వాషింగ్టన్ : అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధ్యక్షుడికి అండగా నిలబడటం తప్పుడు సంకేతాలు పంపుతుందని, ఇది అమెరికా భవిష్యత్‌కు మంచిది కాదని ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియకు ఆమె గట్టి మద్దతుదారుగా నిలిచారు. అధికార దుర్వినియోగానికి పాల్పడే అధ్యక్షుడిని ఇలాగే వదిలేస్తే రానున్న అధ్యక్షులు సైతం తమ సొంత రాజకీయ ప్రయోజనాలను అమెరికన్ ప్రజలపై రుద్దుతారని, మన జాతీయ భద్రత, ఎన్నికలు, మన ప్రజాస్వామ్యానికే ఇది ముప్పుగా పరిణమిస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
జ్యుడిషియరీ కమిటీ ఎదుట ట్రంప్ అభిశంసనపై విచారణ తొలి రోజున ప్రమీలా జయపాల్ ట్రంప్ అభిశంసనకు మద్దతుగా మాట్లాడారు. జ్యుడిషియరీ కమిటీలో ఆమె ఒక్కరే ఇండియన్-అమెరికన్ సభ్యురాలు కావడం గమనార్హం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదవిని వాడుకుంటున్న అధ్యక్షుడిని సాగనంపకుంటే మనం ఎక్కువ కాలం ప్రజాస్వామ్యంలో మనగలగలేమని, నియంత పాలనలో కూరుకుపోతామని ఆమె హెచ్చరించారు. . ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ట్రంప్ చేసిన ఫోన్ కాల్ కలకలం రేపడంతో అభిశంసన విచారణ ప్రధానంగా ఈ అంశం చుట్టూ సాగుతోంది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరఫున తనకు ప్రధాన పోటీదారుగా నిలవనున్న జో బిడెన్‌కు ఉక్రెయిన్‌లో ఉన్న వ్యాపారాలపై విచారణ జరిపి, తనకు సాయం చేయాలంటూ జెలెన్‌స్కీని కోరారన్నది ట్రంప్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment