ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ
భారత్–రష్యా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక అధ్యాయానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన శ్రీకారం చుట్టబోతోంది. రష్యాతో ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ కొనుగోలు (ఐదు వ్యవస్థల కొనుగోలుకయ్యే వ్యయ ఒప్పందం దాదాపు రూ.50 వేల కోట్లు–550 కోట్ల డాలర్లు) కుదుర్చుకుంటే భారత్‌కు ఆంక్షలు తప్పవన్న అమెరికా తాజా హెచ్చరికల నేపథ్యంలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య కీలకాంశాలపై చర్చ జరిగినా క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందమే కీలకంగా మారనుంది. అయితే పుతిన్ పర్యటన భారత రక్షణరంగానికే పరిమితం కాకుండా అంతరిక్ష, ఇంధన రంగాల్లో పరస్పరసహకారానికి ఉపయోగపడనుంది.
ఏమిటీ ఆంక్షలు ?
2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను హస్తగతం చేసుకోవడం, సిరియా అంతర్యుద్ధంలో ప్రమేయం, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యంపై పుతిన్‌ను శిక్షించేందుకు కాట్సా (కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్‌సిరీస్ థ్రూ శాంక్షన్స్ యాక్ట్ ) చట్టాన్ని గత ఆగస్టులో అమెరికా ఆమోదించింది. రష్యాతో రక్షణ, నిఘారంగాల్లో వ్యాపారం చేసే దేశాలపై ఆటోమెటిక్‌గా ఆంక్షలు విధించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుందని గతంలోనే అమెరికా హెచ్చరించింది. ఆంక్షలు విధించేలా రష్యాతో లావాదేవీలు నెరపొద్దంటూ తన మిత్రదేశాలు, భాగస్వామ్యపక్షాలకు గతంలోనే అగ్రరాజ్యం విజ్ఞప్తి చేసింది. కాట్సా సెక్షన్ 23 పరిధిలోకి ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థతో సహా ఇతర అంశాలు వస్తాయని స్పష్టంచేసింది. రష్యా నుంచి చైనా వివిధ సైనిక ఉత్పత్తులు, ఎస్–400 వ్యవస్థను కొనుగోలు చేసినందుకు అమెరికా గత నెలలోనే ఆంక్షలు విధించింది. నాటో కూటమి మిత్రపక్షం టర్కీ కూడా రష్యా నుంచి క్షిపణి వ్యవస్థ కొనుగోలు చేయాలని నిర్ణయించడంపై అమెరికా గుర్రుగా ఉంది.
మినహాయింపుపై భారత్ ఆశాభావం..!
ప్రస్తుతం అమెరికా–రష్యా అంతర్గత పోరులో భారత్ చిక్కుకుంది. ఈ ఒప్పందం విషయంలో ఏదో ఒక రూపంలో అమెరికా ప్రభుత్వం నుంచి ఉపశమనం లభిస్తుందనే ఆశాభావంతో భారత్ ఉంది. రష్యాతో భారత్‌కు దీర్ఘకాలిక సైనిక సంబంధాలున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఎస్–400 వ్యవస్థపై ఇప్పటికే పలుపర్యాయాలు చర్చలు సాగిన నేపథ్యంలో ప్రస్తుతం తుదిదశకు చేరుకుందని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
అమెరికా–సోవియట్ ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో 80 శాతానికి పైగా సైనిక పరికరాలు రష్యా నుంచే భారత్‌కు వచ్చాయి. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో అమెరికా అతి పెద్ద ఆయుధాల సరఫరాదారుల్లో ఒకటిగా (గత పదేళ్లలో 1,500 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలతో) నిలుస్తోంది. తమ ఆయుధాల దిగుమతిలో ముందువరసలో ఉన్న భారత్‌పై అమెరికా కఠినమైన ఆంక్షలు విధించకపోవచ్చుననే అభిప్రాయంతో మనదేశం అధికారులున్నారు. క్షిపణి వ్యవస్థల కొనుగోలు విషయంలో ‘ప్రత్యేక మాఫీ’ లేదా ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని అమెరికాను భారత్ కోరనున్నట్టు తెలుస్తోంది.
పాకిస్తాన్‌పై పైచేయి..
ఈ క్షిపణి వ్యవస్థలతో మన రక్షణరంగం పాకిస్తాన్‌పై పైచేయి సాధించడంతో పాటు చైనాతో (ఈ దేశం ఇప్పటికే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది) సరిసమానంగా నిలిచేందుకు దోహదపడుతుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఒప్పందం ఖరారైతే వచ్చే రెండేళ్లలో మొదటి క్షిపణి వ్యవస్థ, నాలుగున్నరేళ్లలో మొత్తం అయిదు వ్యవస్థలు మనకు అందుబాటులోకి వస్తాయి. ఎస్–400 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (సామ్) వ్యవస్థలోని కమాండ్ పోస్ట్‌లో యుద్ధ నిర్వహణ పద్ధతులు, క్షిపణి ప్రయోగం, రాడార్ ద్వారా శత్రు దేశాల క్షిపణులు, విమానాలు, ఇతర యుద్ధ ప్రయోగాలను పసిగట్టి, వాటిని ఛేదించే ఏర్పాట్లున్నాయి.
ఈ క్షిపణి వ్యవస్థలను అన్ని ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా లాంఛర్ వాహనాలపై వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ క్షిపణి వ్యవస్థ సులువుగా ఎక్కడికైనా తరలించేందుకు వీలుగా ఉండడంతో యుద్ధమొచ్చినప్పుడు ఏ నగరాన్నయినా వైమానికదాడుల నుంచి కాపాడుకునేందుకు ఉపయోగపడుతుంది. పాకిస్తాన్ తక్కువ దూరం (షార్ట్ రేంజ్) నుంచి ప్రయోగించే నాసర్(హతఫ్–9) అణు క్షిపణిని నిరోధించేందుకు ఈ ఎస్–400 ఉపకరిస్తుంది.
ప్రత్యేకతలేంటీ ?
రష్యా అల్మాజ్ యాంటే సంస్థ ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను రూపొందించింది. ఒక్కో వ్యవస్థలో రెండు రాడార్లు, మిస్సైల్ లాంఛర్లు, కమాండ్ పోస్టులుంటాయి. ఒక్కో రాడార్ 100 నుంచి 300 లక్ష్యాలను ఏకకాలంలో గుర్తించగలదు. ఈ వ్యవస్థ దాదాపు 600 కి.మీ దూరం నుంచే శత్రు క్షిపణులు, ఇతర ప్రయోగాల జాడను కనిపెడుతుంది. 400 కి.మీ పరిధి నుంచే 36 లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించగలదు. పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలు దీని పరిధిలోకి వస్తాయి. శత్రుదేశాల నుంచి భిన్న పరిధుల్లో వచ్చే క్షిపణులు, ఇతర ప్రయోగాలను ఇందులోని సూపర్‌సోనిక్, హైపర్‌సోనిక్ మిసైల్స్ అడ్డుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment