కిక్కిచ్చే విదేశీ మద్యంలో పిచ్చెక్కించే నిజాలు? | indian Domestic wine packing in foreign bottles | Sakshi
Sakshi News home page

కిక్కిచ్చే విదేశీ మద్యంలో పిచ్చెక్కించే నిజాలు?

Published Tue, Feb 28 2017 8:46 PM | Last Updated on Thu, Oct 4 2018 7:50 PM

indian Domestic wine packing in foreign bottles

 

విస్కీ, బ్రాందీ, రమ్ము, ఓడ్కా, జిన్ను.. పేరేదైనా అంతా నాటు సారానే!
విదేశాల్లో తృణధాన్యాలతో మద్యం తయారీ.. చెక్క పీపాల్లో నిల్వ ప్రధానం
భారతదేశంలో 90 శాతం ఐఎంఎఫ్ఎల్‌ మద్యం మొలాసిస్‌ నుంచే తయారీ
విస్కీ, బ్రాందీ తదితర రుచులు, వాసనల కోసం కృత్రిమ ఫ్లేవర్ల వినియోగం
చెక్క పీపాల్లో నిల్వ ఊసే అరుదు.. డిస్టిలరీల నుంచి నేరుగా సీసాల్లో సరఫరా


విస్కీ, బ్రాందీ, రమ్ము, జిన్ను, ఓడ్కా.. మందు ఏదైనా అంతా నాటు సారానే! భారత్‌లో తయారు చేసే విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్) పేరుతో మన దేశంలో తయారు చేసి తళతళలాడే కొత్త సీసాల్లో విక్రయిస్తున్న ఈ మద్యానికి.. మన ఊళ్లల్లో శివార్లల్లో చిట్టడవుల్లో అక్రమంగా కాచి పాత సీసాల్లో చౌకగా విక్రయించే నాటు సారాకు.. పెద్ద తేడా లేదు!! నాటు సారాలో రంగు కలపరు.. వేర్వేరు రుచులూ ఉండవు. ‘బ్రాండెడ్’ లిక్కర్లో కొన్ని రంగులు, కొన్ని కృత్రిమ రుచులు కలుపుతారు అంతే తేడా!!!

ఇతర దేశాల్లో విస్కీ, బ్రాందీ, రమ్ము, ఓడ్కా, జిన్ను వంటి మద్యపానీయాల తయారీకి.. మన దేశంలో అవే పేర్లతో విక్రయించే మద్యపానీయాల తయారీకి చాలా తేడా ఉంది. అక్కడ ఒక్కో రకం మద్యం తయారీకి నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది. అందులో ఉపయోగించే పదార్థాలు వేర్వేరుగా ఉంటాయి. తయారు చేసిన మద్యాన్ని ఓక్ చెక్క పీపాల్లో కొన్నేళ్ల పాటు నిల్వ ఉంచిన తర్వాత సీసాలకు నింపి మార్కెట్‌కు పంపిస్తారు. కానీ.. మన దేశంలో అన్ని రకాల మద్యాలనూ ఒకే పద్ధతిలో తయారు చేస్తారు. అన్నిట్లోనూ ఒకటే పదార్థం ఉపయోగిస్తారు.

విస్కీ, బ్రాందీ, రమ్ము, ఓడ్కా, జిన్నుల పేర్ల ప్రకారం ఆయా రుచులు, రంగులు వచ్చేట్లు కృత్రిమ ఫ్లేవర్లు కలుపుతారు. తయారైన వెంటనే సీసాల్లో నింపి మార్కెట్‌కు తరలిస్తారు. నిజానికి మన దేశంలో చేసినట్లు విదేశాల్లో మద్యం తయారు చేసి విక్రయిస్తే.. అది పెద్ద స్కామ్ అవుతుంది. కానీ మన దేశంలో ఈ తయారీ విధానాలకు బ్యూరో ఆఫ్ఇండియన్‌ స్టాండర్డ్స్(బీఐఎస్) చట్టబద్ధత కల్పిస్తోంది. ఐఎంఎఫ్ఎల్‌ పేరుతో  అమ్ముడవుతున్న ఈ మద్యం మార్కెట్‌ విలువ ఇంటర్నేషనల్‌ వైన్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ ప్రకారం 2014లో రూ. 41,000 కోట్లు.

అక్కడ తృణధాన్యాలు.. ఓక్‌ చెక్క పీపాలు: విస్కీ అంటే.. ఏదో ఒక రకమైన తృణధాన్యాలను ఇతర తృణధాన్యాలతో కలిపి లేదా కలపకుండా  నానబెట్టి, పులియబెట్టి వాటి నుంచి తయారు చేసే మద్యపానీయం’ అనేది యూరప్2008లో ఇచ్చిన నిర్వచనం. అమెరికాలో, మెక్సికోలో కూడా వారి వారి సొంత నిర్వచనాలు ఉన్నాయి. కానీ.. విస్కీని తృణధాన్యాల నుంచి తయారు చేయాలని, తయారు చేసిన విస్కీని చెక్క పీపాల్లో నిర్దష్ట కాలం నిల్వ చేయాలనే కొన్ని పద్ధతులు వారందరికీ ప్రాధమిక సూత్రాలు.

విస్కీ రంగు, రుచి, వాసన వంటి ప్రధాన లక్షణాలను అదనంగా వేరే పదార్థాలను కలపడం ద్వారా తీసుకురాకూడదు అనేది ఇంకా ముఖ్యమైన నియమం. బార్లీ, మొక్కజొన్న, రై, గోధుమల్లో ఏదో ఒక ధాన్యం పిండిని పులియబెట్టి ఈ మద్యాన్ని తయారు చేయాలి. తయారైన మద్యాన్ని కనీసం మూడు సంవత్సరాల పాటు ఓక్చెక్క పీపాల్లో నిల్వ ఉంచాలి. విభిన్న రంగులు, రుచుల కోసం ఈ ఓక్చెక్క పీపాల రకాలను మార్చడం, నిల్వ కాలాన్ని పెంచడం వంటి చర్యలు చేపడతారు. మొత్తం మీద తృణధాన్యాలతో తయారు చేసిన విస్కీని చెక్క పీపాల్లో కొన్నేళ్లు నిల్వ ఉంచితేనే అది నిజమైన విస్కీ అవుతుందనేది ప్రపంచ దేశాల్లో పాటించే పద్ధతి. నిర్దిష్ట కాలం నిల్వ ఉంచిన తర్వాత ఆ మద్యం తగిన ‘వయసు’కు వస్తుంది. అనంతరం దాన్ని సీసాల్లో నింపి మార్కెట్లోకి పంపుతారు.

ఇక్కడ మొలాసిస్.. కృత్రిమ ఫ్లేవర్లు..: ప్రపంచంలో అత్యధిక శాతం విస్కీని వినియేగించే దేశం భారతదేశమే. కానీ.. మన విస్కీలో 90 శాతం పైగా అసలు విస్కీ కాదు. అది మొలాసిస్తో చేసిన సారాయి. మన దేశంలో తయారు చేసే మూడు రకాల విస్కీల్లో.. మాల్ట్ విస్కీ, గ్రెయిన్ విస్కీలు మాత్రమే అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా ఉంటాయి. సాధారణ విస్కీ మాత్రం.. మొలాసిస్నుంచి తయారు చేస్తారు. ఇదే దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న సామాన్య మద్యప్రియులు సేవించే విస్కీ. చెరకు గడల నుంచి పంచదారను తయారు చేసేటపుడు ఉప ఉత్పత్తిగా వచ్చే ఒక ద్రవపదార్థం మొలాసిస్.

దీనిని డిస్టిల్ చేసి విస్కీని తయారు చేస్తారు. కాకపోతే విస్కీ రంగూ, రుచీ, వాసన కోసం కృత్రిమ ఫ్లేవర్లు కలుపుతారు. బ్రాందీ, రమ్ము, ఓడ్కా అన్నీ కూడా ఇలా మొలాసిస్తో చేసేవే. ఇది 19వ శతాబ్దంలో బ్రిటిష్పాలనలోనే ఆరంభమైంది. కారణం.. ఆ కాలంలో కరవు కాటకాలతో ఆహార ధాన్యాలకు ఎల్లప్పుడూ కొరత ఉండటం. ఫలితంగా మద్యం తయారీకి మొలాసిస్నే ప్రధాన ఆధారంగా ఎంచుకున్నారు. దేశీయంగా అభివృద్ది చెందిన ఈ షార్ట్ కట్ పద్ధతులనే అధికారిక మద్యం తయారీ విధానంగా మార్చేశారు. అందుకే.. 1500కు పైగా గల భారతీయ మద్యం బ్రాండ్లలో చాలా వాటిని యూరోపియన్ మార్కెట్లలోకి అనుమతించలేదు.

