అంకారా(టర్కీ) : రష్యా తయారీ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400 ట్రయంఫ్ కొనుగోలు చేయరాదంటూ అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా ఎట్టకేలకు టర్కీ వాటిని కొనుగోలు చేసింది. ఈ క్షిపణులు శుక్రవారం టర్కీ రాజధాని అంకారాకు చేరాయి. ఈ చర్యతో అమెరికా టర్కీల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఎస్-400 నాటో సిద్ధాంతాలకు విరుద్ధమైందని అమెరికా చాలా సార్లు పేర్కొంది. టర్కీ గనుక రష్యా నుంచి క్షిపణులు కొనాలని నిర్ణయం తీసుకుంటే మానుంచి ఐదవతరం అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్-35 తీసుకోలేదని పదే పదే హెచ్చరించింది. అయితే ఈ హెచ్చరికలు పక్కన పెట్టిన టర్కీ ఎస్-400 వ్యవస్థను కొనడానికే నిర్ణయం తీసుకుంది. రష్యా టర్కీలు 2017లోనే ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అప్పటి నుంచి వీలు దొరికినప్పుడల్లా అమెరికా టర్కీపై ఒత్తిడి చేస్తూనే ఉంది. దీనిపై టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగన్ చాలాసార్లు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు.
ఇక టర్కీ ఎఫ్-35 యుద్ధవిమానాలపై ఆశలు వదులుకోవాలని నాటో (ప్రధాన కార్యలయం బెల్జియం) రక్షణకార్యదర్శి మార్క్ ఎస్పర్ వ్యాఖ్యానించారు. వీటిని నడపడానికి అమెరికాలో శిక్షణ తీసుకుంటున్న టర్కీ పైలెట్లు తిరిగి పంపబడతారని వెల్లడించారు. ఇప్పటికే ఎఫ్-35 లో పెట్టుబడి పెట్టిన టర్కీకి ఈ నిర్ణయం శరాఘాతమే. బ్లాక్‌లిస్టెడ్ దేశాల నుంచి ఆయుధాలను కొనరాదంటూ అమెరికా తెచ్చిన ‘కాట్సా’ చట్టం పరిధిలో టర్కీని చేర్చి ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టర్కీ ఆర్థిక వ్యవస్థపై ఈ ఆంక్షలు తీవ్రంగా ప్రభావాన్ని చూపడమేగాక, ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌ను తొలగించిన ఎర్డోగన్ కు మరిన్ని తలనొప్పులు రావొచ్చు.
టర్కీ నాటో భవితవ్యంపై
ఈ కొనుగోలుతో టర్కీ నాటో భవితవ్యంపై నీలీనీడలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా నాటో కూటమి ఏర్పడిందే రష్యాకు వ్యతిరేకంగా. ఇప్పుడు ఆ కూటమిలోని ఓ దేశం రష్యానుంచి ఆయుధాలను కొనడంతో నాటోకు తదుపరి పరిణామాలపై అర్థం కానీ పరిస్థితి నెలకొంది. అమెరికా, టర్కీల మధ్య సిరియా విషయంలో వివాదం రేగిన విషయం తెలిసిందే. మరొక వైపు రష్యా, టర్కీల మధ్య స్నేహం పెరిగింది. దీంతో రష్యా నుంచి ఎస్-400ను కొనాలని టర్కీ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచే ఎర్డోగన్‌కు వ్యతిరేకంగా దేశంలో రాజకీయ పవనాలు వీయడం మెదలెట్టాయి. దీనికి కారణం పశ్చిమదేశాలనే అని ఎర్డోగన్ వాదన. జర్నలిస్టులను, తనకు అడ్డువచ్చిన వారిని ఎర్డోగన్ జైలులో పెడుతున్నారనే కారణంతో ఇప్పటికే నాటోలోని దేశాలతో టర్కీకి వివాదాలు చెలరేగాయి. టర్కీలో ప్రజాస్వామ్యం, మానవహక్కులు ప్రమాదంలో పడ్డాయనే ఆరోపణలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. టర్కీ నాటో కూటమిలో ఏకైక ముస్లిం దేశం, అలాగే కూటమిలో రెండవ అతిపెద్ద స్టాండింగ్ ఆర్మీ కలిగి ఉంది. అయితే ఇప్పుడు ఈ తాజా వివాదంతో నాటో నుంచి బయటపడటం వల్ల తమకు కలిగే ప్రతిఫలమే ఎక్కువ అని ఎర్డోగాన్ భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.
రష్యా స్పందన ఏంటి?
టర్కీతో కుదిరిన ఈ ఒప్పందం కేవలం వ్యాపారపరమైందని రష్యా చెబుతోంది. క్షిపణి వ్యవస్థతో పాటు కేవలం పాక్షిక టెక్నాలజీని మాత్రమే టర్కీకి బదిలీ చేశామని పేర్కొంది. అదే విధంగా ఎస్ -400 లను కొనుగోలు చేయకుండా భారతదేశాన్ని నిరోధించడానికి వాషింగ్టన్ ప్రయత్నించినా, అక్టోబర్‌లో మాస్కో నుంచి క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడానికి న్యూఢిల్లీ ఒప్పందం కుదుర్చుకుందని రష్యా వాదన. ఆయా దేశాల ప్రాధాన్యతను ఎవరూ నియంత్రించలేరని ఈ సందర్భంగా అమెరికాకు చురకలు అంటించింది. కానీ నాటో దేశాలు మాత్రం రష్యా తీరును విమర్శిస్తున్నాయి. వ్యూహాత్మకంగా కీలక ప్రదేశంలో ఉన్న టర్కీని నాటో నుంచి బయటకు లాగడానికి చూస్తూ సరికొత్త డ్రామాకు తెరలేపిందని అంటున్నాయి.
ఎస్-400
గత కొంతకాలంగా అమెరికా ఈ పేరు వింటేనే ఉలిక్కిపడుతోంది. ప్రస్తుత కాలంలో అత్యున్నత గగనతల రక్షణ వ్యవస్థగా పేరుతెచ్చుకున్న ఈ రష్యా తయారీ ఎస్-400 శత్రు క్షిపణులను గాలిలోనే పేల్చి వేయగలదు. ముఖ్యంగా రాడార్‌కు చిక్కని, అత్యున్నత యుద్ధ విమానంగా అమెరికా పేర్కొంటున్న ఎఫ్-35ని ఇట్టే నేలకు కూల్చేయగలదని రష్యా భావన. అందుకే అమెరికా వీటిని కొనుగోలు చేయరాదంటూ భారత్, టర్కీ తదితర దేశాలపై సందర్భం వచ్చినప్పుడల్లా సన్నాయినొక్కులు నొక్కుతోంది. ఎస్ -300 యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఎస్-400ను అభివృద్ధి చేశారు. మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ ఎస్ -400 ట్రయంఫ్ ఉపరితలం నుండి అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ 250 కిలోమీటర్ల దూరం వద్ద విమానాలను, అలాగే 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించగలదు.
Comments
Please login to add a commentAdd a comment