
వాషింగ్టన్ : భూమిపై రోజురోజుకూ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా ఇంకొన్ని రోజులు పోతే ఇక్కడి వనరులు కూడా సరిపోని పరిస్థితులు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే ఇతర గ్రహాలపై మానవ నివాసం కోసం అన్వేషణ సాగుతోంది. అయితే భూమి కాకుండా మానవులు నివసించడానికి అనువుగా ఉండే మరో గ్రహం ఏదైనా ఉందా అంటే.. వెంటనే వచ్చే సమాధానం మార్స్. మరి ఒకవేళ మార్స్‌పై నివాసాలు ఏర్పాటు చేసుకుంటే ఇంటి నిర్మాణం ఎలా ఉండాలి? అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు కూడా ఇదే ఆలోచన వచ్చింది. దాంతో వెంటనే ఓ పోటీని నిర్వహించింది. అదే... ‘మార్స్ 3ఈ–ప్రింటెడ్ హౌస్ ఛాలెంజ్’. మొత్తం 60 మంది పోటీదారులు పాల్గొన్న ఈ పోటీలో ఆర్కిటెక్చురల్ అండ్ టెక్నాలజీ డిజైన్ ఏజెన్సీ స్పేస్ ఫ్యాక్టరీ మొదటి బహుమతి (5లక్షల డాలర్లు) గెలుచుకుంది.
అదే.. ‘మార్షా మార్స్ హౌస్’. చివరి పోటీ జరుగుతున్న సమయంలో తమ 3డీ ప్రింటెడ్ ప్రొటోటైప్‌ను 15 అడుగుల పొడువు ఉండేలా నిర్మించింది. ఈ తరహా నివాస స్థలాన్ని మార్స్‌లో ఏర్పాటు చేసుకోవాలంటే కావాల్సిన వస్తువులను అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, మార్స్‌పై సహజంగా దొరికే వస్తువులను రీసైకిలింగ్ చేయడం ద్వారా ఈ ఇంటిని నిర్మించుకోవచ్చని తయారీదారులు చెబుతున్నారు. భవిష్యత్తులో మార్స్‌పైకి మనుషులు వెళ్తే అక్కడ వారి మొదటి ఇళ్లు బహుశా ఇలాగే ఉంటుందేమోనంటూ నాసా ఓ ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment