'ప్రాణాలతో రానేమో.. అందరినీ చంపేస్తున్నారు'
ఆగ్రా/ఫిరోజాబాద్: ఢాకాలోని రెస్టారెంటుపై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలుకోల్పోయిన భారతీయ యువతి తరుషి జైన్(19) ఎంతటి భయానక పరిస్థితిని ఎదుర్కుందో ఆఖరి ఘడియల్లో తన తండ్రికి వివరించింది. తన ఇద్దరు స్నేహితులతోపాటు రెస్టారెంటులోని వాష్ రూమ్ లో దాక్కున్న ఆమె తండ్రికి ఫోన్ చేసి ఉగ్రవాదులు ఇక్కడ రెస్టారెంటులోకి చొరబడ్డారు. నాకు చాలా భయంగా ఉంది. నేను ప్రాణాలతో భయటకు వస్తానో లేదో కచ్చితంగా మాత్రం చెప్పలేను. ఇక్కడ అందరినీ వాళ్లు చంపేస్తున్నారు. నేను నా స్నేహితులతో కలిసి టాయిలెట్ లో దాచుకున్నాను. మేము కూడా ఒకరి తర్వాత ఒకరం హత్యకు గురవుతామనిపిస్తుంది' అని ఆమె తండ్రి సంజీవ్ జైన్ మీడియాతో చెప్పారు.
అదే ఆమె నుంచి చివరి మాటలని వివరించాడు. తన కూతురు నుంచి ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి తెల్లవార్లు గుర్షాన్ కేఫ్ వద్ద ఎంతో కంగారుగా ఎదురుచూశాడు. తెల్లవారు జామున ఆమె ఫోన్ డెడ్ అయినా బలగాలు సైనిక చర్యలు జరుపుతున్నారని, బంధీలకు విముక్తి లభిస్తుందని చెప్తుండగా ఆశగా ఎదురుచూశాడు. 13మంది బందీలకు విముక్తి అని చెప్పాక అందులో తమ కూతురు ఉండకపోతుందా అని భావించాడు. కానీ ఉగ్రవాదులు కర్కశంగా గొంతు కోసిన 20మందిలో తమ కూతురు కూడా ఉందని తెలిసి నిశ్ఛేష్టుడయ్యాడు. కాగా, తమ సోదరిని ఒక హిందువుగా భావించి దారుణంగా చేసిన ఆ ప్రాంతంలో మేం అంత్యక్రియలు నిర్వహించబోమని, ఇండియాకు తీసుకొచ్చుకుంటామని ఆమె సోదరుడు చెప్పాడు.