తప్పులో కాలేసిన ఇవాంకా ట్రంప్!
సెలబ్రిటీలు చేసే ట్వీట్లు అప్పుడప్పుడూ మిస్ ఫైర్ అవుతుంటాయి. అయితే కొన్నిసార్లు వారు చేసే తప్పులను ఎవరూ గుర్తించలేదని సంతోషించవచ్చు. కానీ నిజం ఏదో ఓ రోజు బయటపడుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటారా.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నోసార్లు పదాలు తప్పుగా రాస్తూ ట్వీట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ట్రంప్ కూతురు ఇవాంకా చేసిన ఓ తప్పు నాలుగేళ్ల తర్వాత వెలుగుచూసింది. ఇవాంకా తప్పులో కాలేయడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
2013 జూన్ 23న ఇవాంకా ఓ ట్వీట్ చేశారు. ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ థియరీ అంటూ ఉదహరిస్తూ ఓ విషయాన్ని చెబుతూ 'ఒకవేళ నిజాలు థియరీలకు మ్యాచ్ అవ్వకపోతే.. ఆ నిజాలనే మార్చివేయాలి' అని ఇవాంకా పేర్కొన్నారు. నాలుగేళ్లు గడిచిపోయాయి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఐన్‌స్టీన్ ఎస్టేట్‌కు ప్రతినిధిగా ఉన్న గ్రీన్ లైట్ ఇవాంకా ట్వీట్‌లోని తప్పును గుర్తించారు. అసలు ఈ కొటేషన్‌ను ఐన్‌స్టీన్ చెప్పనేలేదని వెల్లడించారు. ఈ మేరకు ఐన్‌స్టీన్ పేరిట ఉన్న అధికారిక ఖాతా నుంచి ఇవాంకా ట్రంప్ ట్వీట్‌లోని తప్పిదాన్ని వివరిస్తూ రీట్వీట్ చేశారు. ఇక ఇది మొదలు నెటిజన్లు ఇవాంకాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. విషయం తెలిస్తేనే ట్వీట్లు చేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
"If the facts don't fit the theory, change the facts." - Albert Einstein #quote #sunday
— Ivanka Trump (@IvankaTrump) 23 June 2013