్లైన్లో ప్రకటనలిచ్చాడు. విషయాన్ని సీరియస్గా తీసుకునేవాళ్లే తనను, తన ఇంటిని చూడటానికి రావాలనడంతోపాటు మరి కొన్ని కఠినమైన కండిషన్లు విధించింది వినాలియా! అయితే అనూహ్యంగా ఆమెను చూడటానికి ఒక్కరంటే ఒక్కరు మాత్రమే ముందుకొచ్చారట! అయనకు కూడా ఇల్లు నచ్చకపోవడంతో వెనుదిరిగి వెళ్లాడట! ఏదైతేనేం.. ఇల్లు అమ్మిన తర్వాత కూడా భార్య హోదాలో ఇంటి యజమానురాలిగా ఉండాలనుకున్న వినాలియా ఐడియా అద్భుతంగా ఉందంటున్నారు మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్.