S-400 Defence Missile System
-
భారత్‌కు కాట్సా నుంచి మినహాయింపు
వాషింగ్టన్: రష్యా నుంచి ఎస్–400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేస్తున్న భారత్‌పై ట్రంప్ హయాం నుంచి గుర్రుగా ఉన్న అమెరికా తాజాగా సానుకూల నిర్ణయం తీసుకుంది. కీలకమైన కౌంటరింగ్ అమెరికా అడ్వెర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్(కాట్సా) ఆంక్షల నుంచి మినహాయింపు నిచ్చింది. ఇందుకు ఉద్దేశించిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్(ఎన్డీఏఏ)కు చేసిన సవరణకు అమెరికా ప్రతినిధుల సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. చైనా వంటి దురాక్రణదారులను నిలువరించేందుకు భారత్‌కు ‘ఎస్–400’ఎంతో అవసరమని పేర్కొంది. కాట్సా నుంచి మినహాయింపు కల్పిస్తూ భారత్‌కు మద్దతుగా నిలిచేందుకు అధ్యక్షుడు బిడెన్ పరిపాలన తన అధికారాన్ని ఉపయోగించాలని కోరింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఇండో–అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రొ ఖన్నా సభలో ప్రవేశపెట్టారు. ఎంతో ప్రాముఖ్యమున్న ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించడం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ భారత ప్రభుత్వం 2018లో రష్యా నుంచి రూ.40 వేల కోట్ల విలువైన ఐదు ఎస్–400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. -
రష్యా నుంచి ఎస్–400 మిస్సైల్ సిస్టమ్ రాక
న్యూఢిల్లీ: ఒకవైపు ఉక్రెయిన్‌పై యుద్ధంపై కొనసాగిస్తున్న రష్యా మరోవైపు ఒప్పందం ప్రకారం భారత్‌కు ఎస్–400 ట్రయంఫ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ సరఫరాను ప్రారంభించింది. ఈ వ్యవస్థకు సంబంధించిన కొన్ని భాగాలు భారత్‌కు చేరుకోవడం మొదలయ్యిందని అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. మరికొన్ని కీలక విడిభాగాలు రావాల్సి ఉందని తెలిపాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ మిస్సైల్ సిస్టమ్ సరఫరాపై భారత్ అనుమానాలు వ్యక్తం చేసింది. జాప్యం జరిగే అవకాశం ఉందని భావించింది. అయినప్పటికీ ఒప్పందం ప్రకారం సరఫరా ప్రారంభం కావడం విశేషం. ఎస్–400 క్షిపణి వ్యవస్థకు సంబంధించి సెకండ్ రెజిమెంట్ భాగాలు భారత్‌కు రావడం మొదలయ్యిందని అధికారులు పేర్కొన్నారు. సైనిక శిక్షణకు ఉద్దేశించిన సిమ్యులేటర్లు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్షిపణి వ్యవస్థకు చెందిన మొదటి రెజిమెంట్ భాగాలను రష్యా గత ఏడాది డిసెంబర్లో సరఫరా చేసింది. ఎస్–400 మిస్సైల్ సిస్టమ్ భారత్–చైనా, భారత్–పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలను కవర్ చేస్తుందని అధికారులు తెలియజేశారు. భారత్‌కు ఎస్–400 సరఫరా విషయంలో.. తమపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావం ఏదీ ఉండదని రష్యా ఇటీవలే స్పష్టం చేసింది. ఎస్–400 ట్రయంఫ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ఐదు యూనిట్ల కొనుగోలు కోసం భారత్ 2018 అక్టోబర్‌లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.5 బిలియన్ డాలర్లు. దీనిపై అప్పట్లో అమెరికా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ భారత్ లెక్కచేయలేదు. ఒప్పందంపై తమ మాట వినకుండా ముందుకు వెళితే భారత్‌పై ఆంక్షలు విధిస్తామని డొనాల్డ్ ట్రంఫ్ ప్రభుత్వం హెచ్చరించింది. -
S-400 Air Defence System: బోర్డర్లో ‘బాహుబలి’
India Recently Imported S-400 Air Defence System Is Overhyped: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా పరిగణించే రష్యా తయారీ ఎస్–400 క్షిపణి వ్యవస్థ భారత సైన్యం అమ్ముల పొదిలో చేరింది. డ్రోన్లు, యూఏవీల ప్రయోగం ద్వారా నిత్యం చికాకులు సృష్టిస్తున్న పాకిస్తాన్‌కు చెక్ పెట్టేలా పంజాబ్‌లోని సరిహద్దుల్లో దీన్ని భారత ఆర్మీ సోమవారం మొహరించిందని ఏఎన్ఐ వార్తాసంస్థ విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ వెల్లడించింది. పాకిస్తాన్, చైనాల నుంచి ఆకాశమార్గాన ఎదురయ్యే ముప్పును ఇది సమర్థంగా తిప్పికొట్టగలదని తెలిపింది. నేలపై నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులు ఇందులో ఉంటాయి. 600 కిలోమీటర్ల సుదూరం నుంచి ప్రయోగించే క్షిపణులు, మన భూభాగం వైపు వస్తున్న విమానాలను, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్ (యూఏవీ)లను ఈ అధునాతన రక్షణ వ్యవస్థలోని కమాండ్ సెంటర్ పసిగట్టగలదు. వాటి నుంచి ఎదురయ్యే ప్రమాద తీవ్రత ఆధారంగా వేటిని ముందుగా కూల్చాలో నిర్ణయించగలదు. వాటిని నీర్విర్యం చేసేందుకు కచ్చితత్వంలో క్షిపణులను సంధింస్తుంది. అలాగే తోటి రక్షణ వ్యవస్థలతో సమన్వయం చేసుకోగలదు. భారత వాయుసేన, ఆర్మీలకు ఈ ‘బాహుబలి’ని ఆపరేట్ చేసేందుకు అవసరమైన శిక్షణను రష్యా అందజేసింది. ఇందులో మల్టీఫంక్షన్ రాడార్, సొంతంగా ముప్పును పసిగట్టి... లక్ష్యాలను చేధించే ఆటోమేటిక్ వ్యవస్థ, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్స్, లాంచర్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉంటాయి. 7 వేల కోట్లు: 2015లో ఐదు ఎస్–400 మిస్సైల్ సిస్టమ్ కొనుగోలుకు రష్యాతో భారత్ ప్రాథమిక ఒప్పందం చేసుకుంది. తుదిరూపు తీసుకొని 2018లో ఖరారైన ఈ ఒప్పందం విలువ రూ.35,000 కోట్లు. అంటే ఒక్కో సిస్టమ్ ధర రూ. 7 వేల కోట్లు. 400 కి.మీ.: యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, విమానంపై రాడార్ ఉండి.. కంట్రోల్ సెంటర్‌తో సహా ఆకాశంలో పహారా కాసే అవాక్స్ విమానాలను, యూఏవీలను, డ్రోన్లను సుదూరంగానే ఉన్నపుడే పసిగట్టగలదు. 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే కచ్చితత్వంతో మిస్సైల్ (క్షిపణులను) ప్రయోగించి శత్రువుల క్షిపణులను, విమానాలను నేలమట్టం చేయగలదు. 2 కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసిన టార్గెట్లను కూడా కూల్చగలదు. ఆకాశంలో 30 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్న వాటిని కూడా చేధించగలదు. 3 నిముషాలు: రాడార్ ద్వారా సిగ్నల్ అందిన మూడు నిముషాల్లో ఎదురుదాడి చేసే సామర్థ్యం దీని సొంతం. ►మన భూభాగం వైపు దూసుకువస్తున్న 80 వస్తువులను (క్షిపణులు, విమానాలు ఏవైనా కావొచ్చు) ఏకకాలంలో ట్రాక్ చేయగలదు. ►ప్రతి రెజిమెంట్‌లో ఎనిమిది లాంచర్లు (ప్రయోగ గొట్టాలు) ఉంటాయి. ప్రతి లాంచర్లో 4 క్షిపణులు ఉంటాయి. అంటే ఏకకాలంలో 32 క్షిపణులను ఎస్–400 సిస్టమ్ ప్రయోగించగలదు. 15 నిమిషాల్లో దీన్ని రీలోడ్ చేయవచ్చు. ►400 కి.మీ., 250 కి.మీ.ల దీర్ఘశ్రేణి క్షిపణులు, 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించే మధ్యశ్రేణి క్షిపణులు, 40 కి.మీ. లక్ష్యాలను చేధించే స్వల్పశ్రేణి క్షిపణులు ఉంటాయి. ►జూన్ 2022లో భారత్‌కు రెండో ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందనుంది. లద్దాఖ్, అరుణాల్ప్రదేశ్లలో సున్నితమైన, సమస్యాత్మకమైన సరిహద్దుల్లో శత్రు ముప్పును సమర్థంగా తిప్పికొట్టేందుకు భారత్ దీన్ని అక్కడ మొహరించే అవకాశాలున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి అమెరికా ఒత్తిడి బేఖాతరు తమ శత్రుదేశమైన రష్యా నుంచి భారత్ ఈ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడం అమెరికాకు నచ్చలేదు. అమెరికా తయారీ థర్మల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (థాడ్)ను తీసుకో వాలని ఆఫర్ ఇచ్చింది. అగ్రరాజ్యం ఆర్థిక ఆం క్షలు పెడతామని ఒత్తిడి తెచ్చినా.. భారత్ వెనక్కి తగ్గలేదు. ఇదెప్పుడో ఖరారైన ఒప్పం దమని తేల్చిచెప్పి థాడ్ కంటే మెరుగైన ఎస్–400 కొనుగోలు చేసింది. -
ఇక పాకిస్తాన్, చైనాకు చుక్కలే.. పంజాబ్‌లో ఎస్-400 మోహరింపు!
భారత వాయుసేన అమ్ముల పొదిలోకి రష్యాకు చెందిన అత్యాధునిక ఎస్-400 మిస్సైల్స్ వచ్చిచేరిన సంగతి తెలిసిందే. భారత్, రష్యా మధ్య గతంలో జరిగిన ఒప్పందం మేరకు వీటిని రష్యా భారత్‌కి పంపించింది. ఇప్పుడు భారత వైమానిక దళం ఎస్-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థను తాజాగా పంజాబ్ రాష్ట్రంలో పాకిస్తాన్ బోర్డర్ వెంట మోహరించింది. ప్రపంచంలో ఎక్కడా లేని అత్యాదునిక ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. డ్రోన్స్ నుంచి బాలిస్టిస్ మిస్సైల్స్ వరకు దేన్నైనా ఎదుర్కొనగల సామర్ధ్యం దీని సొంతం. ఎస్-400 ట్రైంఫ్ మిస్సైల్ సిస్టమ్‌లో మొదటిదాన్ని భారత్ ఇక్కడ మోహరించింది. పాకిస్తాన్, చైనా దేశాల నుంచి ఎదురయ్యే గగనతల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొంటూ దేశీయ గగనతలం శత్రుదుర్భేద్యంగా మార్చడంలో ఈ వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. తర్వాత తూర్పు సరిహద్దులో భారత వాయుసేన ఈ ఎస్-400 ట్రైంఫ్ మిస్సైల్ మోహరించే అవకాశం ఉంది. ఇది ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయాణించే మిస్సైల్ వ్యవస్థయే ఎస్- 400 మిస్సైల్. దీనిని ఎస్ఏ-21 గ్రోలర్ అని నాటో పిలుస్తుంది. ఇది అత్యంత సమర్థవంతంగైన మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థ అని దీన్ని ఎయిర్‌క్రాఫ్ట్, యూఏవీలు, క్రూయిజ్ మిస్సైల్స్తోనూ ఉపయోగించవచ్చు. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకతలు: ఎస్-400 రకాన్ని మాస్కోకు చెందిన ఆల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో రూపొందిచింది. సైన్యం, వాయుసేన, నౌకాదళానికి చెందిన ప్రస్తుత, భవిష్యత్ ఎయిర్ డిపెన్స్ యూనిట్స్‌తో దీన్ని ఇంటిగ్రేట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థలో S-300 రకంతో సహ ఇతర శత్రు విమానాలు, బాలిస్టిక్ క్షిపణుల లక్ష్యాలను ఛేదించేందుకు ఎస్-400 నాలుగు రకాల మిస్సైల్స్ ఉపయోగిస్తుంది. స్వల్ప-శ్రేణి (40 కి.మీ), మధ్యశ్రేణి (120 కి.మీ), 250 కి.మీ, 400 కి.మీ దూరంలో గల లక్ష్యాలను ఛేదించేందుకు ఇందులో నాలుగు వేర్వేరు మిస్సైల్స్ ఉన్నాయి. ఎస్-400 సంక్లిష్టమైన సైనిక సాంకేతికపరిజ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ఎగిరే వస్తువులను ట్రాక్ చేసి, కమాండ్ వాహనాన్ని అప్రమత్తం చేసే దీర్ఘ-శ్రేణి నిఘా రాడార్ ఇందులో ఉంది. S-400 రకం మిస్సైల్స్ పరీక్షలో 2000 ప్రారంభంలో మొదలైంది. 2007 నుంచి ఈ ఆయుధాలు ఉపయోగంలోకి వచ్చాయి. మాస్కో రక్షణ సహ వివిధ ప్రదేశాల్లో S-400లను రష్యా మొహరించింది. 2015లో S-400ను సిరియాలోనూ రష్యా మొహరించింది. అంతే కాదు క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత కొన్ని యూనిట్లను అక్కడ కూడా ఉంచింది. చైనా వైమానిక బెదిరింపులను ఎదుర్కోవటానికి భారతదేశం అవసరమైన ఐదు దీర్ఘ-శ్రేణి ఉపరితల-నుంచి-గాలి క్షిపణి వ్యవస్థలను సేకరించడానికి 2018లో 5.5 బిలియన్ డాలర్లతో రష్యాతో ఒక ఒప్పందం చేసుకుంది. (చదవండి: Oil Price: సామాన్యులకు ఊరట.. దిగిరానున్న వంట నూనె ధరలు!) -
చిరకాల మిత్రుడికి ఓ ఒప్పంద కానుక!
