
బయటి నుంచి చూడటానికి సాదాసీదాగానే కనిపిస్తుంది గాని, ఈ భవంతి లోపలికి అడుగు పెడితే మాత్రం బంగారు ధగధగలు కళ్లు చెదిరేట్లు చేస్తాయి. ఏదో రాజప్రాసాదంలోకి అడుగుపెట్టినట్లే అనిపిస్తుంది. రష్యాలోని ఈర్‌కుత్‌స్క్ నగరంలో ఉన్న ఈ బంగారు భవనం ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. రెండెకరాల విస్తీర్ణమైన ప్రాంగణంలో పచ్చని తోటల మధ్య నిర్మించిన ఈ భవంతి విస్తీర్ణం 6,997 చదరపు అడుగులు. ఇందులోని సోఫాలు, కుర్చీలు, టేబుళ్లు, టీపాయ్‌లు, మంచాలు, పడకగది తలుపుల అంచులు, వాటి గొళ్లాలు, షాండ్లియర్లు వంటివన్నీ పూర్తిగా బంగారం తాపడంతో తయారు చేసినవే కావడం విశేషం. ఈ భవంతిలో ఐదు పడకగదులు, డ్రెసింగ్ రూమ్‌లు, ప్రైవేట్ బాత్‌రూమ్‌లు, విశాలమైన హాలు, కారిడార్, వంటగది, భోజనాల గది ఉన్నాయి.
ఈ గదుల్లో అడుగడుగునా బంగారు తళతళలు మిరుమిట్లుగొలుపుతాయి. ప్రఖ్యాత బైకాల్ సరస్సుకు చేరువలో ఉండటం ఈ భవంతికి అదనపు ఆకర్షణ. ఈ బంగారు భవంతిలో మరిన్ని అదనపు హంగులూ ఉన్నాయి. భవంతి మొత్తానికి విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేకమైన విద్యుత్ సబ్‌స్టేషన్, వైన్ సెల్లార్, ఇంటి ఆవరణలో చక్కగా తీర్చిదిద్దిన పచ్చిక బయళ్లు, పైన్ వృక్షాలు, ఒక చేపల చెరువు, ఒక కృత్రిమ జలపాతం కూడా ఉన్నాయి.
(చదవండి: ఆడుకునేందుకు వెళ్లి ఊహించని ఫ్రెండ్‌తో..)
దీని ధర 2.1 మిలియన్ పౌండ్లు (21 కోట్ల రూపాయలు). ఈ భవంతికి ఒకటే సమస్య. భవంతి లోపల అంతా బాగానే ఉంటుంది గాని, శీతాకాలంలో మాత్రం వెలుపల –51 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉంటాయి. కాస్త వెచ్చని ప్రాంతానికి మకాం మార్చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని అమ్ముతున్నట్లు పదకొండేళ్లుగా ఇందులోనే ఉంటున్న ప్రస్తుత యజమాని కానాగత్ రజమతోవ్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment