ఆన్‌లైన్ నవ్వు ఎన్ని విధాలు?
న్యూఢిల్లీ: నవ్వు నాలుగు విధాల చేటు అనేవాళ్లు, నవ్వు నాలుగు విధాల మంచిది అనేవాళ్లూ ఉన్నారు. ఈ వివాదాన్ని పక్కనే పెడితే ఆన్‌లైన్‌లో నవ్వు ఎన్ని విధాలు, ఎవరు ఎలా నవ్వుతారు? అనే ఆసక్తికరమైన అంశంపై ప్రముఖ సామాజిక వెబ్‌సైట్ 'ఫేస్‌బుక్' ఆధ్యయనం జరిపింది. నవ్వు నాలుగు విధాలేనని, కొంతమంది మాత్రమే బిగ్గరగా పగలబడి నవ్వుతారని (ఎల్‌ఓఎల్-లాఫింగ్ అవుట్ లౌడ్లీ), కొంతమంది హ హ్హహా... (హెచ్‌ఏహెచ్‌ఏ) అని నవ్వుతారని, మరికొంత మంది హెహ్హెహే... (హెచ్‌ఈహెచ్‌ఈ) అని నవ్వుతారని, ఇంకొంత మంది చిద్విలాసంగా (ఎమోజీ) నవ్వుతారని తేల్చింది. హహ్హహా...హెహ్హెహే అనే శీర్శికతో 'ది న్యూయార్కర్' అనే అమెరికా మేగజైన్‌లో వచ్చిన ఓ ఆర్టికల్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఆన్‌లైన్ మెటీరియల్‌పై ఎవరు, ఎలా నవ్వుకుంటారు? వారిలో ఎవరి శాతం ఎంత, ఏ వయస్సు వారు ఎలా నవ్వుతారు? అన్న అంశంపై ఫేస్‌బుక్ ఇటీవల సమగ్ర సర్వేను నిర్వహించింది.
హ హ్హహా...నవ్వేవారు 51.4 శాతం మందని, హెహ్హెహే...అని నవ్వేవారు 13.1 శాతం మందని, చిద్విలాసంగా నవ్వేవారు 33.7 శాతం మందని, పగలబడి నవ్వేవారు కేవలం 1.9 శాతమని ఫేస్‌బుక్ సర్వేలో తేలింది. జెండర్, ఏజ్ పరంగా కూడా నవ్వుల్లో తేడాను గుర్తించింది. టీనేజర్లు ఎక్కువ మంది చిద్విలాసంగా నవ్వుతున్నారని, లేట్ ట్వెంటీస్‌లో ఉన్నవాళ్లు పగలబడి నవ్వుతున్నారని, పురుషుల్లో ఎక్కువ మంది హహ్హహా...అని నవ్వుతుంటే, మహిళలు హెహ్హెహే...అని నవ్వుతున్నారని సర్వేలో వెల్లడైంది.
ఇక ప్రాంతాల పరంగా చూస్తే ఫ్లోరిడాలో చిద్విలాసంగా నవ్వేవాళ్లు, పగలబడి నవ్వే వాళ్లు ఎక్కువ. అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో హెహ్హెహే...అని ఎక్కువ మంది నవ్వుతుండగా, ఓహాయో, వర్జీనీయా రాష్ట్రాల్లో హహ్హహా....అని ఎక్కువ మంది నవ్వుతున్నారు. ఫ్లోరిడా తర్వాత మధ్యప్రాచ్యంలో ఎక్కువ మంది చిద్విలాసంగా నవ్వుతుంటే, దక్షిణాది దేశాల్లో కూడా పగలబడి నవ్వుతున్నారు.