
'ఆ ప్రమాదంలో ఒక్క ప్రాణం పోకపోవడం ఆశ్చర్యం'
మెల్బోర్న్: నిర్లక్ష్యంగా కారు నడిపి కొందరిని తీవ్రంగా గాయపరిచినందుకు ఓ భారతీయ సంతతి వ్యక్తికి న్యూజిలాండ్ కోర్టు భిన్నంగా శిక్ష విధించింది. 125గంటలపాటు (ఐదు రోజుల ఐదుగంటలు) కమ్యూనిటీ సేవ చేయాలని ఆదేశించింది. దీంతోపాటు మరో ఏడాదికాలంపాటు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని రద్దు చేసింది. సందీప్ కుమార్ అనే భారత సంతతి పౌరుడు 2014 జనవరిలో నిర్లక్ష్యంగా కారు నడిపాడు. ఆ సమయంలో కారులో మొత్తం ఏడుగురు తన కుటుంబ సభ్యులు ఉన్నారు.
కారు డ్రైవింగ్ చేస్తూ అతడు నిద్రలోకి జారడంతో అది కాస్త రోడ్డుపక్కకు వెళ్లి ఓ పది మీటర్ల ఎత్తున్న కొండలాంటిదానికి తగిలి ఆగిపోయింది. దీంతో ఆ కారులో ప్రయాణించేవారిలో అతడి వదిన, అన్నయ్య, వారి కుమారుడు తీవ్రంగా గాయపడగా స్నేహితులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఏడు ఆరోపణలతో కోర్టు ఈ ఏడాది జూన్లో విచారణ చేపట్టింది. ఈ తీర్పు సందర్భంగా అంతపెద్ద ప్రమాదం జరిగినా ప్రాణనష్టం జరగకపోవడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.