
20 లక్షల శిశువులకు ప్రాణం పోసిన ఆయన రక్తం
సిడ్నీ: ఆయన పసిపిల్లలకు ప్రాణదాత. ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా పిండస్థ శిశువులకు ప్రాణం పోశారు. అదీ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా. అలా అనీ ఆయన వైద్యుడేమీ కాదు. కేవలం రక్తదానం చేయడమే జీవితాశంగా పెట్టుకున్న జేమ్స్ హారిసన్ అనే 80 ఏళ్లకు పైబడిన వృద్ధుడు. అంతమంది శిశువులకు ప్రాణం పోసిందీ ఆయన రక్తంలో ఉన్న ‘యాంటీ-డీ’ బాడీస్. ఆయన రక్తంలో ‘యాంటీ-డీ’ బాడీస్ ఎలా అభివృద్ధి చెందాయో ఇప్పటికీ ఏ డాక్టర్‌కూ అంతుచిక్కని ప్రశ్నే. ఈ మిస్టరీ గురించి ఎంతో కొంత తెలుసుకోవాలంటే దాదాపు ఐదు దశాబ్దాలు వెనక్కి వెళ్లాలి.
ఆస్ట్రేలియాలో 1967 వరకు అంతుచిక్కని వ్యాధితో ఏటా వేలాది మంది పిండస్థ శిశువులు మరణించేవారు. అదే సంఖ్యలో బ్రెయిన్ దెబ్బతిన్న స్థితిలో పుట్టేవాళ్లు. దీనిపైన ఆస్ట్రేలియా వైద్యులు విస్తృత పరిశోధనలు చేయగా ఓ విషయం తేలింది. తల్లిలో ఉండే ‘రెసెస్ డిసీస్’ కారణంగా పిండం దశలోనే పిల్లలు మరణించేవాళ్లు. రెసెస్ డిసీస్ ఉన్న తల్లుల్లోని రక్తాన్ని ‘ఆర్‌హెచ్-డీ’ నెగెటివ్ బ్లడ్ అని పిలుస్తారు. పుట్టబోయే బిడ్డకు ‘ఆర్‌హెచ్-డీ’ పాజిటివ్ రక్త కణాలు ఉంటే తల్లి రక్తంలోని నెగెటివ్ కణాలు బిడ్డ రక్తంలోని పాజిటివ్ కణాలను చంపేస్తున్నట్టు తేలింది. అందుకనే పిల్లలు మృత్యువాత పడుతున్నారని, లేదంటే మెదడు దెబ్బతిన్న స్థాయిలో పుడుతున్నారన్న విషయాన్ని వైద్యులు తమ పరిశోధనల్లో గ్రహించారు. తల్లి రక్తంలో నెగెటివ్ కణాలుంటే పిల్లకు పాజిటివ్ కణాలు తండ్రి ద్వారా సంక్రమిస్తాయన్న విషయం తెల్సిందే.
తల్లిలోని ‘ఆర్‌హెచ్-డీ’ కణాల ప్రభావాన్ని నిర్మూలిస్తేనే అలాంటి తల్లుల్లో పిల్లలను రక్షించవచ్చని, అందుకు రక్తంలో ‘యాంటీ-డీ’ బాడీలను తయారుచేయడం ఒక్కటే మార్గమని వైద్యులు భావించారు. మరి ఆ యాంటీ-డీ బాడీలను ఎలా తయారు చేయాలో కనుక్కోలేక పోయారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాకే చెందిన జేమ్స్ హారిసన్ రక్తదానం చేయడానికి ఆస్ట్రేలియా రెడ్‌క్రాస్ బ్లడ్ సర్వీస్‌కు వచ్చారు. ఆయన రక్తాన్ని పరీక్షించిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కారణం ఎవరూ ఊహించని విధంగా ఆయన రక్తంలో ‘యాంటీ-డీ’ బాడీలు ఉండడమే.
హారిసన్ రక్తం నుంచి సేకరించిన యాంటీ-డీ ఇంజెక్షన్‌ను మొట్టమొదటి సారిగా క్రిస్టీపాస్టర్ అనే తల్లికి ఇచ్చారు. తద్వారా ఆమె కడుపులో పెరుగుతున్న ఐదువారాల బేబీ శామ్యూల్‌ను రక్షించారు. రక్తదానం చేయడమే జీవితాశయంగా పెట్టుకున్న హారిసన్ ఇలాంటి ‘ఆర్‌హెచ్-డీ’ సమస్యను ఎదుర్కొంటున్న ప్రతి తల్లికీ రక్తం ఇస్తూనే వస్తున్నారు. ఇప్పటికీ ఆయన రక్తం ద్వారా 20 లక్షల మందికి పైగా పిల్లలను వైద్యులు రక్షించారని రెడ్‌క్రాస్ బ్లడ్ సర్వీసెస్‌కు చెందిన ఉన్నతాధికారి జెమ్మా ఫాకెన్‌మైర్ తెలిపారు. హారిసన్‌కు చిన్పప్పుడు పలువురి నుంచి సేకరించిన రక్తాన్ని ఎక్కించడం వల్ల, ఆ రక్తంలో ఏర్పడిన రియాక్షన్ వల్ల ఆయన రక్తంలో యాంటీ బాడీస్ అభివృద్ధి చెంది ఉంటాయని ఆస్ట్రేలియా వైద్యులు భావిస్తున్నారు.
హారిసన్‌కు తన 14వ ఏట లివర్ ఆపరేషన్ అయింది. అప్పుడు ఆయనకు 13 లీటర్ల బ్లడ్ అవసరమై ఎక్కించారు. రక్తదానం వల్లనే తాను బతికానన్న విషయం తెల్సిన హారిసన్ అప్పటి నుంచి రక్తదానం చేయడమే ఆశయంగా పెట్టుకున్నారు. మరో రెండు, మూడు ఏళ్ల వరకు మాత్రమే హారిసన్ రక్తదానం చేయగలరని, ఆ లోగా ‘యాంటీ-డీ’ బాడీస్ ఉన్న మరో వ్యక్తి శోధించి పట్టుకోవడం మంచిదని రెడ్‌క్రాస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆస్ట్రేలియా గర్బిణుల్లో ఏటా 17 శాతం మంది ‘ఆర్‌హెచ్-డీ’ బాడీస్‌తో బాధపడుతున్నారు. వారిలో మొదటి సంతానానికి ఎలాంటి ఆరోగ్య సమస్య రాదు. రెండు లేదా మూడో సంతానం విషయంలోనే ఇలాంటి సమస్యలుంటాయి.