ఇనుప బోనుల్లో 43 మంది సజీవ దహనం!
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. 43 మందిని ఇనుప బోనుల్లో పెట్టి సజీవంగా దహనం చేశారు! ఇరాక్లోని పశ్చిమప్రాంత రాష్ట్రమైన అన్బర్లో ఈ దారుణం జరిగినట్లు తాజాగా తెలిసింది. మొత్తం 43 మంది ఇరాకీలను అల్ బాగ్దాదీ నగరం నుంచి పట్టుకున్నారు. ఇది ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరానికి సుమారు 200 కిలోమీటర్లు వాయవ్య దిశలో ఉంటుంది. బందీలుగా పట్టుబడినవాళ్లంతా స్థానిక పోలీసులు గానీ, ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న సహ్వా పారామిలటరీ గ్రూపు సభ్యులు గానీ అయి ఉంటారని భావిస్తున్నారు.
ఉగ్రవాదులు వీళ్లందరినీ ముందుగా ఇనుప బోనుల్లో బంధించి, తర్వాత వారందరినీ సజీవ దహనం చేశారు. గత నెలలో సిరియాలో కూడా జోర్డానీ పైలట్ మొవాజ్ అల్ కాసాస్బేను ఇలాగే దారుణంగా హతమార్చారు. గడిచిన పది రోజులుగా 70 మందిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతమార్చిన తర్వాత తాజా ఘాతుకానికి పాల్పడ్డారు.