న్యూఢిల్లీ: ఉపరితలం నుంచి గగన తలంలోని లక్ష్యాలను ఛేదించే ఎస్–400 క్షిపణుల సరఫరా ప్రక్రియను రష్యా ప్రారంభించింది. భారత్‌కు ఈ క్షిపణులను అందజేస్తున్నామని రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలటరీ టెక్నికల్ కోపరేషన్ డైరెక్టర్ దిమిత్రి షుగావ్ చెప్పారు. ‘‘ముందుగా అనుకున్న ప్రకారమే భారత్‌కు ఎస్–400 క్షిపణుల్ని సరఫరా చేసే ప్రక్రియ ప్రారంభమైంది’’అని దుబాయ్ ఎయిర్ షో ప్రారంభానికి ముందు వెల్లడించారు. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పుని ఎదుర్కోవడంలో ఎస్–400 క్షిపణులు మన దేశానికి అండగా నిలవనున్నాయి.
మొదటి క్షిపణిని చైనాతో సంక్షోభం నెలకొని ఉన్న లద్దాఖ్ సెక్టార్‌లో మెహరించాలని భారత వాయుసేన భావించినట్టు తెలుస్తోంది. మరోవైపు చైనా, పాకిస్తాన్‌ల నుంచి ఏకకాలంలో వచ్చే ముప్పుని ఎదుర్కోవడానికి వీలుగా పశ్చిమ ప్రాంతంలో ఈ క్షిపణుల్ని మోహరించే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్టుగా రక్షణ శాఖలోని కొందరు అధికారులు చెబుతున్నారు. చైనా ఇప్పటికే ఎస్–400 రెండు క్షిపణుల్ని లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మోహరించింది. 2018లో రూ.35 వేల కోట్లతో 5 ఎస్–400 క్షిపణుల కొనుగోలుకు రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. సముద్రం, గగనతలం మీదుగా ఈ క్షిపణుల అందజేయనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 5 క్షిపణులు భారత్‌కు చేరనున్నాయి. ఇప్పటికే ఈ క్షిపణుల వినియోగంపై భారత వైమానిక దళం అధికారులకు శిక్షణ కూడా పూర్తయింది.
అమెరికా అభ్యంతరాలు
భారత్, రష్యాతో క్షిపణుల కొనుగోలు ఒప్పందాన్ని మొదట్నుంచీ అమెరికా వ్యతిరేకిస్తోంది. రష్యాతో ఎలాంటి లావాదేవీలు చేయొద్దని ఒత్తిడి పెంచుతోంది. అయితే ప్రాంతీయ భద్రత, రక్షణ రంగంలో అవసరాల దృష్ట్యా ఎస్–400 ఒప్పందానికి మినహాయింపు ఇవ్వాలని అమెరికా సెనేటర్లు అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. దీనిపై ఎలాంటి స్పందన రాకుండానే క్షిపణి వ్యవస్థ భారత్‌కు చేరుకునే ప్రక్రియ ప్రారంభం కావడం గమనార్హం.
భారత్‌కు ఎస్–400 క్షిపణి వ్యవస్థ
Published Mon, Nov 15 2021 3:59 AM | Last Updated on Mon, Nov 15 2021 3:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment