వరదలను 11నెలలు ముందుగా గుర్తించొచ్చు !
న్యూయార్క్ : ప్రకృతిని అతలాకుతలం చేసే ప్రళయభీకర వరదలను 11 నెలలు ముందుగానే గుర్తించే విధానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. నదీ పరివాహకప్రాంతాల్లో గురుత్వాకర్షణ క్షేత్రాలను ప్రతినిమిషం గమనిస్తూ, వరదలు వచ్చే సమయాన్ని చాలా ముందుగా గుర్తించవచ్చునట. వర్షరుతువు నాటికి నదుల్లో. వాటి పరివాహక ప్రాంతాల్లో ఎంత నీరు నిల్వ ఉన్నదో, ఎంత నిల్వ ఉండగలతో లెక్కించి వరదల స్థితిగతులను తెలుసుకునే నవీనపద్ధతిని సైంటిస్టులు కనుగొన్నారు. ఉపగ్రహాల సాయంతో ఈ విధానం రూపొందించినట్టు కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన భూభౌతిక శాస్త్రవేత్తలు జె.టి .రీగర్, ఇర్విన్‌లు వెల్లడించారు.
ఆయా ప్రాంతాల్లో వర్ష నీటి స్థితిని పాత డేటా ప్రకారం లెక్కలు వేసి ప్రస్తుతం వచ్చే వరదలను అంచనా వేయవచ్చునన్నారు. తాము వేసిన లెక్కల ప్రకారం ఐదునెలలు ముందుగానే వరదల స్థితిని తెలుసుకోవచ్చునని, మరింత అధ్యయనం తర్వాత 11నెలల ముందుగానే తెలుసుకోవచ్చన్నారు. ఈ మేరకు ‘లైవ్‌సైన్స్’అనే మేగజైన్ తాజా సంచికలో పేర్కొన్నారు. ఈ కొత్త విధానంతో అనేక దేశాల్లో వరదలను ముందుగానే గుర్తించి ప్రమాదతీవ్రతను తగ్గించవచ్చునని మేగజైన్ వివరించింది.