స్విస్బ్యాంకులో కోట్లు దాచిన హెచ్ఎస్బీసీ చీఫ్?
స్కాముల్లో కూరుకుపోయిన హెచ్ఎస్బీసీ బ్యాంకును సంస్కరిస్తానని ఇన్నాళ్లూ చెబుతూ వస్తున్న ఆ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువార్ట్ గలివర్ వాస్తవానికి స్విస్ బ్యాంకులో కోట్ల కొద్దీ రూపాయలు దాచుకున్నారట. ఈ విషయాన్ని గార్డియన్ వార్తాపత్రిక బయటపెట్టింది. మే నెలలో బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఇది అక్కడి ప్రభుత్వానికి పెద్ద శరాఘాతంగానే పరిణమిస్తుందని అనుకుంటున్నారు.
బాగా డబ్బులున్న ఆసాములు పన్ను ఎగవేయడానికి స్విస్ బ్యాంకుల్లో సొమ్ములు దాచుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో గలివర్ కూడా 2007 సంవత్సరంలో రూ. 47.26 కోట్లను పనామాలో రిజిస్టర్ అయిన ఓ కంపెనీ పేరుమీద స్విస్ బ్యాంకులో దాచుకున్నట్లు తెలిసింది. స్వతహాగా బ్రిటన్కు చెందిన గలివర్, తన న్యాయపరమైన, పన్ను అవసరాల కోసం హాంకాంగ్లో ఉంటున్నారు. అయితే ఈ స్విస్ బ్యాంకు ఖాతా వ్యవహారంపై హెచ్ఎస్బీసీ వర్గాలు ప్రస్తుతానికి ఏమీ స్పందించలేదు.