ఢిల్లీలో భేటీ సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ కరచాలనం
న్యూఢిల్లీ: భారత్, రష్యా రక్షణ సంబంధాల్లో మరో గొప్ప ముందడుగు పడింది. అమెరికా ఆంక్షల బెదిరింపులను తోసిరాజని రష్యా నుంచి ఎస్–400 ట్రయంఫ్ అనే అధునాతన గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. 2022 నాటికి చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌కు సాంకేతిక సహకారం అందించేందుకు రష్యా అంగీకరించింది. ఢిల్లీలో శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీల మధ్య 19వ ఇండియా–రష్యా వార్షిక సమావేశం ముగిశాక ఇరు దేశాల మధ్య అంతరిక్షం, రైల్వేలు, అణుశక్తి, విద్య, ఎరువులుతదితర రంగాల్లో 8 ఒప్పందాలు కుదిరాయి.
ఆచితూచి స్పందించిన అమెరికా..
భారత్, రష్యాల మధ్య ఎస్–400 ఒప్పందం కుదిరాక అమెరికా ఆచితూచి స్పందించింది. మిత్ర దేశాల సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడం కాట్సా ఉద్దేశం కాదని పేర్కొంది. ఒక్కో ఒప్పందాన్ని బట్టి దానికి ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలా? లేదా? అనేది నిర్ణయిస్తామని తెలిపింది.
ఉగ్రపోరులో సహకారం బలోపేతం..
సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని భారత్, రష్యాలు తప్పుపట్టాయి. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ద్వంద్వ వైఖరులు పాటించకుండా, కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నాయి. ఉగ్రవాద నెట్‌వర్క్‌ల నిర్మూలన, వాటి ఆర్థిక వనరులు, ఆయుధాల సరఫరా మూలాలను దెబ్బతీసేందుకు, ఉగ్ర నియామకాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా ప్రయత్నాల్ని ముమ్మరం చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. మోదీ, పుతిన్‌ల భేటీ తరువాత సీమాంతర ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి ప్రకటన వెలువడింది.
ఇటీవల పాకిస్తాన్‌కు చేరువయ్యేందుకు రష్యా ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఐక్యరాజ్య సమితి వద్ద పెండింగ్‌లో ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని ఖరారుచేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరాయి. పర్యావరణ మార్పుల కారణంగా నష్టపోతున్న వర్ధమాన, పేద దేశాలను ఆర్థిక, సాంకేతిక సాయంతో ఆదుకోవాలని ధనిక దేశాలకు పిలుపునిచ్చాయి. కార్బన్ ఉద్గారాల తగ్గింపు, హరిత విధానాలకు ప్రచారం కల్పిస్తూ పారిస్ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని కోరాయి.
మెరుగైన వ్యాపార అవకాశాలు: మోదీ
ఇరు దేశాల వ్యాపారవేత్తలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. భారత్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుచేసేందుకు ముందుకు రావాలని రష్యాను ఆహ్వానించారు. మెట్రో రైలు, సాగరమాల, రోడ్ల నిర్మాణం తదితర రంగాల్లో మెరుగైన వ్యాపార అవకాశాలున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం రోజురోజుకీ పెరుగుతోందని పుతిన్ అన్నారు. భారత్‌లోని అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఏఐఎం), రష్యాలోని సిరియస్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మోదీ, పుతిన్ సంభాషించారు. ఇరు దేశాల యువత మధ్య నిరంతరం చర్చలు జరగడం ద్వైపాకిక్ష సంబంధాలకు మరింత విలువ చేకూరుస్తుందని పుతిన్ అన్నారు. సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఏఐఎం, సిరియస్‌లు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ఒకేసారి 36 లక్ష్యాలపైకి 72 క్షిపణులు
అధునాతన దీర్ఘశ్రేణి ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనేందుకు భారత్ సంతకం చేసిన ఒప్పందం విలువ సుమారు 5 బిలియన్ డాలర్లు. రష్యాతో ఆయుధ కొనుగోలు లావాదేవీలు జరిపితే ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించినా ఒప్పందానికే భారత్ సై అంది. రష్యా, ఇరాన్, ఉ.కొరియా కంపెనీలతో రక్షణ వ్యాపారాలు చేసే మిత్ర దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికా కాట్సా(కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్) చట్టం తెచ్చింది. ఈ విషయంలో భారత్‌కు మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. వైమానిక దళం శక్తి, సామర్థ్యాలను ద్విగుణీకృతం చేసే ఎస్–400 క్షిపణులను భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగిస్తారు. ఈ వ్యవస్థ ద్వారా ఒకేసారి 36 లక్ష్యాలపైకి 72 క్షిపణులను ప్రయోగించొచ్చు.
రష్యా ఈ క్షిపణులను పలు దఫాలుగా భారత్‌కు అందజేస్తుంది. రష్యా అల్మాజ్ యాంటే సంస్థ ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను రూపొందించింది. ఒక్కో వ్యవస్థలో రెండు రాడార్లు, మిస్సైల్ లాంచర్లు, కమాండ్ పోస్టులుంటాయి. ఒక్కో రాడార్ 100 నుంచి 300 లక్ష్యాలను ఏకకాలంలో గుర్తించగలదు. సుమారు 600 కి.మీ దూరం నుంచే శత్రు క్షిపణులు, ఇతర ప్రయోగాల జాడను కనిపెట్టే ఈ క్షిపణి వ్యవస్థ..400 కి.మీ దూరం నుంచి లక్ష్యంపై గురిపెడుతుంది. పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనాలోని అన్ని వైమానిక స్థావరాలు దీని పరిధిలోకి వస్తాయి. గగన్‌యాన్ ప్రాజెక్టులో సహకారానికి సంబంధించి ఇస్రో, రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్‌లు ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment