కిటకిటలాడే జైళ్లట...
మనాలి: ఫిలిప్పీన్స్‌లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా దేశాధ్యక్షుడు రొడ్రిగో డూటర్టీ చేపట్టిన యుద్ధం వల్ల జైళ్లు, పునరావాస కేంద్రాలు కిక్కిర్సిపోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఒక్క జైలు గదిలో సామర్ధ్యానికి మించి మూడింతల మంది నిందితులను ఉంచుతున్నారు. వారు నిద్రపోవడానికి చోటులేక ఒకరిపై ఒకరు పడుకోవాల్సి వస్తోంది.
రొడ్రిగో దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేనాటికి వెలవెలబోయిన ప్రభుత్వ, ప్రైవేటు పునరావాస కేంద్రాలు ఇప్పుడు రోగులతో కిటకిటలాడుతున్నాయి. దేశావ్యాప్తంగా ఉన్న 40 కేంద్రాల పరిస్థితి దాదాపు ఇలాగే తయారయింది. తమ పునరావాస కేంద్రానికి రోజుకు 30 మంది చొప్పున మాదక ద్రవ్యాలకు బానిసలైన రోగులు వస్తున్నారని మనీలా నగరంలోని బికుటాన్ పునరావాస కేంద్రం తెలియజేసింది. ఇప్పటికే తమ కేంద్రంలో రోగుల సంఖ్య సామర్థ్యానికి మించి రెండింతలు దాటిందని పేర్కొంది. ప్రైవేటు పునరావాస కేంద్రంలో చార్జీలు విపరీతంగా ఉన్నప్పటికీ రోగుల తాకిడి ఎక్కువగా ఉంది.
మాదక ద్రవ్యాల మాఫియాను సమూలంగా నిర్మూలిస్తానంటూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రొడ్రిగో, మాఫియాపైనే కాకుండా దానికి బానిసలైన రోగులపై కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు దేశంలో ఆరువేల మంది మరణించగా, వారిలో 2,051 మంది పోలీసు కాల్పుల్లో మరణించారు. మిగతావారు జనం జరిపిన కాల్పుల్లో మరణించారు. డ్రగ్‌కు బానిసైనా, డ్రగ్ వ్యాపారి అని తెలిసినా కాల్చి పారేయమని, ఎలాంటి కేసుల్లేకుండా తాను చూసుకుంటానని రొడ్రిగో ప్రజలకు నేరుగా పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.
డ్రగ్ బానిసల చికిత్స కోసం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రొడ్రిగో రెండు కోట్ల డాలర్లను విడుదల చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని డ్రగ్స్ నుంచి విముక్తి పొందాలని, ఇదే ఆఖరి అవకాశమని కూడా నిధుల విడుదల సందర్భంగా ఆయన చెప్పారు. ఆ తర్వాత తాను తాడు పంపిస్తానని, ఆ తాడుతో ఉరేసుకొని చనిపోవాలని కూడా ఆయన సూచించారు.