ఉగ్రవాద దాడిలో 12 మంది మృతి
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో బుధవారం జరిగిన కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఫ్రెంచ్ వ్యంగ్య మేగజీన్ చార్లీ హెబ్డో కార్యాలయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ముసుగులు ధరించి వచ్చిన దుండగులు విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్టు సమాచారం.
కనీసం ఒక జర్నలిస్ట్, సంఘటనా స్థలానికి చేరుకున్న ఇద్దరు పోలీసులు కాల్పుల్లో మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. గతంలో ఇదే ప్రతిక కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది.
కాల్పులు జరిపింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులని అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో మహ్మద్ ప్రవక్త, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కమాండర్ కు వ్యతిరేకంగా చార్లీ హెబ్డో కార్టూన్లు ప్రచురించింది. సిడ్నీలో కాల్పుల ఘటన జరిగి పక్షం రోజులు గడవకముందే ఫ్రాన్స్ లో ఈ ఘటన జరగడం గమనార్హం. ఫ్రాన్స్ ఘటనతో యూరప్, అమెరికా అంతటా హై అలర్ట్ ప్రకటించారు.