సిడ్నీ : ఆస్ట్రేలియాలోని డార్లింగ్ నదిపై కార్పెట్‌లా పరచుకున్న మృత జీవాలకు సంబంధించిన దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను కలచివేస్తున్నాయి. నదిపై తేలియాడుతున్న మృత చేపలు కాలుష్యం, కరువుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వివరాలు... మెనిండీ సిటీలో కేంద్రీకృతమైన డార్లింగ్ నదీ భాగంలో గత కొన్ని రోజులుగా వేలాది సంఖ్యలో చేపలు మృత్యువాత పడుతున్నాయి. కరువు, వేడిమి తీవ్రత కారణంగా ఈ సంఖ్య నానాటికీ పెరగవచ్చని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నీటి ఎద్దడి, నీటిలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం, ప్లాస్టిక్ వర్థ్యాల వల్ల ఆల్గే విషపూరితం కావడం వంటి అంశాల కారణంగా ఈ దుష్ప్రరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే డార్లింగ్ నదిలోని జీవ జాలాలన్నీ కనుమరుగైపోయినా ఆశ్చర్యపడనవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రణాళికలు రచించాలని సూచించారు.
అదొక్కటే మార్గం..కానీ అసాధ్యం కదా..
ప్రస్తుతానికైతే పైపుల ద్వారా నీటిని నదిలోకి వదలడం ద్వారా కొన్ని జీవాలను రక్షించవచ్చని న్యూ సౌత్‌వేల్స్ నీటి పారదల శాఖ మంత్రి నియాల్ బ్లేయర్ పేర్కొన్నారు. ఇది అసాధ్యంతో కూడుకున్నదే అయినా వేరే మార్గం లేకే ఇలా మాట్లాడాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నది కాలుష్యంతో నిండిపోయింది. మంచి నీరు వస్తేనే జీవ జాలాలకు మనుగడ ఉంటుంది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. వర్షాలు లేక కరువు తాండవిస్తోంది. ప్రకృతి కన్నెర్ర చేసినపుడు డబ్బు వెచ్చించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదు. అయితే నదిని కాలుష్యం కాకుండా చూసుకునే బాధ్యత మాత్రం మనపై ఉంది’ అని వ్యాఖ్యానించారు. కాగా నదిలోకి విరివిగా వ్యర్థాలు వదిలిన కారణంగానే ఇలాంటి హృదయ విదారక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ‘మనిషి సృష్టించిన ప్రకృతి విపత్తు ఇది’ అని పర్యావరణ హితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment