జమ్మూ:ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా రెచ్చిపోతున్న ఐస్లామిక్ స్టేట్(ఐఎస్) టెర్రరిస్ట్ గ్రూపు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో పాగా వేయడానికి తన కార్యాచరణను ముమ్మరం చేసినట్లు భారత్ ఆర్మీ స్పష్టం చేసింది. దీనిలో భాగంగా తమకు కావల్సిన మౌలిక సదుపాయాలను ఇస్లామిక్ ఉగ్రవాదులు భారీ స్థాయిలో ఏర్పరుచుకుంటూ భారత్ పై దాడులు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ సీనియర్ ఆర్మీ అధికారి శుక్రవారం తెలిపారు.
దీనిలో భాగంగానే దాదాపు 225 మంది టెర్రరిస్టులు 36 పడవల్లో పిర్ పంజాల్ సరిహద్దుకు చేరుకున్నారని ఆర్మీ లెఫ్ట్ నెంట్ జనరల్ కేహెచ్ ఖాన్ తెలిపారు. ప్రస్తుతం భారత్ వైపు దూసుకురావడానికి యత్నిస్తున్నట్లు తెలిపారు. దీంతో సరిహద్దులోని సైనికులను అప్రమత్తం చేశామన్నారు. గత కొన్ని రోజుల క్రితం దక్షిణ కశ్మీర్ లో వేర్పాటు వాది ఖాజీ నిజార్ అహ్మద్ మృతిచెందిన అనంతరం చోటు చేసుకున్న కొన్ని పరిణామాలను కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నిజార్ మృతి సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కొంతమంది యువకులు తమ ముఖాలకు మాస్క్ లు ధరించి అంతర్జాతీయ టెర్రర్ గ్రూప్ కు చెందిన జెండాలను ఎగరేసి దుందుడుకు చర్యలు దిగినట్లుకేహెచ్ ఖాన్ తెలిపారు.