Islamic State terrorists
-
కాబూల్‌పై విరుచుకుపడ్డ ఉగ్రమూకలు
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌పై ఉగ్రమూకలు మరోసారి విరుచుకుపడ్డాయి. సోమవారం నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 40 మంది మృతి చెందగా, 49 మంది గాయపడినట్టు స్థానిక అధికారులు ప్రకటించారు. మృతుల్లో ఆరుగురు జర్నలిస్టులు ఉన్నట్టు సమాచారం. ఈ దాడిలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అదికారులు తెలిపారు. తొలుత ఉదయం 8 గంటల ప్రాంతంలో అఫ్ఘాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రధాన కార్యలయం సమీపంలో మోటర్ సైకిల్‌పై వచ్చిన ఉగ్రవాది పేలుళ్లకు పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. మీడియా ప్రతినిధులు కూడా ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ సమయంలో వారిలో ఒకరిగా కలిసిపోయిన మరో తీవ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. మొదటి దాడి జరిగిన కొద్ది సేపటికే రెండో దాడి చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ రెండు ఘటనల్లో పలువురు జర్నలిస్టులతో సహా 25 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్పీకి చెందిన ప్రముఖ ఫొటోగాఫర్ షా మారై కూడా ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. వారం రోజుల క్రితం ఓటరు నమోదు కేంద్రం లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ జరిపిన దాడిలో 30 మంది పౌరులు మరణించారు. -
ఐసిస్‌కు గట్టి ఎదురుదెబ్బ
బీరూట్(లెబనాన్): మధ్య ఆసియాను గడగడలాడిస్తున్న తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)కు గట్టి షాక్ తగిలింది. ఐసిస్ అధికార వార్తా సంస్థ ఆమక్ స్థాపకుడైన బరా కడెక్ సంకీర్ణ దళాల బాంబు దాడిలో చనిపోయినట్లు అతని సోదరుడు హజైఫా వెల్లడించాడు. తూర్పు సిరియాలో డైర్ ఎల్ జోర్ ప్రావిన్సు మయదీన్ పట్టణంలోని అతని ఇంటిపై బుధవారం జరిగిన దాడిలో బరా కడెక్తోపాటు అతని కుమార్తె కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అతడు వివరించాడు. బరా కడెక్ మృతిని ఇతర వార్తా సంస్థలు కూడా ప్రకటించినప్పటికీ ఎప్పుడు, ఎక్కడ అనేది ధ్రువీకరించలేక పోయాయి. ఈ నేపథ్యంలోనే ఫేస్బుక్లో హజైఫా పెట్టిన పోస్టింగ్‌తో బరాకడెక్ మరణాన్ని ధ్రువీకరించినట్లయింది. కడెక్ అతని కుమార్తెతో కలిసి కారులో వెళ్తుండగా అమెరికా సారథ్యంలోని సంకీర్ణ బలగాలు దాడి చేశాయని హలాబ్ న్యూస్ నెట్వర్క్ తెలిపింది. అయితే, దీనిని అమెరికా తరఫున ఎవరూ ధ్రువీకరించలేదు. కాగా, ఐఎస్ పోరాటం, దాడులు, నష్టం తదితర వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఆమక్ వార్తాసంస్థ అతివేగంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల నుంచి ఆమక్ను నిషేధించినప్పటికీ ఆమక్ విశ్వసనీయ ప్రసార మాధ్యమంగా మారింది. అమెరికా సారథ్యంలోని సంకీర్ణ దళాలు, కుర్దిష్ బలగాల దాడుల నేపథ్యంలో ఆమక్ వార్తా సంస్థ మయదీన్ పట్టణం కేంద్రంగా గత కొంతకాలంగా పనిచేస్తోంది. -
ఢిల్లీని టార్గెట్ చేసిన ఐసిస్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఢిల్లీని లక్ష్యంగా చేసుకున్నట్టు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నెల 26న ఢిల్లీలోని కోర్టులపై దాడి చేయడానికి పథకం వేసినట్టు నిఘా వర్గాల దృష్టికి వచ్చింది. కొన్నిరోజులుగా ఢిల్లీలో తలదాచుకున్న ఐసిస్ సానుభూతిపరులు.. ఢిల్లీ హైకోర్టు, జిల్లా కోర్టులపై దాడి చేసేందుకు వ్యూహం పన్నారని నిఘా అధికారులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. ఐసిస్ ఉగ్రవాదులు తొలుత ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాల దృష్టికి వచ్చింది. కాగా ఉగ్రవాదులు తమ లక్ష్యాన్ని మార్చుకుని కోర్టులు, ఇతర ప్రాంతాల వైపు మళ్లించినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. రిపబ్లిక్ డే వేడులకు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని, ఎట్టి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ఐసిస్ భావజాలానికి దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల ఆకర్షితులవుతున్నట్టు తొలుత ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. కాగా ఉత్తర భారతదేశంలోనూ ఐసిస్‌కు సానుభూతిపరులున్నట్టు సమాచారం అందింది. -
25 మంది సైనికులను చంపి వీడియో తీశారు
బీరుట్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో దారుణానికి ఒడిగట్టారు. ఐఎస్ ఉగ్రవాదులు 25 మంది సిరియా సైనికులను కాల్చిచంపి.. ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఆన్లైన్లో పెట్టారు. సిరియాలోని పల్మీరా అనే పట్టణంలో ఈ దారుణం జరిగింది. ఐఎస్ ఉగ్రవాదులు సైనికులను ట్రక్కుల్లో తీసుకుని వచ్చి వరుసగా నిలబెట్టారు. వందలాదిమంది చూస్తుండగా వారిని కాల్చిచంపారు. మే 27న ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. పల్మీరా పట్టణాన్ని ఉగ్రవాదుల తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత సైనికులు, ఉద్యోగులను చంపినట్టు తెలిపింది. -
ఇనుప బోనుల్లో 43 మంది సజీవ దహనం!
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. 43 మందిని ఇనుప బోనుల్లో పెట్టి సజీవంగా దహనం చేశారు! ఇరాక్‌లోని పశ్చిమప్రాంత రాష్ట్రమైన అన్బర్‌లో ఈ దారుణం జరిగినట్లు తాజాగా తెలిసింది. మొత్తం 43 మంది ఇరాకీలను అల్ బాగ్దాదీ నగరం నుంచి పట్టుకున్నారు. ఇది ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరానికి సుమారు 200 కిలోమీటర్లు వాయవ్య దిశలో ఉంటుంది. బందీలుగా పట్టుబడినవాళ్లంతా స్థానిక పోలీసులు గానీ, ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న సహ్వా పారామిలటరీ గ్రూపు సభ్యులు గానీ అయి ఉంటారని భావిస్తున్నారు. ఉగ్రవాదులు వీళ్లందరినీ ముందుగా ఇనుప బోనుల్లో బంధించి, తర్వాత వారందరినీ సజీవ దహనం చేశారు. గత నెలలో సిరియాలో కూడా జోర్డానీ పైలట్ మొవాజ్ అల్ కాసాస్బేను ఇలాగే దారుణంగా హతమార్చారు. గడిచిన పది రోజులుగా 70 మందిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతమార్చిన తర్వాత తాజా ఘాతుకానికి పాల్పడ్డారు. -
'అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నాం'
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో చార్లీ హెబ్డో మేగజీన్ న్యూస్ డైరెక్టర్ స్టీఫెన్ షార్బోనియర్ మృతి చెందారు. ప్రముఖ ఫ్రెంచి కార్టూనిస్టులు కాబు, ఛార్బ్, వోలినిస్కీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. స్టీఫెన్ షార్బోనియర్ ను హతమారిస్తు భారీగా నగదు బహుమతి ఇస్తామని అల్ కాయిదా ఉగ్రవాద సంస్థ 2013లో ప్రకటించింది. కాగా, కాల్పులు జరిపిన ఉగ్రవాదులు ఫ్రెంచిలో మాట్లాడుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నామంటూ ఉగ్రవాదులు నినాదాలు చేసినట్టు వెల్లడించారు. ఏకే-47 రైఫిళ్లు, రాకెట్ లాంచర్లతో దాడులకు తెగబడినట్టు తెలిపారు. మరోవైపు పారిపోయిన ఉగ్రవాదుల పట్టుకునేందుకు ప్యారిస్ అంతటా జల్లెడ పట్టారు. ఎక్కడిక్కడ రవాణా వ్యవస్థను నిలిపివేసి సోదాలు చేస్తున్నారు. -
ఉగ్రవాద దాడిలో 12 మంది మృతి
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో బుధవారం జరిగిన కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఫ్రెంచ్ వ్యంగ్య మేగజీన్ చార్లీ హెబ్డో కార్యాలయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ముసుగులు ధరించి వచ్చిన దుండగులు విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్టు సమాచారం. కనీసం ఒక జర్నలిస్ట్, సంఘటనా స్థలానికి చేరుకున్న ఇద్దరు పోలీసులు కాల్పుల్లో మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. గతంలో ఇదే ప్రతిక కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. కాల్పులు జరిపింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులని అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో మహ్మద్ ప్రవక్త, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కమాండర్ కు వ్యతిరేకంగా చార్లీ హెబ్డో కార్టూన్లు ప్రచురించింది. సిడ్నీలో కాల్పుల ఘటన జరిగి పక్షం రోజులు గడవకముందే ఫ్రాన్స్ లో ఈ ఘటన జరగడం గమనార్హం. ఫ్రాన్స్ ఘటనతో యూరప్, అమెరికా అంతటా హై అలర్ట్ ప్రకటించారు. -
జర్నలిస్టు తల నరికి.. వీడియో పెట్టిన ఉగ్రవాదులు
ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దాదాపు రెండేళ్ల క్రితం తాము సిరియాలో కిడ్నాప్ చేసిన అమెరికా పాత్రికేయుడు జేమ్స్ ఫోలీని తల నరికి.. ఆ వీడియోను ఇంటర్నెట్లో పెట్టారు. యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ వీడియో ఇంతకీ అసలైనదా కాదా అనే విషయం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఫోలీ కుటుంబాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించినా, సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఆ వీడియోను యూట్యూబ్ తమ సెర్వర్ నుంచి తొలగించింది. 'అమెరికాకు ఓ సందేశం' అనే పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. నారింజ రంగు దుస్తులు ధరించిన ఫోలీని ఓ ఎడారి ప్రాంతంలో మోకాళ్ల మీద నిలబెట్టి, పక్కనే ఓ ఉగ్రవాది తలకు ముసుగు వేసుకుని నల్ల దుస్తుల్లో ఉన్నాడు. సాధారణంగా నారింజరంగు దుస్తులను అమెరికా సైన్యం అదుపులో ఉండే ఖైదీలకు వేస్తారు. అతడి పక్కనే ఉన్న ఉగ్రవాది ఇంగ్లీషులో మాట్లాడాడు. ఆ తర్వాత అతడు జేబులోంచి కత్తి తీసి, ఫోలీకి మరణశిక్ష విధిస్తున్నట్లు చెప్పాడు. ఇరాక్‌లో ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులపై వైమానిక దాడులు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించడంతో అందుకు ప్రతీకారంగా ఈ శిక్ష వేస్తున్నామన్నారు. ''నా అసలైన హంతకులు.. అమెరికా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయాల్సిందిగా నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులను కోరుతున్నాను. వాళ్ల నేరపూరిత చర్యల వల్లే ఇదంతా జరుగుతోంది'' అని ఫోలీ ఆ వీడియోలో చెబుతున్నట్లు ఉంది. అల్-ఫుర్ఖాన్ మీడియా ఫౌండేషన్ అనే సంస్థ ఈ వీడియోను ఆన్లైన్లో పెట్టింది. అమెరికాన్ సైనికులు ఈ నెలలో ఇరాక్ మీద బాంబులు వేయడం మొదలుపెట్టారని, అలా తన మరణ ధ్రువపత్రం మీద వాళ్లు సంతకం పెట్టారని ఫోలీ చివర్లో చెబుతాడు. 40 ఏళ్ల ఫోలీ గ్లోబల్ పోస్ట్ అనే ఆన్లైన్ ఎడిషన్ తరఫున ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. అతడు 2012 నవంబర్ 22వ తేదీన సిరియాలో అదృశ్యమయ్యాడు. అతడితో పాటు పలువురు అమెరికన్లను ఉగ్రవాదులు చెరలోకి తీసుకున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)