నేడు రష్యాతో ఐదు ఒప్పందాలు
మాస్కో: భారత్, రష్యా సంబంధాలు పుంజుకోనున్నాయి. సోమవారం రష్యాలోని మాస్కోలో రెండు దేశాలు తమ 14వ వార్షిక సదస్సు సందర్భంగా శిక్షపడిన ఖైదీల బదిలీ సహా పలు రంగాల్లో ఐదు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. అయితే కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో కొత్త రియాక్టర్ల ఏర్పాటు ఒప్పందం న్యాయపరమైన చిక్కు వల్ల కుదిరే అవకాశం లేదని భావిస్తున్నారు. భారతదేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం మాస్కో చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మన్మోహన్‌కు రష్యా విదేశాంగ ఉపమంత్రి మిఖాయిల్ బోగ్దనోవ్ ఘన స్వాగతం పలికారు.
మూడు రోజులు రష్యాలో పర్యటించనున్న మన్మోహన్ సోమవారం ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరుపుతారు. అనంతరం విందులో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, సోమవారం జరిగే వార్షిక సదస్సు దీనికి ఉదాహరణ అని మన్మోహన్ మాస్కోలో విలేకర్లతో అన్నారు. అణు ఇంధనం, రక్షణ తదితర రంగాల్లో భాగస్వామ్య పురోగతిని సమీక్షిస్తామని చెప్పారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ శాంతి రక్షణకు చర్యలు వంటి వాటిపై చర్చిస్తామని చెప్పారు. కాగా, మాస్కో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ భారత ప్రధాని మన్మోహన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. మన్మోహన్ రష్యా పర్యటన తర్వాత చైనా వెళ్తారు.
రష్యాతో కుదిరే ఒప్పందాలు..
భారతదేశంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న రష్యా ఖైదీలు, రష్యాలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న భారత ఖైదీలు తమ మిగిలిన శిక్షా కాలాన్ని స్వదేశాల్లో పూర్తి చేసుకోవడానికి, షరతులపై పునరావాసం పొందడానికి వీలుగా రెండు దేశాలు ఖైదీల బదిలీ ఒప్పందం చేసుకోనున్నాయి. శాస్త్రసాంకేతికరంగంలో నూతన ఆవిష్కరణలు, బయోటెక్నాలజీ, ఇంధన రంగాల్లో సహకారంపై మూడు ఒప్పందాలు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, రష్యన్ మెట్రాలజీ సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదరనున్నాయి. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం(కేఎన్‌పీసీ)లో కొత్తగా రెండు అణు రియాక్టర్ల ఏర్పాటుకు సంబంధించి మన్మోహన్, పుతిన్‌ల భేటీలో రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవచ్చని అధికారులు తెలిపారు. ఒప్పందానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని, అయితే అణు ప్రమాద బాధ్యతకు సంబంధించిన న్యాయ వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం లేదని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి రెండు దేశాల న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారన్నారని అధికారులు వెల్లడించారు. కేఎన్‌పీసీని భారత అణు ప్రమాద బాధ్యతా చట్ట పరిధిలోకి కాకుండా అంతర్ ప్రభుత్వాల ఒప్పంద పరిధిలోకి తీసుకురావాలని రష్యా పట్టుబడుతోంది. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో మూడో, నాలుగో నంబర్ రియాక్టర్లను రష్యా సహకారంతో నిర్మించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. మన్మోహన్ కూడా ఢిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో కానీ, రష్యాలో మీడియాతో కానీ ఈ అంశంపై మాట్లాడకపోవడం గమనార్హం.
అణు జలాంతర్గామిపై ఒప్పందం!
జలాంతర్గాముల కొరత ఎదుర్కొంటున్న భారత్ మన్మోహన్ పర్యటన సందర్భంగా రష్యా నుంచి మరో అణు జలాంతర్గామిని లీజుకు తీసుకోవడానికి ఒప్పందం ఖరారు చేసుకునే అవకాశముంది. రష్యాలో తయారైన ఐఎన్‌ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి రెండు నెలల కిందట ముంబై తీరంలో ఘోర ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఈ ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. దీని కోసం రూ.6 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని భారత ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం భారత్ వద్ద ‘అకులా 2’ రకానికి చెందిన నెప్రా అణు జలాంతర్గామి ఉంది. 8 వేల టన్నుల బరువున్న దీన్ని గత ఏడాది ఏప్రిల్‌లో విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు నౌకాదళంలో ప్రవేశపెట్టారు.