డిసెంబరు 6న, భారత్–రష్యాల 21వ వార్షిక సమావేశాలకు మనదేశానికి వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మనమిచ్చే కానుకగా ఎస్–400 ఒప్పందాన్ని అమలుచేస్తూ రష్యా మిత్రులమని నిరూపించుకొన్నాము. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 28 ఒప్పందాలు జరిగాయి. పుతిన్ తన ప్రసంగంలో అఫ్గానిస్తాన్ పరిస్థితులపై సహజంగా ఇరు దేశాలూ ఆందోళన చెందుతున్నాయన్నారు. అక్కడ ఉగ్రవాదం, తీవ్రవాదులకు అందుతున్న నిధులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై భారత్‌తో కలిసి పనిచేస్తామని అన్నారు. కోవిడ్‌తో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపలేదని ప్రధాని మోదీ చెప్పారు. ఇరు ఈ భేటీలో ప్రధానంగా వ్యూహాత్మక భాగస్వామ్యం, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపర్చటం, ఇంధన అంతరిక్ష రంగాలలో మరింత ముందుకు వెళ్తూ, రక్షణ రంగాల్లో అనేక కీలక ఒప్పందాలు జరిగాయి. ఏకే–47 తుపాకులు మనదేశంలో తయారయ్యే విధంగా ఒప్పందాలు కుదిరాయి. మన దేశం 2018లో రష్యాతో కుదుర్చుకొన్న 520 కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందం ప్రకారం ఐదు ఎస్–400 క్షిపణి రక్షణ కవచాల్ని మనం 2020 చివరి నాటికి దిగుమతి చేసుకోవాల్సి ఉంది, కానీ చెల్లింపులలో జాప్యం కారణంగా ఈ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. శత్రు దేశాల నుండి ప్రయోగించే క్షిపణులను ధ్వంసం చేయగల సమర్థత ఈ ఎస్–400 రక్షణ క్షిపణుల సొంతం. నూటికి నూరుపాళ్ళు సామర్థ్యం చూపే రక్షణ కవచాలుగా ఇవి పేరుగాంచాయి. అమెరికా థాడ్ వ్యవస్థ కంటే చాలా నమ్మదగ్గవిగా ప్రపంచ మిలటరీ ప్రావీణ్యుల అభిప్రాయం. ఎస్–400 రక్షణ క్షిపణులు 30 కిలోమీటర్ల ఎత్తులో 400 కిలోమీటర్ల పరిధిలోవున్న శత్రుక్షిపణులను ధ్వంసం చేసే శక్తిని కల్గి ఉంటాయి. అంతేగాక ఒకేసారి 300 క్షిపణులపై దాడి చేయగలవు. ఇప్పటికే టర్కీ, చైనా దేశాలు ఎస్–400 వ్యవస్థల్ని దిగుమతి చేసుకొన్నాయి. మధ్యప్రాచ్యం, ఆసియా పసిఫిక్, ఆఫ్రికాలలో మరొక 7 దేశాలు దిగుమతి చేసుకోవటానికి రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఎస్–400 వ్యవస్థ ఒక పెద్ద బ్యాటరీ, దీర్ఘశ్రేణి రాడార్‌తోనూ, లక్ష్య గుర్తింపు రాడార్‌ను కలిగి ఉండి ప్రతీ లాంచర్‌కి నాలుగు ట్యూబులు ఉంటాయి. కమాండర్ పోస్టు వాహనంలో 8మందితో కూడిన రెండు బెటాలియన్స్ ఉంటాయి. కమాండర్ పోస్టు, రాడార్లు, లాంచర్లు అసమానమైన రాళ్ళురప్పలు ఉండే భూభాగంపై కదిలే సామర్థ్యాన్ని కల్గిఉంటాయి. ఈ వాహనాలు మల్టీయాక్సిల్స్, మల్టీ వీల్స్ కల్గి ఉంటాయి. మన ఇండియన్ ఎయిర్‌ఫోర్సుకు చెందిన 100 మంది నిపుణులు ప్రస్తుతం రష్యాలో శిక్షణ పొందారు. రష్యాతో ఎస్–400 చర్చలు జరపవద్దని ట్రంప్ హయాం నుండి అమెరికా ప్రభుత్వం మన దేశ రక్షణ శాఖపై ఒత్తిడి చేస్తూనే ఉంది. గతంలో ఇరుదేశాల రక్షణ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో రష్యాతో కుదిరిన ఒప్పందాన్ని మానుకోమని ఆనాటి అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో భారత్‌పై గట్టి ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోయింది. మార్చి నెలలో భారత్‌లో పర్యటించిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ ‘కాట్సా’ (కౌంట రింగ్ అమెరికా అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్) ఆంక్షల ప్రేరణకు గురికాకుండా భారత్ చర్యలు చేపట్టాలని సూచించాడు. 2016లో ఎస్–400 చర్చలు జరుగుతున్నప్పుడు ‘కాట్సా’ చట్టం అమెరికాదనీ, ఇవేమీ ఐక్యరాజ్యసమితి ఆంక్షలు కావనీ, ఆ చట్టంతో మా దేశానికేమిటి సంబంధమనీ అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దీటుగా సమాధానమిచ్చారు. ఈ మధ్య మోదీ ప్రభుత్వం అమెరికాతో మిలటరీపరంగా లాజిస్టిక్స్ ఒప్పందాల వంటివి అనేకం చేసుకొంది. ‘క్వాడ్’ కూటమిలో కూడా భారత్ ప్రవేశించి విదేశాంగ, రక్షణ విధానాలను అమెరికా వైపునకు మొగ్గు చూపుతూ తన చిరకాల మిత్రుడు రష్యాకు దూరమవుతున్నట్లుగా వస్తున్న విమర్శల నుండి బయటపడడానికి కూడా ఎస్400 ఒప్పందం తోడ్పడుతుందని భావిస్తోంది. ఎస్–400 వంటి రక్షణ వ్యవస్థల దిగుమతి పెరిగేకొద్దీ అసలు క్షిపణుల ఉపయోగమే ఉండదు. చైనా, భారత్ రెండు వైపులా ఎస్–400లను స్థాపించుకొంటే ఒకరిపై ఒకరు క్షిపణులను ప్రయోగించినా అవి గాలిలోనే ఎస్–400 సహాయంతో ధ్వంసమౌతాయి గనుక ఇక క్షిపణుల తయారీ, మోహరింపులకు అర్థం లేదు. మరోవైపు శత్రువుల నుండి వచ్చే క్షిపణులను ఛేదిస్తూనే సమాంతరంగా క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు గనుక క్షిపణుల రక్షణ వ్యవస్థ లేకుంటే నష్టపోతారు. రష్యా వ్యతిరేక నాటో యుద్ధకూటమిలోని 28 దేశాల్లోని టర్కీ నేడు రష్యా నుంచి ఎస్–400లను దిగుమతి చేసుకొం దంటే, ఈ వ్యవస్థకున్న ప్రాధాన్యం అర్థమవుతోంది. అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా కూడా ఎస్–400 వ్యవస్థల కోసం సంప్రదింపులు జరుపుతూండటం గమనార్హం. బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్ కె.ఎల్. యూనివర్సిటీ ‘ 98494 91969 -
భారత్‌కు ఎస్–400 క్షిపణి వ్యవస్థ
న్యూఢిల్లీ: ఉపరితలం నుంచి గగన తలంలోని లక్ష్యాలను ఛేదించే ఎస్–400 క్షిపణుల సరఫరా ప్రక్రియను రష్యా ప్రారంభించింది. భారత్‌కు ఈ క్షిపణులను అందజేస్తున్నామని రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలటరీ టెక్నికల్ కోపరేషన్ డైరెక్టర్ దిమిత్రి షుగావ్ చెప్పారు. ‘‘ముందుగా అనుకున్న ప్రకారమే భారత్‌కు ఎస్–400 క్షిపణుల్ని సరఫరా చేసే ప్రక్రియ ప్రారంభమైంది’’అని దుబాయ్ ఎయిర్ షో ప్రారంభానికి ముందు వెల్లడించారు. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పుని ఎదుర్కోవడంలో ఎస్–400 క్షిపణులు మన దేశానికి అండగా నిలవనున్నాయి. మొదటి క్షిపణిని చైనాతో సంక్షోభం నెలకొని ఉన్న లద్దాఖ్ సెక్టార్లో మెహరించాలని భారత వాయుసేన భావించినట్టు తెలుస్తోంది. మరోవైపు చైనా, పాకిస్తాన్ల నుంచి ఏకకాలంలో వచ్చే ముప్పుని ఎదుర్కోవడానికి వీలుగా పశ్చిమ ప్రాంతంలో ఈ క్షిపణుల్ని మోహరించే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్టుగా రక్షణ శాఖలోని కొందరు అధికారులు చెబుతున్నారు. చైనా ఇప్పటికే ఎస్–400 రెండు క్షిపణుల్ని లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మోహరించింది. 2018లో రూ.35 వేల కోట్లతో 5 ఎస్–400 క్షిపణుల కొనుగోలుకు రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. సముద్రం, గగనతలం మీదుగా ఈ క్షిపణుల అందజేయనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 5 క్షిపణులు భారత్‌కు చేరనున్నాయి. ఇప్పటికే ఈ క్షిపణుల వినియోగంపై భారత వైమానిక దళం అధికారులకు శిక్షణ కూడా పూర్తయింది. అమెరికా అభ్యంతరాలు భారత్, రష్యాతో క్షిపణుల కొనుగోలు ఒప్పందాన్ని మొదట్నుంచీ అమెరికా వ్యతిరేకిస్తోంది. రష్యాతో ఎలాంటి లావాదేవీలు చేయొద్దని ఒత్తిడి పెంచుతోంది. అయితే ప్రాంతీయ భద్రత, రక్షణ రంగంలో అవసరాల దృష్ట్యా ఎస్–400 ఒప్పందానికి మినహాయింపు ఇవ్వాలని అమెరికా సెనేటర్లు అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. దీనిపై ఎలాంటి స్పందన రాకుండానే క్షిపణి వ్యవస్థ భారత్‌కు చేరుకునే ప్రక్రియ ప్రారంభం కావడం గమనార్హం. -
నిర్దేశిత సమయానికే భారత్‌కు ఎస్- 400
-
అమెరికా ఆయుధ వ్యవస్థ అంత బలహీనమా?
