S-400 Air Defence System: బోర్డర్‌లో ‘బాహుబలి’  | India Recently Imported S-400 Air Defence System Is Overhyped | Sakshi
Sakshi News home page

S-400 Air Defence System: బోర్డర్‌లో ‘బాహుబలి’ 

Published Wed, Dec 22 2021 7:33 AM | Last Updated on Wed, Dec 22 2021 2:01 PM

India Recently Imported S-400 Air Defence System Is Overhyped - Sakshi

India Recently Imported S-400 Air Defence System Is Overhyped: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌గా పరిగణించే రష్యా తయారీ ఎస్‌–400 క్షిపణి వ్యవస్థ భారత సైన్యం అమ్ముల పొదిలో చేరింది. డ్రోన్లు, యూఏవీల ప్రయోగం ద్వారా నిత్యం చికాకులు సృష్టిస్తున్న పాకిస్తాన్‌కు చెక్‌ పెట్టేలా పంజాబ్‌లోని సరిహద్దుల్లో దీన్ని భారత ఆర్మీ సోమవారం మొహరించిందని ఏఎన్‌ఐ వార్తాసంస్థ విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ వెల్లడించింది. పాకిస్తాన్, చైనాల నుంచి ఆకాశమార్గాన ఎదురయ్యే ముప్పును ఇది సమర్థంగా తిప్పికొట్టగలదని తెలిపింది. నేలపై నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులు ఇందులో ఉంటాయి.

600 కిలోమీటర్ల సుదూరం నుంచి ప్రయోగించే క్షిపణులు, మన భూభాగం వైపు వస్తున్న విమానాలను, అన్‌మ్యాన్‌డ్‌ ఏరియల్‌ వెహికిల్‌ (యూఏవీ)లను ఈ అధునాతన రక్షణ వ్యవస్థలోని కమాండ్‌ సెంటర్‌ పసిగట్టగలదు. వాటి నుంచి ఎదురయ్యే ప్రమాద తీవ్రత ఆధారంగా వేటిని ముందుగా కూల్చాలో నిర్ణయించగలదు. వాటిని నీర్విర్యం చేసేందుకు కచ్చితత్వంలో క్షిపణులను సంధింస్తుంది. అలాగే తోటి రక్షణ వ్యవస్థలతో సమన్వయం చేసుకోగలదు. భారత వాయుసేన, ఆర్మీలకు ఈ ‘బాహుబలి’ని ఆపరేట్‌ చేసేందుకు అవసరమైన శిక్షణను రష్యా అందజేసింది. ఇందులో మల్టీఫంక్షన్‌ రాడార్, సొంతంగా ముప్పును పసిగట్టి... లక్ష్యాలను చేధించే ఆటోమేటిక్‌ వ్యవస్థ, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిస్సైల్‌ సిస్టమ్స్, లాంచర్లు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లు ఉంటాయి.  

7 వేల కోట్లు: 2015లో ఐదు ఎస్‌–400 మిస్సైల్‌ సిస్టమ్‌ కొనుగోలుకు రష్యాతో భారత్‌ ప్రాథమిక ఒప్పందం చేసుకుంది. తుదిరూపు తీసుకొని 2018లో ఖరారైన ఈ ఒప్పందం విలువ రూ.35,000 కోట్లు. అంటే ఒక్కో సిస్టమ్‌ ధర రూ. 7 వేల కోట్లు. 

400 కి.మీ.: యుద్ధ విమానాలు, బాలిస్టిక్‌ క్షిపణులు, విమానంపై రాడార్‌ ఉండి.. కంట్రోల్‌ సెంటర్‌తో సహా ఆకాశంలో పహారా కాసే అవాక్స్‌ విమానాలను, యూఏవీలను, డ్రోన్లను సుదూరంగానే ఉన్నపుడే పసిగట్టగలదు. 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే కచ్చితత్వంతో మిస్సైల్‌ (క్షిపణులను) ప్రయోగించి శత్రువుల క్షిపణులను, విమానాలను నేలమట్టం చేయగలదు. 2 కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసిన టార్గెట్లను కూడా కూల్చగలదు. ఆకాశంలో 30 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్న వాటిని కూడా చేధించగలదు. 

3 నిముషాలు: రాడార్‌ ద్వారా సిగ్నల్‌ అందిన మూడు నిముషాల్లో ఎదురుదాడి చేసే సామర్థ్యం దీని సొంతం. 
►మన భూభాగం వైపు దూసుకువస్తున్న 80 వస్తువులను (క్షిపణులు, విమానాలు ఏవైనా కావొచ్చు) ఏకకాలంలో ట్రాక్‌ చేయగలదు. 
►ప్రతి రెజిమెంట్‌లో ఎనిమిది లాంచర్లు (ప్రయోగ గొట్టాలు) ఉంటాయి. ప్రతి లాంచర్‌లో 4 క్షిపణులు ఉంటాయి. అంటే ఏకకాలంలో 32 క్షిపణులను ఎస్‌–400 సిస్టమ్‌ ప్రయోగించగలదు. 15 నిమిషాల్లో దీన్ని రీలోడ్‌ చేయవచ్చు. 
►400 కి.మీ., 250 కి.మీ.ల దీర్ఘశ్రేణి క్షిపణులు, 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించే మధ్యశ్రేణి క్షిపణులు, 40 కి.మీ. లక్ష్యాలను చేధించే స్వల్పశ్రేణి క్షిపణులు ఉంటాయి. 
►జూన్‌ 2022లో భారత్‌కు రెండో ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ అందనుంది. లద్దాఖ్, అరుణాల్‌ప్రదేశ్‌లలో సున్నితమైన, సమస్యాత్మకమైన సరిహద్దుల్లో శత్రు ముప్పును సమర్థంగా తిప్పికొట్టేందుకు భారత్‌ దీన్ని అక్కడ మొహరించే అవకాశాలున్నాయి.
– నేషనల్‌ డెస్క్, సాక్షి

అమెరికా ఒత్తిడి బేఖాతరు 
తమ శత్రుదేశమైన రష్యా నుంచి భారత్‌ ఈ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడం అమెరికాకు నచ్చలేదు. అమెరికా తయారీ థర్మల్‌ హై అల్టిట్యూడ్‌ ఏరియా డిఫెన్స్‌ (థాడ్‌)ను తీసుకో వాలని ఆఫర్‌ ఇచ్చింది. అగ్రరాజ్యం ఆర్థిక ఆం క్షలు పెడతామని ఒత్తిడి తెచ్చినా.. భారత్‌ వెనక్కి తగ్గలేదు. ఇదెప్పుడో ఖరారైన ఒప్పం దమని తేల్చిచెప్పి థాడ్‌ కంటే మెరుగైన ఎస్‌–400 కొనుగోలు చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement