ఇస్తాంబుల్: రష్యా నుంచి ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థలు కొనరాదంటూ అగ్రరాజ్యం అమెరికా చేసిన హెచ్చరికలకు టర్కీ ప్రభుత్వం లొంగలేదు. అమెరికా హెచ్చరికలు భేఖాతరు చేస్తూ రష్యా తయారీ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్–400 క్షిపణులను టర్కీ కొనుగోలు చేసింది. కొనుగోలులో భాగంగా మొదటి దశ క్షిపణులు శుక్రవారం టర్కీ రాజధాని అంకారాకు చేరుకున్నాయి. ఈ మేరకు టర్కీ రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా నుంచి ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారత్ కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా ఇప్పటికే అభ్యంతరాలు తెలియజేసిన విషయం తెలిసిందే.
ఇక తాజా కొనుగోలుతో అమెరికా, టర్కీల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ కొనుగోలుకు సంబంధించి టర్కీని అమెరికా ఈ వారమే హెచ్చరించింది. టర్కీ గనుక రష్యా క్షిపణులను కొనుగోలు చేస్తే తదుపరి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. జూలై 31లోగా కొనుగోలును రద్దు చేసుకోకుంటే ఎఫ్–35 యుద్ధ విమానాలపై టర్కీ ఆశలు వదులుకోవాల్సిందేనని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. అలాగే వీటిని నడపడానికి అమెరికాలో శిక్షణ తీసుకుంటున్న టర్కీ పైలెట్లను వెనక్కి పంపిస్తామని పేర్కొంది. అయితే ఈ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని టర్కీ రష్యా నుంచి కొనుగోళ్లకే మొగ్గు చూపడం అమెరికాకు ఆగ్రహం తెప్పించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment