‘తుపాకీ గురిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు’
ఇస్లామాబాద్: తలకు తుపాకీని గురిపెట్టి మరీ పాకిస్థాన్ వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని ఓ భారతీయురాలు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. తిరిగి తనను మాతృదేశం(భారత్) పంపించే వరకు వెళ్లబోనంటూ స్పష్టం చేసింది. మరోపక్క, ఆమె భర్త మాత్రం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక వర్గాల సమాచారం ప్రకారం ఉజ్మా అనే భారతీయ మహిళకు తాహిర్ అలీ పాక్ వ్యక్తికి మలేషియాలో పరిచయం అయింది. అది కాస్త ప్రేమగా మారింది.
దీంతో తన బంధువులను చూసేందుకు వెళుతున్నానని చెప్పి ఉజ్మా వాఘా సరిహద్దు గుండా మే 1న పాక్‌కు వెళ్లింది. అక్కడే వారి వివాహం మే 3న అయినట్లు తెలుస్తోంది. అయితే, అతడికి అంతకు ముందే వివాహం అయినట్లు, నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం ఉజ్మాకు తెలియదు. పైగా, కేవలం చూసేందుకు వెళ్లిన తనపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా బెదిరించి, తుపాకీ గురి పెట్టి మరి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, అప్పటి నుంచి శారీరకంగా, లైంగికంగా హింసిస్తున్నాడంటూ భారత హైకమిషనర్‌ను ఆశ్రయించింది. వెంటనే తనను భారత్ పంపించాలని, తన వద్ద ఉన్న ఇమ్మిగ్రేషన్ దస్తా వేజులు కూడా వారు దొంగిలించారని ఆరోపించింది. ఈ విషయంపై అటు ఇండియాలోని పాక్ హైకమిషనర్, పాక్‌లోని భారత హైకమిషనర్ సమన్వయ పరుస్తున్నాయి.