లండన్: ప్రపంచంలో సంతోషమయ జీవితాన్ని గడుపుతున్న దేశాల్లో భారత్ స్థానం దిగజారింది. 156 దేశాలతో కూడిన జాబితాలో భారత్ 133వ స్థానంతో సరిపెట్టుకుంది. గతంలో భారత్ ర్యాంకు 122 కావడం గమనార్హం. సార్క్‌దేశాలతో (దక్షిణాసియా) పోల్చితే యుద్ధ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గానిస్తాన్ (145 ర్యాంక్) కన్నా మాత్రమే ఈసారి మెరుగైన స్థితిలో ఉంది. పొరుగుదేశాలైన పాకిస్తాన్–75, భూటాన్–97, నేపాల్–101, బంగ్లాదేశ్–115, శ్రీలంక–116 భారత్ కన్నా మెరుగైన ర్యాంకులు సాధించాయి.
ఈ నెల 20న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపినెస్’ను పురస్కరించుకుని ఐరాసకు చెందిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్(ఎస్‌డీఎస్‌ఎన్) ఈ వార్షిక నివేదిక విడుదల చేసింది. అత్యంత సంతోషమయ దేశంగా ఫిన్‌లాండ్ నిలవగా ఆ తరువాతి స్థానాల్లో వరసగా నార్వే, డెన్మార్క్ ఉన్నాయి. వలసదారుల స్థితిగతులు, తలసరి ఆదాయం, స్వేచ్ఛ, విశ్వాసం, దాతృత్వం, అవినీతిరాహిత్యం, ఆరోగ్యకర ఆయుఃప్రమాణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక రూపొందించారు.
170 పేజీల రిపోర్ట్‌లో...ప్రపంచాన్ని పీడిస్తున్న మత్తు పదార్థాలు, ఊబకాయం, కుంగుబాటు వంటి ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇతర దేశాలతో పోల్చితే ఈ సమస్యలు అమెరికాలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. గతంలో అగ్రస్థానంలో ఉన్న డెన్మార్క్‌ను వెనక్కి నెట్టి ఈ ఏడాది సూచీలో అత్యంత సంతోషరకరమైన దేశంగా ఫిన్‌లాండ్(గతంలో అయిదోస్థానం) నిలిచింది.
ప్రకృతి, భద్రత, పిల్లల సంరక్షణ, మంచి పాఠశాలలు, ఉచిత వైద్యసేవలు వంటి అంశాల్లో ఫిన్‌లాండ్ అత్యుత్తమ మార్కులు సాధించింది. అమెరికా 18వ స్థానంలో (గతేడాది 14), బ్రిటన్–19, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్–20వ స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో సిరియా కన్నా వెనిజులా వెనుకబడింది. భారత్, చైనా లాంటి వర్ధమాన దేశాల్లో ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు తరలిపోతున్నా వారు సంతోషంగా ఉండట్లేదని తేలింది.
తొలి ఐదు
1. ఫిన్లాండ్
2. నార్వే
3. డెన్మార్క్
4. ఐస్‌లాండ్
5. స్విట్జర్లాండ్
చివరి ఐదు ర్యాంకులు
156. బురుండి
155. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
154. దక్షిణ సూడాన్
153. టాంజానియా
152. యెమెన్
Comments
Please login to add a commentAdd a comment