ఐసిస్‌కు గట్టి ఎదురుదెబ్బ
బీరూట్(లెబనాన్): మధ్య ఆసియాను గడగడలాడిస్తున్న తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)కు గట్టి షాక్ తగిలింది. ఐసిస్ అధికార వార్తా సంస్థ ఆమక్ స్థాపకుడైన బరా కడెక్ సంకీర్ణ దళాల బాంబు దాడిలో చనిపోయినట్లు అతని సోదరుడు హజైఫా వెల్లడించాడు. తూర్పు సిరియాలో డైర్ ఎల్ జోర్ ప్రావిన్సు మయదీన్ పట్టణంలోని అతని ఇంటిపై బుధవారం జరిగిన దాడిలో బరా కడెక్‌తోపాటు అతని కుమార్తె కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అతడు వివరించాడు.
బరా కడెక్ మృతిని ఇతర వార్తా సంస్థలు కూడా ప్రకటించినప్పటికీ ఎప్పుడు, ఎక్కడ అనేది ధ్రువీకరించలేక పోయాయి. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్‌లో హజైఫా పెట్టిన పోస్టింగ్‌తో బరాకడెక్ మరణాన్ని ధ్రువీకరించినట్లయింది. కడెక్ అతని కుమార్తెతో కలిసి కారులో వెళ్తుండగా అమెరికా సారథ్యంలోని సంకీర్ణ బలగాలు దాడి చేశాయని హలాబ్ న్యూస్ నెట్‌వర్క్ తెలిపింది. అయితే, దీనిని అమెరికా తరఫున ఎవరూ ధ్రువీకరించలేదు. కాగా, ఐఎస్ పోరాటం, దాడులు, నష్టం తదితర వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఆమక్ వార్తాసంస్థ అతివేగంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల నుంచి ఆమక్‌ను నిషేధించినప్పటికీ ఆమక్ విశ్వసనీయ ప్రసార మాధ్యమంగా మారింది. అమెరికా సారథ్యంలోని సంకీర్ణ దళాలు, కుర్దిష్ బలగాల దాడుల నేపథ్యంలో ఆమక్ వార్తా సంస్థ మయదీన్ పట్టణం కేంద్రంగా గత కొంతకాలంగా పనిచేస్తోంది.