మాస్కో : సౌదీ చమురు క్షేత్రాలపై యెమెన్‌కు చెందిన హౌతీ ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా దాడులు చేయడం తెలిసిందే. ఈ ఘటనతో పశ్చిమాసియా ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులకు ఇరాన్ కారణమంటూ ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉండాలని అమెరికా హెచ్చరికలు చేస్తోంది. సౌదీ అరేబియా కూడా ఇరాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్యలు తప్పవని హెచ్చరించింది. తమను వేలెత్తి చూపితే యుద్ధానికి కూడా వెనకాడబోమని, ఈ ప్రాంతంలో అమెరికా స్థావరాలను, నౌకలను నాశనం చేస్తామని ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందించింది. అయితే ఇక్కడ అమెరికా ఆయుధ సామర్థ్యంపై రక్షణ నిపుణులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశానికి అందనంత దూరంలో అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఉన్నది అమెరికాకు మాత్రమే అని తరచూ ఆ దేశం జబ్బలు చరుచుకుంటుంది. తన మిత్ర దేశాలకు ఆయుధాలను అమ్మి సొమ్ము చేసుకుంటోంది. అమెరికా ఆయుధాల ప్రధాన దిగుమతిదారులలో సౌదీ అరేబియా కూడా ఒకటి. పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికాకు మిత్రదేశంగా ఉంటూ అంతర్జాతీయ అంశాలలో, ముఖ్యంగా ఇరాన్ విషయంలో ఈ రెండు దేశాలు ఒకే మాట మీద ఉంటున్నాయి. అందుకే సౌదీపై ఉగ్రదాడులు జరిగిన మరుక్షణమే అమెరికా స్పందించింది. బాధ్యత వహించాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఇరాన్‌ను నిందించారు కూడా. ఈ ఘటనపై ఎలా ముందుకెళ్లాలంటూ అమెరికా, సౌదీలు ప్రస్తుతం తీవ్ర చర్చలే జరుపుతున్నాయి. సౌదీ అరేబియా మోహరించిన గగనతల రక్షణ స్థావరాలు యుద్ధం వస్తే.. సౌదీ గగనతలం పటిష్టమేనా? అమెరికా, సౌదీలు ఏమాత్రం తీవ్ర నిర్ణయాలు తీసుకున్నా యుద్ధం తప్పదు. ఇవి రెండూ మూకుమ్మడిగా ఇరాన్‌పై దాడి చేస్తే ఇరాన్ తొలుత సౌదీనే లక్ష్యంగా చేసుకుంటుంది. మరి సౌదీ గగనతల రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టమో గతవారం దాడులతో తెలిసిపోయింది. సౌదీ అరేబియా తమ దేశం సరిహద్దుల గుండా అమెరికా ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ పేట్రియాట్‌ను మోహరించింది. అత్యంత శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్థగా చెప్పుకునే ఈ వ్యవస్థలో బహుళ పేట్రియాట్ లాంచర్లు, ఏజిస్ విధ్వంసకారులు, రాడార్లు సౌదీ గగనతలాన్ని కాపలాకాస్తున్నాయి. రక్షణ వ్యవస్థలో భాగంగా సౌదీ తమ దేశం చుట్టూ 88 పేట్రియాట్ లాంచర్లు మోహరించింది. వీటిలో అత్యాధునీకరించిన పాక్-3 తరగతికి చెందిన పేట్రియాట్ క్షిపణులు 52 ఉన్నాయి. 100 ఎస్ఎమ్-2 మిసైల్స్‌ను తీవ్ర ఉద్రిక్తతలు గల పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉంచింది. ఈ రక్షణ వ్యవస్థతో సౌదీ గగనతలంలోకి వచ్చే శత్రుదేశానికి చెందిన ఎలాంటి క్షిపణులు, యుద్ధ విమానాలైనా ధ్వంసం కాగలవని సౌదీ విశ్వాసం. అమెరికా పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థ అయితే, గగనతల రక్షణ వ్యవస్థ వీరు చెప్పుకుంటున్నట్లు అంత పటిష్టమేనా అనే సందేహం రాకమానదు. ఎందుకంటే ఒక చిన్న దేశానికి చెందిన ఉగ్రవాదులు ఆయుధాలు కల్గిన డ్రోన్లతో పూర్తి రాడార్ కవరేజీ గల సౌదీ ప్రఖ్యాత చమురు సంస్థ ఆరామ్కో క్షేత్రాలపై దాడులు చేస్తేనే గుర్తించలేకపోయారు. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో ఈ సంఘటనే స్పష్టం చేస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే నిజంగా యుద్ధం వచ్చి ఇరాన్ యుద్ధ విమానాలు సౌదీని చుట్టుముడితే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తకమానదని యుద్ధరంగ నిపుణులు అంటున్నారు. రష్యన్ ఎస్-400 రష్యా తయారీ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400ను అన్ని ప్రధాన దేశాలు కొనాలని ఉత్సాహం చూపిస్తున్నాయి. వాటిని కొంటే ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. తమ గగనతల రక్షణ వ్యవస్థ పేట్రియాట్ ఎస్-400కన్నా మెరుగైందని, అలాగే తమ యుద్ధ విమానాలు కొనాలని సూచిస్తోంది. అయినా అమెరికా నాటో మిత్రదేశం టర్కీ రష్యా నుంచి ఎస్-400 క్షిపణులను కొనుగోలు చేసింది. ఈ చర్యతో అంతర్జాతీయంగా అమెరికా భంగపడ్దా టర్కీని ఏమనలేక మిన్నకుండింది. రష్యా ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ఇప్పుడు డ్రోన్ దాడులతో సౌదీలో అమెరికా తయారీ గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యం ఏపాటిదో తెలిసిపోయింది. అంటే అమెరికా రక్షణ వ్యవస్థనే అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై మైక్ పాంపియో మాట్లాడుతూ.. కొన్నిసార్లు అత్యంత ఉన్నతమైనవి కూడా విఫలం అవుతుంటాయని, అయినా దాడి సమయంలో ఒక్క పేట్రియాట్ మాత్రమే సేవలు అందిస్తోందని తమ బలహీనతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. రష్యా సైనిక అధికారి మాక్సిమ్ సుఖోవ్ ఇదే విషయమై ట్వీట్ చేశారు. ‘విఫలమైన రక్షణ వ్యవస్థను అన్ని కోట్ల డాలర్లు పెట్టి కొనడం ఎందుకని’ సౌదీ అరేబియాను ప్రశ్నించారు. చదవండి : అమెరికా, రష్యా మధ్య అణు యుద్ధం జరిగితే.... -
టర్కీ చేరిన రష్యా ఎస్–400 క్షిపణులు
ఇస్తాంబుల్: రష్యా నుంచి ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థలు కొనరాదంటూ అగ్రరాజ్యం అమెరికా చేసిన హెచ్చరికలకు టర్కీ ప్రభుత్వం లొంగలేదు. అమెరికా హెచ్చరికలు భేఖాతరు చేస్తూ రష్యా తయారీ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్–400 క్షిపణులను టర్కీ కొనుగోలు చేసింది. కొనుగోలులో భాగంగా మొదటి దశ క్షిపణులు శుక్రవారం టర్కీ రాజధాని అంకారాకు చేరుకున్నాయి. ఈ మేరకు టర్కీ రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా నుంచి ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారత్ కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా ఇప్పటికే అభ్యంతరాలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఇక తాజా కొనుగోలుతో అమెరికా, టర్కీల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ కొనుగోలుకు సంబంధించి టర్కీని అమెరికా ఈ వారమే హెచ్చరించింది. టర్కీ గనుక రష్యా క్షిపణులను కొనుగోలు చేస్తే తదుపరి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. జూలై 31లోగా కొనుగోలును రద్దు చేసుకోకుంటే ఎఫ్–35 యుద్ధ విమానాలపై టర్కీ ఆశలు వదులుకోవాల్సిందేనని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. అలాగే వీటిని నడపడానికి అమెరికాలో శిక్షణ తీసుకుంటున్న టర్కీ పైలెట్లను వెనక్కి పంపిస్తామని పేర్కొంది. అయితే ఈ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని టర్కీ రష్యా నుంచి కొనుగోళ్లకే మొగ్గు చూపడం అమెరికాకు ఆగ్రహం తెప్పించే అవకాశం ఉంది. -
