మేరీల్యాండ్‌లోని వైమానిక స్థావరానికి చేరుకున్న ట్రంప్ దంపతులు
వాషింగ్టన్: భారత్ ఎంతో గొప్ప దేశమని, తన పర్యటన పూర్తిస్థాయిలో విజయవంతమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుష్నర్, ఇతర ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి భారత్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకున్న ఆయన బుధవారం అమెరికాకు చేరుకున్నారు. స్వదేశానికి వెళ్లిన వెంటనే ట్రంప్ ‘భారత్ చాలా గొప్ప దేశం. నా పర్యటన విజయవంతమైంది’అని ట్వీట్ చేశారు.
అధ్యక్ష ఎన్నికలయ్యాక రావాలనుకున్నా..
ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక భారత పర్యటనకు రావాలని భావించానని ట్రంప్ చెప్పారు. మోదీకి ఆ ఆలోచన నచ్చకపోవడంతో ముందే వచ్చానన్నారు. రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం విందులో ట్రంప్ ఈ విషయం చెప్పారు. ‘భారత్‌కి మళ్లీ మళ్లీ వస్తూ ఉండాలని ఆశపడుతున్నాను’అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ ప్లేటర్‌ను ఆస్వాదించిన ట్రంప్
ట్రంప్, భార్య మెలానియా భారత్ పర్యటనలో బస చేసిన ఐటీసీ మౌర్యలో వారి కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ట్రంప్ ప్లేటర్ భోజనాన్ని ఎంజాయ్ చేస్తూ తిన్నారు. టేబుల్ సైజ్‌లో ఉండే నాన్, మటన్ లెగ్‌తో తయారు చేసిన సికందరి నాన్ రుచికి వారు ఫిదా అయ్యారని హోటల్ వర్గాలు వెల్లడించాయి. వారు వెళ్లేటపుడు ఎంఎఫ్ హుస్సేన్ గుర్రం చిత్రం ముద్రించిన అప్రాన్‌లను హోటల్ యాజమాన్యం అధ్యక్షుడికి కానుకగా ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment