India-Russia Agreements
-
ఏకే–203 రైఫిళ్ల తయారీ అమేథీలో
న్యూఢిల్లీ: అత్యాధునిక ఏకే–203 రకం రైఫిళ్లను భారత్‌లో తయారుచేసేందుకు మార్గం సుగమం అయింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ పరిధిలోని కోర్వాలో రైఫిళ్లను తయారుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో ఆత్మనిర్భర్ సాధించడానికి తాజా నిర్ణయం బాటలుపరుస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ.5వేలకోట్ల ప్రాజెక్ట్‌లో భాగంగా ఐదు లక్షలకుపైగా రైఫిళ్లను అక్కడ ఫ్యాక్టరీలో తయారుచేస్తారు. ‘ ఈ కొత్త ప్రాజెక్టు కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవకాశాలు మెరుగుపడతాయి’ అని సంబంధిత వర్గాలు చెప్పాయి. మూడు దశాబ్దాల క్రితం నుంచి భారత సాయుధ బలగాల కోసం వినియోగిస్తున్న ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఈ అధునాతన ఏకే–203 రైఫిళ్లను తెచ్చారు. ఈ తేలికైన 7.62 ్ఠ 39 మిల్లీమీటర్ల కాలిబర్ రైఫిల్ 300 మీటర్ల దూరంలోని లక్ష్యాలనూ చేధించగలదు. ఈ నెల ఆరున రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశముంది. చాలా సంవత్సరాల క్రితమే ఈ ఒప్పందంపై రెండు దేశాలూ ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే, రైఫిళ్ల సాంకేతికత రష్యా నుంచి భారత్‌కు బదిలీచేసే అంశం కొలిక్కి రాలేదు. ఇంతకాలానికి ఇది సాధ్యమైంది. పుతిన్ పర్యటనలో పలు ఒప్పందాలు.. సోమవారం ఢిల్లీకి రానున్న పుతిన్ సమక్షంలో భారత్ రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంథనం, సాంకేతిక రంగాలకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. సోమవారం సాయంత్రం 5.30గంటలకు కీలక వ్యూహాత్మక అంశాలపై మోదీ, పుతిన్ చర్చించనున్నారు. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల 2+2 భేటీల్లో తూర్పు లద్దాఖ్ సరిహద్దు ఉద్రిక్తత, తాలిబాన్ పాలనలో అఫ్గాన్ నుంచి భారత్‌కు పెరగనున్న ఉగ్ర ముప్పు అంశాలూ చర్చించనున్నారు. రెండు ఇంజన్ల కమోవ్–226టీ తేలికపాటి 200 హెలికాప్టర్ల సంయుక్త తయారీ అంశం ఓ కొలిక్కిరానుంది. వచ్చే మూడేళ్లలో ఇరుదేశాల పెట్టుబడుల ఒప్పందాలు 50బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడంపైనా దృష్టిపెట్టనున్నారు. -
భారత్‌కు ఎస్–400 క్షిపణి వ్యవస్థ
న్యూఢిల్లీ: ఉపరితలం నుంచి గగన తలంలోని లక్ష్యాలను ఛేదించే ఎస్–400 క్షిపణుల సరఫరా ప్రక్రియను రష్యా ప్రారంభించింది. భారత్‌కు ఈ క్షిపణులను అందజేస్తున్నామని రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలటరీ టెక్నికల్ కోపరేషన్ డైరెక్టర్ దిమిత్రి షుగావ్ చెప్పారు. ‘‘ముందుగా అనుకున్న ప్రకారమే భారత్‌కు ఎస్–400 క్షిపణుల్ని సరఫరా చేసే ప్రక్రియ ప్రారంభమైంది’’అని దుబాయ్ ఎయిర్ షో ప్రారంభానికి ముందు వెల్లడించారు. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పుని ఎదుర్కోవడంలో ఎస్–400 క్షిపణులు మన దేశానికి అండగా నిలవనున్నాయి. మొదటి క్షిపణిని చైనాతో సంక్షోభం నెలకొని ఉన్న లద్దాఖ్ సెక్టార్లో మెహరించాలని భారత వాయుసేన భావించినట్టు తెలుస్తోంది. మరోవైపు చైనా, పాకిస్తాన్ల నుంచి ఏకకాలంలో వచ్చే ముప్పుని ఎదుర్కోవడానికి వీలుగా పశ్చిమ ప్రాంతంలో ఈ క్షిపణుల్ని మోహరించే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్టుగా రక్షణ శాఖలోని కొందరు అధికారులు చెబుతున్నారు. చైనా ఇప్పటికే ఎస్–400 రెండు క్షిపణుల్ని లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మోహరించింది. 2018లో రూ.35 వేల కోట్లతో 5 ఎస్–400 క్షిపణుల కొనుగోలుకు రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. సముద్రం, గగనతలం మీదుగా ఈ క్షిపణుల అందజేయనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 5 క్షిపణులు భారత్‌కు చేరనున్నాయి. ఇప్పటికే ఈ క్షిపణుల వినియోగంపై భారత వైమానిక దళం అధికారులకు శిక్షణ కూడా పూర్తయింది. అమెరికా అభ్యంతరాలు భారత్, రష్యాతో క్షిపణుల కొనుగోలు ఒప్పందాన్ని మొదట్నుంచీ అమెరికా వ్యతిరేకిస్తోంది. రష్యాతో ఎలాంటి లావాదేవీలు చేయొద్దని ఒత్తిడి పెంచుతోంది. అయితే ప్రాంతీయ భద్రత, రక్షణ రంగంలో అవసరాల దృష్ట్యా ఎస్–400 ఒప్పందానికి మినహాయింపు ఇవ్వాలని అమెరికా సెనేటర్లు అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. దీనిపై ఎలాంటి స్పందన రాకుండానే క్షిపణి వ్యవస్థ భారత్‌కు చేరుకునే ప్రక్రియ ప్రారంభం కావడం గమనార్హం. -
భారత్‌లోనే ఏకే–47 తయారీ!
మాస్కో: భారత్‌లో ఏకే– 47 203 రైఫిల్స్ ఉత్పత్తికి సంబంధించి ఇండియా, రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజా రష్యా పర్యటనలో ఈ డీల్ కొలిక్కి వచ్చినట్లు రష్యా మీడియా పేర్కొంది. ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జేవీలో భాగంగా వీటిని ఉత్పత్తి చేస్తారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, కల్నోషికోవ్ కన్సెర్న్, రోసోబోరోనెక్స్‌పోర్ట్‌లు ఈ జాయింట్ వెంచర్(జేవీ)లో భాగస్వాములు. జేవీలో ఆర్డినెన్స్‌ఫ్యాక్టరీ బోర్డుకు మెజార్టీ(50.5 శాతం)వాటా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కొర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ ఏకే– 47లను ఉత్పత్తి చేయనున్నారని మీడియా వర్గాలు వెల్లడించాయి. డీల్ విశేషాలు... ► ఏకే– 47 రైఫిల్స్‌లో 203 మోడల్ ఆధునికమైన వెర్షన్. ►ప్రస్తుతం ఆర్మీ వాడుతున్న ఇన్సాస్ 5.56 ్ఠ45 ఎంఎం అసాల్ట్ రైఫిల్ స్థానంలో ఈ ఏకే– 47 –203 7.62ణ39 ఎంఎం రైఫిల్స్‌ను ప్రవేశపెడతారు. ► భారత ఆర్మీకి దాదాపు 7.7 లక్షల ఏకే– 47 203లు అవసరం పడతాయని అంచనా. ► లక్ష రైఫిల్స్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. మిగతావి దేశీయంగా తయారు చేసేలా ఒప్పందం కుదిరింది. ► ఒక్కోరైఫిల్ ఖరీదు దాదాపు 1100 యూఎస్ డాలర్లు ఉండవచ్చు. ► ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇన్సాస్ రైఫిళ్లను 1996 నుంచి వినియోగిస్తున్నారు. ► ఇన్సాస్ రైఫిళ్లతో హిమాలయ మంచు ప్రాంతాల్లో జామ్ కావడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు వస్తున్నాయి. ► అందుకే ఆర్మీకి ఏకే– 47 203 మోడల్ రైఫిళ్లను అందించాలని నిర్ణయించారు. రష్యా రక్షణమంత్రితో రాజ్నా«థ్ చర్చలు రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయగుతో ఫలప్రదవంతమైన చర్చలు జరిగాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం వెల్లడించారు. రక్షణ, వ్యూహాత్మక సహకారం సహా పలు అంశాలను చర్చించినట్లు తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమావేశాల కోసం రాజ్‌నాథ్ మూడురోజుల రష్యా పర్యటనకు వెళ్లారు. వివిధ రకాల ఆయుధ వ్యవస్థలు, మందుగుండు, విడిభాగాలను భారత్‌కు సరఫరా చేసే అంశంపై రష్యాతో చర్చలు జరిపారు. ఎస్400 మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను సకాలంలో భారత్‌కు అందించాలని రాజ్‌నాథ్ కోరినట్లు అధికారులు తెలిపారు. 2021 చివరకు ఈ మిసైల్ వ్యవస్థ తొలిబ్యాచ్ భారత్‌కు చేరవచ్చని అంచనా. శుక్రవారం రాజ్‌నాథ్ ఎస్సీఓ సమావేశంలో పాల్గొంటారు. -
రిపబ్లిక్ డే ఉత్సవాలకు రావట్లేదు
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనాలంటూ భారత్ పంపిన ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. కొత్త ఏడాది ఆరంభంలో స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంతోపాటు తనకు వేరే పనులు ఉండటంతో రావడం కుదరదంటూ అమెరికా యంత్రాంగం భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌కు లేఖ పంపింది. భారతగణతంత్ర దినోత్సవంలో ప్రతిఏడాదీ ఒక దేశాధినేతను ముఖ్య అతిథిగా భారత్ ఆహ్వానిస్తుంది. అదే కోవలో వేడుకల్లో పాల్గొనాలంటూ భారత అమెరికా అధ్యక్షుడికి జూలైలో ఆహ్వానం పంపింది. అయితే, ట్రంప్ పాల్గొనేదీ లేనిదీ 2 ప్లస్ 2 చర్చల తర్వాత చెబుతామంటూ అమెరికా వాయిదా వేసింది. అనంతర పరిణామాలు ఆ దేశ వైఖరిలో మార్పునకు కారణమయ్యాయి. క్షిపణి రక్షణ వ్యవస్థ ‘ట్రయంఫ్’ కొనుగోలుకు భారత్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడం, ఇరాన్ నుంచి చమురును కొనరాదన్న అమెరికా ఆంక్షలను బేఖాతరు చేయడం ట్రంప్ అసంతృప్తికి కారణమయ్యాయని భావిస్తున్నారు. కాగా, గత అధ్యక్షుడు బరాక్ ఒబామా స్టేట్ ఆఫ్ ది యూనియ న్ ప్రసంగం, ఇతరత్రా కార్యక్రమాలు ఉన్నప్పటికీ 2015 గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. -
గగనతలం.. శత్రు దుర్భేద్యం!
న్యూఢిల్లీ: భారత్, రష్యా రక్షణ సంబంధాల్లో మరో గొప్ప ముందడుగు పడింది. అమెరికా ఆంక్షల బెదిరింపులను తోసిరాజని రష్యా నుంచి ఎస్–400 ట్రయంఫ్ అనే అధునాతన గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. 2022 నాటికి చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌కు సాంకేతిక సహకారం అందించేందుకు రష్యా అంగీకరించింది. ఢిల్లీలో శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీల మధ్య 19వ ఇండియా–రష్యా వార్షిక సమావేశం ముగిశాక ఇరు దేశాల మధ్య అంతరిక్షం, రైల్వేలు, అణుశక్తి, విద్య, ఎరువులుతదితర రంగాల్లో 8 ఒప్పందాలు కుదిరాయి. ఆచితూచి స్పందించిన అమెరికా.. భారత్, రష్యాల మధ్య ఎస్–400 ఒప్పందం కుదిరాక అమెరికా ఆచితూచి స్పందించింది. మిత్ర దేశాల సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడం కాట్సా ఉద్దేశం కాదని పేర్కొంది. ఒక్కో ఒప్పందాన్ని బట్టి దానికి ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలా? లేదా? అనేది నిర్ణయిస్తామని తెలిపింది. ఉగ్రపోరులో సహకారం బలోపేతం.. సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని భారత్, రష్యాలు తప్పుపట్టాయి. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ద్వంద్వ వైఖరులు పాటించకుండా, కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నాయి. ఉగ్రవాద నెట్‌వర్క్‌ల నిర్మూలన, వాటి ఆర్థిక వనరులు, ఆయుధాల సరఫరా మూలాలను దెబ్బతీసేందుకు, ఉగ్ర నియామకాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా ప్రయత్నాల్ని ముమ్మరం చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. మోదీ, పుతిన్‌ల భేటీ తరువాత సీమాంతర ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి ప్రకటన వెలువడింది. ఇటీవల పాకిస్తాన్‌కు చేరువయ్యేందుకు రష్యా ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఐక్యరాజ్య సమితి వద్ద పెండింగ్‌లో ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని ఖరారుచేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరాయి. పర్యావరణ మార్పుల కారణంగా నష్టపోతున్న వర్ధమాన, పేద దేశాలను ఆర్థిక, సాంకేతిక సాయంతో ఆదుకోవాలని ధనిక దేశాలకు పిలుపునిచ్చాయి. కార్బన్ ఉద్గారాల తగ్గింపు, హరిత విధానాలకు ప్రచారం కల్పిస్తూ పారిస్ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని కోరాయి. మెరుగైన వ్యాపార అవకాశాలు: మోదీ ఇరు దేశాల వ్యాపారవేత్తలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. భారత్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుచేసేందుకు ముందుకు రావాలని రష్యాను ఆహ్వానించారు. మెట్రో రైలు, సాగరమాల, రోడ్ల నిర్మాణం తదితర రంగాల్లో మెరుగైన వ్యాపార అవకాశాలున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం రోజురోజుకీ పెరుగుతోందని పుతిన్ అన్నారు. భారత్‌లోని అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఏఐఎం), రష్యాలోని సిరియస్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మోదీ, పుతిన్ సంభాషించారు. ఇరు దేశాల యువత మధ్య నిరంతరం చర్చలు జరగడం ద్వైపాకిక్ష సంబంధాలకు మరింత విలువ చేకూరుస్తుందని పుతిన్ అన్నారు. సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఏఐఎం, సిరియస్లు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒకేసారి 36 లక్ష్యాలపైకి 72 క్షిపణులు అధునాతన దీర్ఘశ్రేణి ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనేందుకు భారత్ సంతకం చేసిన ఒప్పందం విలువ సుమారు 5 బిలియన్ డాలర్లు. రష్యాతో ఆయుధ కొనుగోలు లావాదేవీలు జరిపితే ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించినా ఒప్పందానికే భారత్ సై అంది. రష్యా, ఇరాన్, ఉ.కొరియా కంపెనీలతో రక్షణ వ్యాపారాలు చేసే మిత్ర దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికా కాట్సా(కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్) చట్టం తెచ్చింది. ఈ విషయంలో భారత్‌కు మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. వైమానిక దళం శక్తి, సామర్థ్యాలను ద్విగుణీకృతం చేసే ఎస్–400 క్షిపణులను భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగిస్తారు. ఈ వ్యవస్థ ద్వారా ఒకేసారి 36 లక్ష్యాలపైకి 72 క్షిపణులను ప్రయోగించొచ్చు. రష్యా ఈ క్షిపణులను పలు దఫాలుగా భారత్‌కు అందజేస్తుంది. రష్యా అల్మాజ్ యాంటే సంస్థ ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను రూపొందించింది. ఒక్కో వ్యవస్థలో రెండు రాడార్లు, మిస్సైల్ లాంచర్లు, కమాండ్ పోస్టులుంటాయి. ఒక్కో రాడార్ 100 నుంచి 300 లక్ష్యాలను ఏకకాలంలో గుర్తించగలదు. సుమారు 600 కి.మీ దూరం నుంచే శత్రు క్షిపణులు, ఇతర ప్రయోగాల జాడను కనిపెట్టే ఈ క్షిపణి వ్యవస్థ..400 కి.మీ దూరం నుంచి లక్ష్యంపై గురిపెడుతుంది. పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనాలోని అన్ని వైమానిక స్థావరాలు దీని పరిధిలోకి వస్తాయి. గగన్‌యాన్ ప్రాజెక్టులో సహకారానికి సంబంధించి ఇస్రో, రష్యా అంతరిక్ష సంస్థ రాస్కాస్మోస్లు ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
నేడు రష్యాతో ఐదు ఒప్పందాలు
మాస్కో: భారత్, రష్యా సంబంధాలు పుంజుకోనున్నాయి. సోమవారం రష్యాలోని మాస్కోలో రెండు దేశాలు తమ 14వ వార్షిక సదస్సు సందర్భంగా శిక్షపడిన ఖైదీల బదిలీ సహా పలు రంగాల్లో ఐదు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. అయితే కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో కొత్త రియాక్టర్ల ఏర్పాటు ఒప్పందం న్యాయపరమైన చిక్కు వల్ల కుదిరే అవకాశం లేదని భావిస్తున్నారు. భారతదేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం మాస్కో చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మన్మోహన్‌కు రష్యా విదేశాంగ ఉపమంత్రి మిఖాయిల్ బోగ్దనోవ్ ఘన స్వాగతం