అమెరికా వద్దన్నా.. టర్కీకి చేరిన ఎస్-400
అంకారా(టర్కీ) : రష్యా తయారీ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400 ట్రయంఫ్ కొనుగోలు చేయరాదంటూ అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా ఎట్టకేలకు టర్కీ వాటిని కొనుగోలు చేసింది. ఈ క్షిపణులు శుక్రవారం టర్కీ రాజధాని అంకారాకు చేరాయి. ఈ చర్యతో అమెరికా టర్కీల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఎస్-400 నాటో సిద్ధాంతాలకు విరుద్ధమైందని అమెరికా చాలా సార్లు పేర్కొంది. టర్కీ గనుక రష్యా నుంచి క్షిపణులు కొనాలని నిర్ణయం తీసుకుంటే మానుంచి ఐదవతరం అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్-35 తీసుకోలేదని పదే పదే హెచ్చరించింది. అయితే ఈ హెచ్చరికలు పక్కన పెట్టిన టర్కీ ఎస్-400 వ్యవస్థను కొనడానికే నిర్ణయం తీసుకుంది. రష్యా టర్కీలు 2017లోనే ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అప్పటి నుంచి వీలు దొరికినప్పుడల్లా అమెరికా టర్కీపై ఒత్తిడి చేస్తూనే ఉంది. దీనిపై టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగన్ చాలాసార్లు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ఇక టర్కీ ఎఫ్-35 యుద్ధవిమానాలపై ఆశలు వదులుకోవాలని నాటో (ప్రధాన కార్యలయం బెల్జియం) రక్షణకార్యదర్శి మార్క్ ఎస్పర్ వ్యాఖ్యానించారు. వీటిని నడపడానికి అమెరికాలో శిక్షణ తీసుకుంటున్న టర్కీ పైలెట్లు తిరిగి పంపబడతారని వెల్లడించారు. ఇప్పటికే ఎఫ్-35 లో పెట్టుబడి పెట్టిన టర్కీకి ఈ నిర్ణయం శరాఘాతమే. బ్లాక్‌లిస్టెడ్ దేశాల నుంచి ఆయుధాలను కొనరాదంటూ అమెరికా తెచ్చిన ‘కాట్సా’ చట్టం పరిధిలో టర్కీని చేర్చి ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టర్కీ ఆర్థిక వ్యవస్థపై ఈ ఆంక్షలు తీవ్రంగా ప్రభావాన్ని చూపడమేగాక, ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌ను తొలగించిన ఎర్డోగన్ కు మరిన్ని తలనొప్పులు రావొచ్చు. టర్కీ నాటో భవితవ్యంపై ఈ కొనుగోలుతో టర్కీ నాటో భవితవ్యంపై నీలీనీడలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా నాటో కూటమి ఏర్పడిందే రష్యాకు వ్యతిరేకంగా. ఇప్పుడు ఆ కూటమిలోని ఓ దేశం రష్యానుంచి ఆయుధాలను కొనడంతో నాటోకు తదుపరి పరిణామాలపై అర్థం కానీ పరిస్థితి నెలకొంది. అమెరికా, టర్కీల మధ్య సిరియా విషయంలో వివాదం రేగిన విషయం తెలిసిందే. మరొక వైపు రష్యా, టర్కీల మధ్య స్నేహం పెరిగింది. దీంతో రష్యా నుంచి ఎస్-400ను కొనాలని టర్కీ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచే ఎర్డోగన్‌కు వ్యతిరేకంగా దేశంలో రాజకీయ పవనాలు వీయడం మెదలెట్టాయి. దీనికి కారణం పశ్చిమదేశాలనే అని ఎర్డోగన్ వాదన. జర్నలిస్టులను, తనకు అడ్డువచ్చిన వారిని ఎర్డోగన్ జైలులో పెడుతున్నారనే కారణంతో ఇప్పటికే నాటోలోని దేశాలతో టర్కీకి వివాదాలు చెలరేగాయి. టర్కీలో ప్రజాస్వామ్యం, మానవహక్కులు ప్రమాదంలో పడ్డాయనే ఆరోపణలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. టర్కీ నాటో కూటమిలో ఏకైక ముస్లిం దేశం, అలాగే కూటమిలో రెండవ అతిపెద్ద స్టాండింగ్ ఆర్మీ కలిగి ఉంది. అయితే ఇప్పుడు ఈ తాజా వివాదంతో నాటో నుంచి బయటపడటం వల్ల తమకు కలిగే ప్రతిఫలమే ఎక్కువ అని ఎర్డోగాన్ భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. రష్యా స్పందన ఏంటి? టర్కీతో కుదిరిన ఈ ఒప్పందం కేవలం వ్యాపారపరమైందని రష్యా చెబుతోంది. క్షిపణి వ్యవస్థతో పాటు కేవలం పాక్షిక టెక్నాలజీని మాత్రమే టర్కీకి బదిలీ చేశామని పేర్కొంది. అదే విధంగా ఎస్ -400 లను కొనుగోలు చేయకుండా భారతదేశాన్ని నిరోధించడానికి వాషింగ్టన్ ప్రయత్నించినా, అక్టోబర్‌లో మాస్కో నుంచి క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడానికి న్యూఢిల్లీ ఒప్పందం కుదుర్చుకుందని రష్యా వాదన. ఆయా దేశాల ప్రాధాన్యతను ఎవరూ నియంత్రించలేరని ఈ సందర్భంగా అమెరికాకు చురకలు అంటించింది. కానీ నాటో దేశాలు మాత్రం రష్యా తీరును విమర్శిస్తున్నాయి. వ్యూహాత్మకంగా కీలక ప్రదేశంలో ఉన్న టర్కీని నాటో నుంచి బయటకు లాగడానికి చూస్తూ సరికొత్త డ్రామాకు తెరలేపిందని అంటున్నాయి. ఎస్-400 గత కొంతకాలంగా అమెరికా ఈ పేరు వింటేనే ఉలిక్కిపడుతోంది. ప్రస్తుత కాలంలో అత్యున్నత గగనతల రక్షణ వ్యవస్థగా పేరుతెచ్చుకున్న ఈ రష్యా తయారీ ఎస్-400 శత్రు క్షిపణులను గాలిలోనే పేల్చి వేయగలదు. ముఖ్యంగా రాడార్‌కు చిక్కని, అత్యున్నత యుద్ధ విమానంగా అమెరికా పేర్కొంటున్న ఎఫ్-35ని ఇట్టే నేలకు కూల్చేయగలదని రష్యా భావన. అందుకే అమెరికా వీటిని కొనుగోలు చేయరాదంటూ భారత్, టర్కీ తదితర దేశాలపై సందర్భం వచ్చినప్పుడల్లా సన్నాయినొక్కులు నొక్కుతోంది. ఎస్ -300 యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఎస్-400ను అభివృద్ధి చేశారు. మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ ఎస్ -400 ట్రయంఫ్ ఉపరితలం నుండి అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ 250 కిలోమీటర్ల దూరం వద్ద విమానాలను, అలాగే 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించగలదు. -
ఢిల్లీ చేరుకున్న పాంపియో
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ బుధవారం ఆయనతో భేటీ కానున్నారు. రష్యా నుంచి ఎస్400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు, ఉగ్రవాదం, హెచ్1బీ వీసా, వాణిజ్యం, ఇరాన్‌పై ఆంక్షలతో చమురు కొనుగోళ్లపై ప్రభావం వంటి పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. బుధవారం పాంపియో ప్రధాని మోదీతోనూ సమావేశం కానున్నారు. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో భారత, అమెరికా వాణిజ్యవేత్తలతో పాంపియో మాట్లాడతారు. మోదీతో భేటీ కానున్న ట్రంప్ జపాన్‌లోని ఒసాకాలో 28, 29 తేదీల్లో జరిగే జీ20 దేశాల సమావేశానికి హాజరుకానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీసహా పలువురు ప్రపంచ దేశాధినేతలతో సమావేశం కానున్నారు. భారత్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులతో పాటు జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్, చైనా అధ్యక్షులు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్‌లతో ఆయన సమావేశం కానున్నట్టు యూఎస్ ప్రభుత్వాధికారి ఒకరు సోమవారం విలేకరులకు తెలిపారు. -
‘ఎస్–400’పై అమెరికా కన్నెర్ర
వాషింగ్టన్: రష్యా నుంచి అత్యాధునిక ఎస్–400 క్షిపణి నిరోధక వ్యవస్థను కొనుగోలు చేయాలన్న భారత్ నిర్ణయంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి మండిపడింది. భారత్ ఈ ఒప్పందం విషయంలో ముందుకెళితే అమెరికా–ఇండియాల రక్షణ సంబంధాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఈ విషయమై అమెరికా రక్షణశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ..‘అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు పెరుగుతున్నంతకాలం రష్యా నుంచి ఎస్–400ను కొనుగోలు విషయంలో భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉండదనడం సరికాదు. క్యాస్టా చట్టం ప్రకారం రష్యా నుంచి ఆయుధాల, ఇతర టెక్నాలజీని కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు అమలవుతాయి. దీనివల్ల భారత్‌కు భవిష్యత్‌లో అత్యాధునిక సాంకేతిక సహకారం ఆగిపోతుంది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం వల్ల ఆ దేశం అనుసరిస్తున్న దుందుడుకు విధానాలకు మద్దతుపలికినట్లు అవుతుంది. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. నాటో భాగస్వామి అయిన టర్కీతో ఇదే విషయమై చర్చలు సాగుతున్నాయి. ఎస్–400 వ్యవస్థ కారణంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. మా అత్యుత్తమ టెక్నాలజీ వ్యవస్థలను రష్యన్ ఆయుధ వ్యవస్థలతో కలగాపులగం కానివ్వం’ అని స్పష్టం చేశారు. -
రష్యాకు ఆ అవకాశం ఇవ్వను : ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా, రష్యా దేశాల మధ్య ఉన్న ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ- ఐఎన్ఎఫ్(మధ్యస్థాయి అణ్వాయుధాల ఒప్పందం) ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరుదేశాల అంగీకారంతో ఈ ఒప్పందం కుదిరింది.. కానీ రష్యా ప్రతీసారి అందులోని నిబంధనలు ఉల్లంఘిస్తోందని ట్రంప్ ఆరోపించారు. కేవలం ఈ కారణంగానే ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒబామా ఎందుకలా చేశారో? ‘రష్యా ప్రవర్తించిన తీరు కారణంగా ఈ ఒప్పందం ఎప్పుడో రద్దు అవ్వాల్సింది. కానీ ఒబామా దీనిని ఎందుకు కొనసాగించారో నాకైతే తెలియదు. మేము ఈ ఒప్పందంలోని ప్రతీ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాం. రష్యాకు ఇకముందు ఎటువంటి అవకాశం ఇవ్వదల్చుకోలేదు. అణ్వాయుధాల విషయంలో అమెరికా చాలా జాగరూకతతో వ్యవహరిస్తోంది. కాబట్టి ఈ ఒప్పందంలో ఇకపై అమెరికా ఒక్కటే కొనసాగుతుంది. ఎందుకంటే మేము ఐఎన్‌ఎఫ్‌ను గౌరవిస్తున్నాం. దురదృష్టవశాత్తు రష్యా అలా చేయలేకపోయింది. ఇంతటితో ఇది ముగిసింది’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న సమయంలో.. ప్రపంచంపై ఆధిపత్యం సంపాదించేందుకు, అగ్ర రాజ్య హోదా పొందేందుకు అమెరికా, రష్యాలు పోటాపోటీగా అణ్వాయుధాలు తయారు చేస్తున్న సమయంలో... యూరోపియన్ కూటమిలోని దేశాల రక్షణకై ఇరుదేశాలు ఐఎన్ఎఫ్ అనే చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఓవైపు ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తూనే.. అణ్వాయుధాలను ప్రపంచం నుంచి తొలగించాలని భావిస్తున్నామంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, అప్పటి యూఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు మైఖేల్ గోర్బచ్ఛేవ్ 1987, డిసెంబరులో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. మధ్యస్థాయి, చిన్న తరహా క్షిపణులను నిర్మూలించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఐఎన్ఎఫ్ ద్వారా 1991,మే నాటికి సుమారు 2,692 క్షిపణులు, వాటి లాంచర్లను, మరికొన్ని సంప్రదాయ క్షిపణులకు ఇరుదేశాలు ముగింపు పలికాయి. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి రష్యా ఈ ఒప్పందానికి తూట్లు పొడుస్తుందంటూ ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల్లో దీనికి ప్రముఖ స్థానం ఉందంటూ విమర్శించారు. కాగా 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను హస్తగతం చేసుకోవడం, సిరియా అంతర్యుద్ధంలో ప్రమేయం, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను శిక్షించేందుకు కాట్సా (కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్‌సిరీస్ థ్రూ శాంక్షన్స్ యాక్ట్ ) చట్టాన్ని అమెరికా గత ఆగస్టులో ఆమోదించింది. రష్యాతో రక్షణ, నిఘారంగాల్లో వ్యాపారం చేసే దేశాలపై ఆటోమెటిక్‌గా ఆంక్షలు విధించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుందని గతంలోనే అమెరికా హెచ్చరించింది. అయితే చైనా, పాకిస్తాన్లను నిలువరించాలంటే భారత్‌కు...ఎస్- 400 ట్రయంఫ్ క్షిపణి వ్యూహాత్మక అవసరంగా మారింది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి ఎస్- 400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై స్పందించిన ట్రంప్.. ‘భారత్‌కు త్వరలోనే తెలుస్తుంది. మీరే చూస్తారుగా.. మీరు ఊహించడానికి ముందే’ అంటూ చేసిన వ్యాఖ్యానించారు. అయితే రష్యాతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసిన ట్రంప్... భారత్ పట్ల ఎటువంటి వైఖరి ప్రదర్శిస్తారో అనే అంశం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. -
భారత్-రష్యా ఎస్-400 ఒప్పందంపై అమెరికా ఆగ్రహం!
-
భారత్‌కు త్వరలోనే తెలుస్తుంది: ట్రంప్
వాషింగ్టన్: అధునాతన క్షిపణి వ్యవస్థ ఎస్–400 కొనుగోలు కోసం రష్యాతో ఒప్పందం చేసుకున్న భారత్‌కు ఆంక్షల వర్తింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. శ్వేతసౌధంలో జరిగిన ఓ సమావేశంలో విలేకర్లు ఈ అంశాన్ని లేవనెత్తగా.. ‘భారత్‌కు త్వరలోనే తెలుస్తుంది’ అని అన్నారు. ఎప్పుడు? అని ప్రశ్నించగా.. ‘మీరే చూస్తారుగా.. మీరు ఊహించడానికి ముందే’ అని బదులిచ్చారు. రష్యా, ఉ.కొరియా, ఇరాన్ కంపెనీలతో రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్ల లావాదేవీలు నిర్వహించే దేశాలపై ఆంక్షలు విధించడానికి అమెరికా కాట్సా (కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్) అనే చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఆంక్షల నుంచి భారత్‌కు మినహాయింపు ఇచ్చేందుకు అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు జేమ్స్ మేటిస్, మైక్ పాంపియోలు అనుకూలంగా ఉన్నా అధ్యక్షుడు ట్రంప్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను సున్నా స్థాయికి తగ్గించుకోవాలన్న తమ ఆదేశాలను పాటించని దేశాల సంగతిని తేలుస్తామని ట్రంప్ హెచ్చరించారు. -
ఆ రెండింటితో వాయుసేన సుసంపన్నం
హిన్డన్/చెన్నై: అధునాతన రాఫెల్ యుద్ధవిమానాలు, క్షిపణి విధ్వంసక రష్యా ఎస్–400 వ్యవస్థలను సమకూర్చుకుంటే భారత వాయుసేన(ఐఏఎఫ్) మరింత దుర్భేద్యంగా మారుతుందని ఐఏఎఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా వ్యాఖ్యానించారు. గగనతలంలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు వాయుసేన సంసిద్ధంగా ఉందన్నారు. ఐఏఎఫ్ 86వ వ్యవస్థాపక దినోత్సవం(ఎయిర్‌ఫోర్స్ డే) సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న హిన్డన్ వైమానిక స్థావరంలో నిర్వహించిన కార్యక్రమంలో ధనోవా మాట్లాడారు. -
గగనతలం.. శత్రు దుర్భేద్యం!
న్యూఢిల్లీ: భారత్, రష్యా రక్షణ సంబంధాల్లో మరో గొప్ప ముందడుగు పడింది. అమెరికా ఆంక్షల బెదిరింపులను తోసిరాజని రష్యా నుంచి ఎస్–400 ట్రయంఫ్ అనే అధునాతన గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. 2022 నాటికి చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌కు సాంకేతిక సహకారం అందించేందుకు రష్యా అంగీకరించింది. ఢిల్లీలో శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీల మధ్య 19వ ఇండియా–రష్యా వార్షిక సమావేశం ముగిశాక ఇరు దేశాల మధ్య అంతరిక్షం, రైల్వేలు, అణుశక్తి, విద్య, ఎరువులుతదితర రంగాల్లో 8 ఒప్పందాలు కుదిరాయి. ఆచితూచి స్పందించిన అమెరికా.. భారత్, రష్యాల మధ్య ఎస్–400 ఒప్పందం కుదిరాక అమెరికా ఆచితూచి స్పందించింది. మిత్ర దేశాల సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడం కాట్సా ఉద్దేశం కాదని పేర్కొంది. ఒక్కో ఒప్పందాన్ని బట్టి దానికి ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలా? లేదా? అనేది నిర్ణయిస్తామని తెలిపింది. ఉగ్రపోరులో సహకారం బలోపేతం.. సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని భారత్, రష్యాలు తప్పుపట్టాయి. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ద్వంద్వ వైఖరులు పాటించకుండా, కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నాయి. ఉగ్రవాద నెట్‌వర్క్‌ల నిర్మూలన, వాటి ఆర్థిక వనరులు, ఆయుధాల సరఫరా మూలాలను దెబ్బతీసేందుకు, ఉగ్ర నియామకాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా ప్రయత్నాల్ని ముమ్మరం చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. మోదీ, పుతిన్‌ల భేటీ తరువాత సీమాంతర ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి ప్రకటన వెలువడింది. ఇటీవల పాకిస్తాన్‌కు చేరువయ్యేందుకు రష్యా ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఐక్యరాజ్య సమితి వద్ద పెండింగ్‌లో ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని ఖరారుచేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరాయి. పర్యావరణ మార్పుల కారణంగా నష్టపోతున్న వర్ధమాన, పేద దేశాలను ఆర్థిక, సాంకేతిక సాయంతో ఆదుకోవాలని ధనిక దేశాలకు పిలుపునిచ్చాయి. కార్బన్ ఉద్గారాల తగ్గింపు, హరిత విధానాలకు ప్రచారం కల్పిస్తూ పారిస్ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని కోరాయి. మెరుగైన వ్యాపార అవకాశాలు: మోదీ ఇరు దేశాల వ్యాపారవేత్తలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. భారత్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుచేసేందుకు ముందుకు రావాలని రష్యాను ఆహ్వానించారు. మెట్రో రైలు, సాగరమాల, రోడ్ల నిర్మాణం తదితర రంగాల్లో మెరుగైన వ్యాపార అవకాశాలున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం రోజురోజుకీ పెరుగుతోందని పుతిన్ అన్నారు. భారత్‌లోని అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఏఐఎం), రష్యాలోని సిరియస్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మోదీ, పుతిన్ సంభాషించారు. ఇరు దేశాల యువత మధ్య నిరంతరం చర్చలు జరగడం ద్వైపాకిక్ష సంబంధాలకు మరింత విలువ చేకూరుస్తుందని పుతిన్ అన్నారు. సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఏఐఎం, సిరియస్లు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒకేసారి 36 లక్ష్యాలపైకి 72 క్షిపణులు అధునాతన దీర్ఘశ్రేణి ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనేందుకు భారత్ సంతకం చేసిన ఒప్పందం విలువ సుమారు 5 బిలియన్ డాలర్లు. రష్యాతో ఆయుధ కొనుగోలు లావాదేవీలు జరిపితే ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించినా ఒప్పందానికే భారత్ సై అంది. రష్యా, ఇరాన్, ఉ.కొరియా కంపెనీలతో రక్షణ వ్యాపారాలు చేసే మిత్ర దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికా కాట్సా(కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్) చట్టం తెచ్చింది. ఈ విషయంలో భారత్‌కు మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. వైమానిక దళం శక్తి, సామర్థ్యాలను ద్విగుణీకృతం చేసే ఎస్–400 క్షిపణులను భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగిస్తారు. ఈ వ్యవస్థ ద్వారా ఒకేసారి 36 లక్ష్యాలపైకి 72 క్షిపణులను ప్రయోగించొచ్చు. రష్యా ఈ క్షిపణులను పలు దఫాలుగా భారత్‌కు అందజేస్తుంది. రష్యా అల్మాజ్ యాంటే సంస్థ ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను రూపొందించింది. ఒక్కో వ్యవస్థలో రెండు రాడార్లు, మిస్సైల్ లాంచర్లు, కమాండ్ పోస్టులుంటాయి. ఒక్కో రాడార్ 100 నుంచి 300 లక్ష్యాలను ఏకకాలంలో గుర్తించగలదు. సుమారు 600 కి.మీ దూరం నుంచే శత్రు క్షిపణులు, ఇతర ప్రయోగాల జాడను కనిపెట్టే ఈ క్షిపణి వ్యవస్థ..400 కి.మీ దూరం నుంచి లక్ష్యంపై గురిపెడుతుంది. పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనాలోని అన్ని వైమానిక స్థావరాలు దీని పరిధిలోకి వస్తాయి. గగన్‌యాన్ ప్రాజెక్టులో సహకారానికి సంబంధించి ఇస్రో, రష్యా అంతరిక్ష సంస్థ రాస్కాస్మోస్లు ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
ట్రంప్‌ను కాదని ట్రయంఫ్ ఒప్పందం...!