మన ‘విదేశీ మద్యం’ తయారీ ఇలా..!
మన దేశంలో మొలాసిస్ ను పులియబెట్టడం ద్వారా నాటు సారా తయారు చేస్తారు. ఇక వివిధ రకాల విదేశీ మద్యం ఎలా తయారు చేస్తున్నారో, అవే మద్యాలను విదేశాల్లో ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా చూస్తే...

విస్కీ:
అంతర్జాతీయంగా: పూర్తిగా తృణధాన్యాలు లేదా మాల్టెడ్తృణధాన్యాలు లేదా రెండిటినీ కలిపిన వాటి నుంచి తయారు చేస్తారు. కనీసం మూడు సంవత్సరాల పాటు ఓక్ చెక్క పీపాల్లో నిల్వ చేస్తారు.
భారతదేశంలో: మొలాసిస్ను డిస్టిల్ చేసి విస్కీ తయారు చేస్తారు. కృత్రిమ ఫ్లేవర్లు కలుపుతారు. అత్యధికభాగం నిల్వ ఉంచరు. ‘ఏజ్డ్’ అని లేబుళ్లపై పేర్కొనే రకాలను మాత్రం కనీసం ఒక ఏడాది నిల్వ ఉంచుతారు.  

రమ్ము:
అంతర్జాతీయంగా: మొలాసిస్తో తయారు చేస్తారు. కనీసం రెండేళ్లు ఓక్ చెక్క పీపాల్లో నిల్వ ఉంచుతారు. తద్వారా రంగు, రుచి సహజంగా వస్తాయి.
భారతదేశంలో: మొలాసిస్ లేదా కార్బొహైడ్రేడ్ల నుంచి చేసి, కృత్రిమ ఫ్లేవర్లు, రంగులు కలుపుతారు. నిల్వ చేయరు.

బ్రాందీ:
అంతర్జాతీయంగా: వైన్లేదా, పులియబెట్టిన ద్రాక్షపళ్ల నుండి తయారు చేస్తారు. ‘బ్లెండెడ్’ రకం బ్రాందీ కోసం మరొక పండును కూడా దీనికి కలపవచ్చు. కనీసం రెండేళ్ల పాటు నిల్వ చేస్తారు.  
భారతదేశంలో: కేవలం మొలాసిస్తో చేసి కృత్రిమ ఫ్లేవర్లు, రంగులు కలుపుతారు. నిల్వ ఉంచరు. దీనికి రెండు శాతం ద్రాక్ష బ్రాందీ కలిపితే దానిని బ్లెండెడ్బ్రాందీ అంటున్నారు.

జిన్ను:
అంతర్జాతీయంగా: తృణధాన్యం నుంచి తయారు చేసిన మద్యానికి జునిపర్మొక్క ఫ్లేవర్ను కలిపితే జిన్ను అవుతుంది.
భారతదేశంలో: మన దేశంలో మొలాసిస్నుంచి తయారు చేసిన మద్యానికి కృత్రిమ జునిపర్ఫ్లేవర్కలుపుతారు.

ఓడ్కా:
అంతర్జాతీయంగా: బంగాళదుంపలు, ఏవైనా కూరగాయలు, చెరకులతో ఓడ్కాను చేస్తారు. వీటిలో కొన్నిటిని కలిపి కూడా చేస్తారు.
భారతదేశంలో: మొలాసిస్లేదా పులియబెట్టిన తృణధాన్యం లేదా ఇతర కార్బొహైడ్రేడ్ల నుంచి తయారు చేస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2010 లెక్కల ప్రకారం మద్యం మార్కెట్విక్రయాలు ఇలా...

విస్కీ               75%
రమ్ము              15%
ఓడ్కా, జిన్ను     5%
బ్రాందీ               5%
(ఔట్లుక్మేగజీన్సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement