ఇస్లామాబాద్: సిక్కుల నిరీక్షణకు తెరపడనుంది. సిక్కులు పవిత్రంగా భావించే పాకిస్థాన్‌లోని గురుద్వార దర్బార్, కర్తాపూర్ నుంచి భారత్ గురుదాస్‌పూర్‌లోని డేరాబాబా నానక్ పుణ్యక్షేత్రం వరకు ప్రత్యేక రహదారి కారిడార్‌ను ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం బుధవారం శంకుస్థాపన చేసింది. భారతదేశం విజ్ఞప్తి మేరకు రెండు దేశాలలోని సిక్కు భక్తుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి అన్నారు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి భారత్ తరపున హాజరైన పంజాబ్ మంత్రి నవజ్యోతి సింగ్ సిద్దూ మాట్లాడుతూ.. 70 ఏళ్ల నిరీక్షణకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తెరదించారని ప్రశంసల జల్లు కురిపించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టన్ అమరీందర్ సింగ్ గురుదాస్‌పూర్‌లో ఇక్కడి కారిడార్‌కు మంగళవారం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.
పాక్‌లో జరిగే శంకుస్థాపన వేడుకకు పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్‌ను పాక్ ఆహ్వానించగా.. సరిహద్దుల్లో తమ జవానులను పాకిస్థాన్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకుంటున్నారంటూ ఆయన పాక్ ఆహ్వానాన్ని తిరస్కరించారు. సిక్కుల పవిత్ర గురువైన గురునానక్ తన జీవిత చరమాంకంలో కర్తాపూర్‌లో జీవించారు. గురునానక్ 550వ జయంతి నాటికి భారత్-పాక్‌ల మధ్య ఈ కారిడార్ ఏర్పాటు కావాలని చాలా మంది సిక్కులు కోరుకున్నారు. ఈ కారిడార్‌ను ఆరు నెలల్లో పూర్తిచేయాలనుకుంటున్నారు. ఇది పూరైతే సిక్కు భక్తులు ఎటువంటి వీసా లేకుండానే కర్తాపూర్‌ను సందర్శించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment