ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ (HSBC Holdings Plc).. తమ ఉద్యోగులు ఆఫీస్ మొబైల్ ఫోన్ల నుంచి మెసేజ్‌లు పంపే వీలు లేకుండా కట్టడి చేస్తోంది. అనధికారిక కమ్యూనికేషన్ పద్ధతులను ఉపయోగించడంపై రెగ్యులేటరీ సంస్థలు ఇటీవల చర్యలు చేపట్టిన నేపథ్యంలో హెచ్‌ఎస్‌బీసీ తమ
సిబ్బందిని ఆఫీస్ ఫోన్‌లలో సందేశాలు పంపకుండా బ్లాక్ చేస్తోంది.
కంపెనీ ఉద్యోగులకు జారీ చేసిన ఫోన్‌లలో మెసేజ్ ఫంక్షన్‌ను డిసేబుల్ చేసే ప్రక్రియలో ఉందని విషయం తెలిసిన కొందరు వ్యక్తుల ద్వారా తెలిసింది. అంటే బ్యాంకు సిబ్బంది తమ ఆఫీస్ ఫోన్ల నుంచి సందేశాలను పంపలేరు, స్వీకరించలేరు. కాగా హెచ్‌ఎస్‌బీసీ ఇప్పటికే సిబ్బంది వర్క్ ఫోన్‌లలో వాట్సాప్ ఉపయోగించకుండా బ్లాక్ చేసింది.
అయితే కీలకమైన బాధ్యతల్లో ఉన్న కొంతమంది ఉద్యోగులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. వారు తమ వర్క్ ఫోన్‌ల నుంచి మెసేజ్‌లు పంపించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల వ్యక్తిగత ఫోన్లపై ఎలాంటి ఆంక్షలూ లేవు. రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఆమోదించిన కమ్యూనికేషన్ పద్ధతులను అవలంభిస్తున్నట్లు హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ ప్రతినిధి చెప్పారు.
సమాచారాన్ని పంచుకోవడానికి ట్రేడర్లు, డీల్‌మేకర్‌లు ఫోన్లు, సిస్టమ్‌లను ఎలా ఉపయోగిస్తున్నారు.. వారి యజమానులు వీటిని ఎలా ట్రాక్ చేస్తున్నారన్న దానిపై నియంత్రణ సంస్థలు పరిశోధిస్తున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. వాల్ స్ట్రీట్‌లోని కొన్ని అతిపెద్ద బ్యాంకులలో మార్కెట్ మానిప్యులేషన్‌కు సంబంధించిన అధిక ప్రొఫైల్ కేసుల తర్వాత ఆర్థిక దుష్ప్రవర్తనను నిరోధించడమే లక్ష్యంగా రెగ్యులేటరీలు ఈ చర్యలు చేపట్టాయి.
వందల కోట్ల జరిమానా
వాట్సాప్‌తో సహా అనధికారిక మెసేజింగ్ యాప్‌లలో ఉద్యోగుల కమ్యూనికేషన్‌లను పర్యవేక్షించడంలో విఫలమైనందుకు గానూ హెచ్‌ఎస్‌బీసీ ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్ రెగ్యులేటరీ సంస్థకు పెద్ద మొత్తంలో జరిమానా కట్టేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్‌కు 30 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 250 కోట్లు), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు మరో 15 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 124 కోట్లు) చెల్లించింది.
Comments
Please login to add a commentAdd a comment