బొమ్మ అంటే బొమ్మా కాదు!
మాంచెస్టర్: లండన్ పోలీసులకు ఇటీవల చిత్రమైన ఫిర్యాదు ఎదురైంది. తన ఇంట్లో తోడేలు బొమ్మ పోయిందంటూ ఓ విలాసవంతమైన ఫ్లాట్‌లో నివాసముంటున్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజు ఉదయం తన స్నేహితుడితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు తన ఇంటికి వచ్చారనీ, ఆ తరువాతే బొమ్మ కనిపించడం లేదని పిర్యాధులో పేర్కొన్నాడు. అది సాధారణ బొమ్మ కాదనీ, దాని విలువ 32 వేల పౌండ్లని తెలిపాడు.
అచ్చం సజీవమైన తోడేలులా కనిపించేందుకు తోడేలు చర్మంతో దాన్ని రూపొందించారు. 6 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తుతో పసుపు పచ్చని కళ్లు, తెల్ల బొచ్చుతో జీవకళ ఉట్టిపడేలా తయారు చేశారు. అరుదైన వస్తువులు విక్రయించే చోట దాన్ని ఖరీదు చేశానని ఆయన వెల్లడించాడు. ఈ ఘటనపై ఆగస్టు 3న ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు వేట మొదలెట్టారు.