
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా కాలపరిమితిని మూడేళ్ల కన్నా తక్కువకు కుదించడంపై అమెరికా కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. వేయికి పైగా ఇండో–అమెరికన్ల నేతృత్వంలోని కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీ సర్వ్ అలయన్జ్ అనే సంస్థ అమెరికా వలస సేవల సంస్థ యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్)కి వ్యతిరేకంగా ఈ దావా వేసింది. మూడేళ్ల కన్నా తక్కువ వ్యవధికే హెచ్–1బీ వీసాలను మంజూరుచేసే ప్రక్రియను ఇమిగ్రేషన్ ఏజెన్సీ ఇటీవల చేపట్టిందని ఐటీ సర్వ్ అలయన్జ్ పేర్కొంది.
ఇలా జారీ అవుతున్న వీసాల కాల పరిమితి చాలా తక్కువగా ఉంటోందని, కొన్నిసార్లు 45, 60 రోజుల పరిమితితో కూడా వీసాలు జారీ అవుతున్నాయని తెలిపింది. నిబంధనల్ని తప్పుగా అన్వయించి, వీసా గడువును తగ్గించే అధికారం ఇమిగ్రేషన్ ఏజెన్సీకి లేదని తెలిపింది. మూడేళ్ల కాలానికి వీసాల్ని మంజూరుచేసే అధికారాన్ని అమెరికా పార్లమెంట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్‌కు కట్టబెట్టిన సంగతిని గుర్తుచేసింది.
‘ఇమిగ్రేషన్ విభాగం ఇష్టారీతిలో నిబంధనలు రూపొందిస్తోంది. తప్పుల్ని సరిచేసి చట్టాల్ని సరిగా పాటించేలా ఇమిగ్రేషన్ విభాగంలో పారదర్శకత పెంచడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇక ఫెడరల్ కోర్టులోనే తేల్చుకుంటాం’ అని ఐటీ సర్వీస్ అలయన్జ్ అధ్యక్షుడు గోపి కందుకూరి అన్నారు. తరచూ వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుండటం పట్ల విసిగిపోయామని తెలిపారు. అమెరికా ఇమిగ్రేషన్ ఏజెన్సీకి వ్యతిరేకంగా ఐటీ సర్వీస్ అలయన్జ్ దావా వేయడం ఇది రెండోసారి.
మొదటి వ్యాజ్యాన్ని ఈ ఏడాది జూలైలో దాఖలుచేసింది. నాన్–ఇమిగ్రంట్ వీసా అయిన హెచ్–1బీ వీసాలను విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు గాను అమెరికా కంపెనీలకు 3–6 సంవత్సరాల కాలపరిమితికి జారీచేస్తారు. ఈ వీసా పొందిన ఉద్యోగి అమెరికాలో కనీసం మూడేళ్ల వరకు నివసించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment