ఇస్లామిక్ స్టేట్‌కు గట్టి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో ఆ సంస్థ కీలక నేత ఇబ్రహీం అల్-అన్సారీ హతమయ్యాడు. బాగ్దద్‌లో సంకీర్ణ సేనలకు నేతృత్వం వహిస్తున్న కల్నల్ జోఫ్‌ఫ్ స్క్రోక్కా గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు.
సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహించే ఇస్లామిక్ స్టేట్ ప్రచార కార్యక్రమాల్లో అల్-అన్సారీ కీలక వ్యక్తి అని జోసఫ్ తెలిపారు. విదేశీయులను ఇస్లామిక్ స్టేట్‌లోకి ఆకర్షించడం, పశ్చిమ దేశాలపై దాడులను ప్రోత్సహించడంలో అల్-అన్సారీ పాత్ర ఉందని ఆయన వెల్లడించారు. పశ్చిమ ఇరాక్‌లోని అల్-క్వైమ్ పట్టణంలో జరిగిన ఈ వైమానిక దాడుల్లో అల్- అన్సారీతో పాటు.. నలుగురు ఇస్లామిక్ స్టేట్ మల్టీ మీడియా ఆపరేషన్ టీంకు చెందిన వారు హతమయ్యారని భద్రతా అధికారులు వెల్లడించారు.