పలికారు. మూడు రోజులు రష్యాలో పర్యటించనున్న మన్మోహన్ సోమవారం ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరుపుతారు. అనంతరం విందులో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, సోమవారం జరిగే వార్షిక సదస్సు దీనికి ఉదాహరణ అని మన్మోహన్ మాస్కోలో విలేకర్లతో అన్నారు. అణు ఇంధనం, రక్షణ తదితర రంగాల్లో భాగస్వామ్య పురోగతిని సమీక్షిస్తామని చెప్పారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ శాంతి రక్షణకు చర్యలు వంటి వాటిపై చర్చిస్తామని చెప్పారు. కాగా, మాస్కో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ భారత ప్రధాని మన్మోహన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. మన్మోహన్ రష్యా పర్యటన తర్వాత చైనా వెళ్తారు. రష్యాతో కుదిరే ఒప్పందాలు.. భారతదేశంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న రష్యా ఖైదీలు, రష్యాలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న భారత ఖైదీలు తమ మిగిలిన శిక్షా కాలాన్ని స్వదేశాల్లో పూర్తి చేసుకోవడానికి, షరతులపై పునరావాసం పొందడానికి వీలుగా రెండు దేశాలు ఖైదీల బదిలీ ఒప్పందం చేసుకోనున్నాయి. శాస్త్రసాంకేతికరంగంలో నూతన ఆవిష్కరణలు, బయోటెక్నాలజీ, ఇంధన రంగాల్లో సహకారంపై మూడు ఒప్పందాలు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, రష్యన్ మెట్రాలజీ సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదరనున్నాయి. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం(కేఎన్పీసీ)లో కొత్తగా రెండు అణు రియాక్టర్ల ఏర్పాటుకు సంబంధించి మన్మోహన్, పుతిన్‌ల భేటీలో రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవచ్చని అధికారులు తెలిపారు. ఒప్పందానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని, అయితే అణు ప్రమాద బాధ్యతకు సంబంధించిన న్యాయ వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం లేదని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి రెండు దేశాల న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారన్నారని అధికారులు వెల్లడించారు. కేఎన్పీసీని భారత అణు ప్రమాద బాధ్యతా చట్ట పరిధిలోకి కాకుండా అంతర్ ప్రభుత్వాల ఒప్పంద పరిధిలోకి తీసుకురావాలని రష్యా పట్టుబడుతోంది. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో మూడో, నాలుగో నంబర్ రియాక్టర్లను రష్యా సహకారంతో నిర్మించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. మన్మోహన్ కూడా ఢిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో కానీ, రష్యాలో మీడియాతో కానీ ఈ అంశంపై మాట్లాడకపోవడం గమనార్హం. అణు జలాంతర్గామిపై ఒప్పందం! జలాంతర్గాముల కొరత ఎదుర్కొంటున్న భారత్ మన్మోహన్ పర్యటన సందర్భంగా రష్యా నుంచి మరో అణు జలాంతర్గామిని లీజుకు తీసుకోవడానికి ఒప్పందం ఖరారు చేసుకునే అవకాశముంది. రష్యాలో తయారైన ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి రెండు నెలల కిందట ముంబై తీరంలో ఘోర ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఈ ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. దీని కోసం రూ.6 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని భారత ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం భారత్ వద్ద ‘అకులా 2’ రకానికి చెందిన నెప్రా అణు జలాంతర్గామి ఉంది. 8 వేల టన్నుల బరువున్న దీన్ని గత ఏడాది ఏప్రిల్‌లో విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు నౌకాదళంలో ప్రవేశపెట్టారు.