
న్యూజిలాండ్ లో భారతీయుడి సాహసం..
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో ఓ భారతీయుడు చేసిన సాహసంతో ఓ దోపిడి దొంగ తోక ముడిచాడు. దోపిడీ చేయలేక పారిపోయాడు. హామిల్టన్లోని హుకనూయి రోడ్డులో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి చిన్న దుకాణం నడుపుకుంటున్నాడు. అక్కడి ముసుగు ధరించి చేతిలో తుపాకీతో వచ్చిన ఓ వ్యక్తి వెంటనే క్యాష్ కౌంటర్లోని సొమ్మంతా తీసి తన బ్యాగులో వేయాలని బెదిరించాడు. దీంతో తొలుత భయపడిన అతడు కౌంటర్ తెరిచి డబ్బులిచ్చేందుకు ప్రయత్నించాడు.
వెంటనే తాళం రాకపోవడంతో దానితో కాసేపు పెనుగులాడుతూ కనిపించాడు. దీంతో అసహనానికి లోనైన దోపిడీ దొంగ ఏకంగా క్యాష్ కౌంటర్పైకి ఎక్కి కూర్చున్నాడు. దీంతో అతడి చేతిలో తుపాకీ లాక్కొనే అవకాశం షాప్ యజమానికి వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పనిచేశాడు. ఈ క్రమంలో ఇద్దరు కిందపడ్డారు. దొర్లుతూ పిడిగుద్దులు గుప్పించాడు. దీంతో చివరికి యజమాని చేతిలోకి తుపాకీ రావడంతోపాటు దొంగ ముసుగు కూడా వీడింది. దీంతో అతడు ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. ప్రాణాలకు తెగించి భారతీయుడు చేసిన సాహాసాన్ని అందరూ మెచ్చుకున్నారు.