
మోసుల్‌లో విజయం సాధించాం
ఇరాక్‌లోని మోసుల్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదులపై విజయం సాధించామని ఆ దేశ ప్రధాని హైదర్ అల్ అబాదీ ఆదివారం ప్రకటించారు.
ఇరాక్ ప్రధాని అబాదీ ప్రకటన
మోసుల్: ఇరాక్‌లోని మోసుల్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదులపై విజయం సాధించామని ఆ దేశ ప్రధాని హైదర్ అల్ అబాదీ ఆదివారం ప్రకటించారు. ఈ ‘విముక్త’ నగరంలో ఆయన విజయ ప్రకటన చేశారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ‘అబాదీ మోసుల్‌కు వెళ్లి ఈ ఘన విజయాన్ని సాధించినందుకు వీర సైనికులకు, దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు’ అని వెల్లడించింది. అబాదీ మోసుల్‌లో నల్లటి సైనిక దుస్తుల్లో, తలపై టోపీతో ఉన్న ఉన్న ఫొటోను ఆయన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
అయితే ఆదివారం కూడా నగరంలో కాల్పులు, వైమానిక దాడులు జరిగాయి. ఆదివారం మోసుల్ సమీపంలోని టైగ్రిస్ నది దాటి పారిపోతున్న 30 మంది ఉగ్రవాదులను హతమార్చామని ఇరాక్ సైన్యం తెలిపింది. మోసుల్‌ను ఉగ్రవాదుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇరాక్ బలగాలు తొమ్మిది నెలలు భీకర యుద్ధం చేశాయి. ఘర్షణలకు భయపడి 9 లక్షల మంది ప్రజలు నగరాన్ని వదలివెళ్లారు. అమెరికా సైనిక సాయంతో ఇరాక్ సైన్యం ఐసిస్ చెరలోని చాలా ప్రాంతాలను ఇదివరకే విముక్తం చేసింది.