మత్తుమందుకు బదులు ఐప్యాడ్
లండన్: సర్జరీల సమయంలో రోగులకు మత్తుమందు ఇస్తారనే విషయం తెలిసిందే. చిన్నపాటి సర్జరీలకు లోకల్ అనస్తీషియా ఇస్తారు. అంటే సర్జరీ చేసే ప్రాంతంమాత్రమే మొద్దుబారిపోయేలా చేస్తుందన్నమాట. అయితే చిన్నపిల్లలకు ఇటువంటి సర్జరీలు చేసే సమయంలో మత్తుమందులకు బదులు వారి చేతిలో ఓ ఐప్యాడ్ పెడితే సరిపోతుందంటున్నారు పరిశోధకులు. వినడానికి విచిత్రంగానే ఉన్న ఈ ఆలోచన చాలా బాగా పనిచేస్తోందట. సర్జరీ సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నప్పుడు పిల్లలు అదోరకమైన ఆందోళనకు గురవుతారు.
ఇటువంటి సమయంలో వారికి సంప్రదాయంగా వినియోగిస్తున్న మత్తుమందు ఇచ్చి సర్జరీ చేస్తారు. దీనికి బదులుగా వారి చేతికి ఓ ఐప్యాడ్‌ను ఇస్తే తల్లిదండ్రులు తమవద్ద లేరన్న ఆలోచన రాకుండా ఉంటుందని, అంతగా ఆందోళన చెందరని పరిశోధనలో తేలింది. సాధారణంగా సర్జరీకి ముందు ఇచ్చే మిడాజోలమ్‌తో పోలిస్తే ఐప్యాడ్ ఎంతవరకు ఆందోళనను తగ్గిస్తుందనే విషయంపై లండన్‌లోని మియర్ ఇన్‌ఫాంట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ డొమినిక్ పరిశోధనలు జరిపారు. దీంతో తల్లిదండ్రులతో పోలిస్తే పిల్లల్లో ఆందోళనను ఐప్యాడ్ గణనీయంగా తగ్గించిందని తేలింది. పదే పదే మత్తుమందుల వినియోగం కంటే ఇలాంటి పరిష్కారాలను వెతకడం అవసరమని, దీనివల్ల అనేక దుష్ఫలితాలను అధిగమించవచ్చని డొమినిక్ తెలిపారు.