భారత్–రష్యా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక అధ్యాయానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన శ్రీకారం చుట్టబోతోంది. రష్యాతో ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ కొనుగోలు (ఐదు వ్యవస్థల కొనుగోలుకయ్యే వ్యయ ఒప్పందం దాదాపు రూ.50 వేల కోట్లు–550 కోట్ల డాలర్లు) కుదుర్చుకుంటే భారత్‌కు ఆంక్షలు తప్పవన్న అమెరికా తాజా హెచ్చరికల నేపథ్యంలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య కీలకాంశాలపై చర్చ జరిగినా క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందమే కీలకంగా మారనుంది. అయితే పుతిన్ పర్యటన భారత రక్షణరంగానికే పరిమితం కాకుండా అంతరిక్ష, ఇంధన రంగాల్లో పరస్పరసహకారానికి ఉపయోగపడనుంది. ఏమిటీ ఆంక్షలు ? 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను హస్తగతం చేసుకోవడం, సిరియా అంతర్యుద్ధంలో ప్రమేయం, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యంపై పుతిన్‌ను శిక్షించేందుకు కాట్సా (కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్‌సిరీస్ థ్రూ శాంక్షన్స్ యాక్ట్ ) చట్టాన్ని గత ఆగస్టులో అమెరికా ఆమోదించింది. రష్యాతో రక్షణ, నిఘారంగాల్లో వ్యాపారం చేసే దేశాలపై ఆటోమెటిక్‌గా ఆంక్షలు విధించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుందని గతంలోనే అమెరికా హెచ్చరించింది. ఆంక్షలు విధించేలా రష్యాతో లావాదేవీలు నెరపొద్దంటూ తన మిత్రదేశాలు, భాగస్వామ్యపక్షాలకు గతంలోనే అగ్రరాజ్యం విజ్ఞప్తి చేసింది. కాట్సా సెక్షన్ 23 పరిధిలోకి ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థతో సహా ఇతర అంశాలు వస్తాయని స్పష్టంచేసింది. రష్యా నుంచి చైనా వివిధ సైనిక ఉత్పత్తులు, ఎస్–400 వ్యవస్థను కొనుగోలు చేసినందుకు అమెరికా గత నెలలోనే ఆంక్షలు విధించింది. నాటో కూటమి మిత్రపక్షం టర్కీ కూడా రష్యా నుంచి క్షిపణి వ్యవస్థ కొనుగోలు చేయాలని నిర్ణయించడంపై అమెరికా గుర్రుగా ఉంది. మినహాయింపుపై భారత్ ఆశాభావం..! ప్రస్తుతం అమెరికా–రష్యా అంతర్గత పోరులో భారత్ చిక్కుకుంది. ఈ ఒప్పందం విషయంలో ఏదో ఒక రూపంలో అమెరికా ప్రభుత్వం నుంచి ఉపశమనం లభిస్తుందనే ఆశాభావంతో భారత్ ఉంది. రష్యాతో భారత్‌కు దీర్ఘకాలిక సైనిక సంబంధాలున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఎస్–400 వ్యవస్థపై ఇప్పటికే పలుపర్యాయాలు చర్చలు సాగిన నేపథ్యంలో ప్రస్తుతం తుదిదశకు చేరుకుందని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అమెరికా–సోవియట్ ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో 80 శాతానికి పైగా సైనిక పరికరాలు రష్యా నుంచే భారత్‌కు వచ్చాయి. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో అమెరికా అతి పెద్ద ఆయుధాల సరఫరాదారుల్లో ఒకటిగా (గత పదేళ్లలో 1,500 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలతో) నిలుస్తోంది. తమ ఆయుధాల దిగుమతిలో ముందువరసలో ఉన్న భారత్‌పై అమెరికా కఠినమైన ఆంక్షలు విధించకపోవచ్చుననే అభిప్రాయంతో మనదేశం అధికారులున్నారు. క్షిపణి వ్యవస్థల కొనుగోలు విషయంలో ‘ప్రత్యేక మాఫీ’ లేదా ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని అమెరికాను భారత్ కోరనున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్‌పై పైచేయి.. ఈ క్షిపణి వ్యవస్థలతో మన రక్షణరంగం పాకిస్తాన్‌పై పైచేయి సాధించడంతో పాటు చైనాతో (ఈ దేశం ఇప్పటికే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది) సరిసమానంగా నిలిచేందుకు దోహదపడుతుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఒప్పందం ఖరారైతే వచ్చే రెండేళ్లలో మొదటి క్షిపణి వ్యవస్థ, నాలుగున్నరేళ్లలో మొత్తం అయిదు వ్యవస్థలు మనకు అందుబాటులోకి వస్తాయి. ఎస్–400 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (సామ్) వ్యవస్థలోని కమాండ్ పోస్ట్‌లో యుద్ధ నిర్వహణ పద్ధతులు, క్షిపణి ప్రయోగం, రాడార్ ద్వారా శత్రు దేశాల క్షిపణులు, విమానాలు, ఇతర యుద్ధ ప్రయోగాలను పసిగట్టి, వాటిని ఛేదించే ఏర్పాట్లున్నాయి. ఈ క్షిపణి వ్యవస్థలను అన్ని ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా లాంఛర్ వాహనాలపై వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ క్షిపణి వ్యవస్థ సులువుగా ఎక్కడికైనా తరలించేందుకు వీలుగా ఉండడంతో యుద్ధమొచ్చినప్పుడు ఏ నగరాన్నయినా వైమానికదాడుల నుంచి కాపాడుకునేందుకు ఉపయోగపడుతుంది. పాకిస్తాన్ తక్కువ దూరం (షార్ట్ రేంజ్) నుంచి ప్రయోగించే నాసర్(హతఫ్–9) అణు క్షిపణిని నిరోధించేందుకు ఈ ఎస్–400 ఉపకరిస్తుంది. ప్రత్యేకతలేంటీ ? రష్యా అల్మాజ్ యాంటే సంస్థ ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను రూపొందించింది. ఒక్కో వ్యవస్థలో రెండు రాడార్లు, మిస్సైల్ లాంఛర్లు, కమాండ్ పోస్టులుంటాయి. ఒక్కో రాడార్ 100 నుంచి 300 లక్ష్యాలను ఏకకాలంలో గుర్తించగలదు. ఈ వ్యవస్థ దాదాపు 600 కి.మీ దూరం నుంచే శత్రు క్షిపణులు, ఇతర ప్రయోగాల జాడను కనిపెడుతుంది. 400 కి.మీ పరిధి నుంచే 36 లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించగలదు. పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలు దీని పరిధిలోకి వస్తాయి. శత్రుదేశాల నుంచి భిన్న పరిధుల్లో వచ్చే క్షిపణులు, ఇతర ప్రయోగాలను ఇందులోని సూపర్సోనిక్, హైపర్సోనిక్ మిసైల్స్ అడ్డుకుంటాయి. -
ఎస్–400 కొంటే ఆంక్షలే: అమెరికా
వాషింగ్టన్: రష్యా నుంచి అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్–400ను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించింది. కాస్టా (ఆంక్షల ద్వారా అమెరికా వ్యతిరేక శక్తులను ఎదుర్కొనడం)కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలు, వ్యవస్థలపై ఆంక్షలు అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్–400 వ్యవస్థల కొనుగోలుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రభావం పడే వీలుంది. ట్రంప్ సంతకంచేయగానే ఇటీవలే రష్యా నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలు, ఎస్–400లను కొన్న చైనా సంస్థ, దాని డైరెక్టర్ షాంగ్‌ఫూపై అమెరికా ఆంక్షలు విధించింది. రష్యాను లక్ష్యంగా చేసుకునే కాస్టా చట్టాన్ని తెచ్చినట్లు అమెరికా ఉన్నతాధికారి వెల్లడించారు.