లక్షల మంది చిన్నారుల ప్రాణదాత అస్తమయం
కారణజన్ములు అత్యంత అరుదుగా పుడతారని ప్రపంచవ్యాప్తంగా విశ్వసిస్తారు. ఆ విశ్వాసాన్ని నిజంచేస్తూ లక్షలాది మంది పసిపాపల ప్రాణాలను నిలబెట్టిన జేమ్స్ క్రిస్టఫర్ హారిసన్ తుదిశ్వాస విడిచారు. రక్తంలోని ప్లాస్మాను 1,173 సార్లు దానంచేసి అందులోని అరుదైన యాంటీ–డి యాంటీబాడీతో దాదాపు పాతిక లక్షల మంది చిన్నారులను కాపాడిన ప్రాణదాతగా ఘన కీర్తులందుకున్న హారిసన్(88) గత నెల 17వ తేదీన ఆ్రస్టేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో తుదిశ్వాస విడిచిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సింగ్ హోమ్‌లో నిద్రలోని ఆయన శాశ్వత నిద్రలోకి జారుకున్నారని వైద్యులు తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన హారిసన్‌ను అందరూ ‘మ్యాన్ విత్ ది గోల్డెన్ ఆర్మ్’అని గొప్పగా పిలుస్తారు. ఏమిటీ ప్రత్యేకత? మానవ రక్తంలో పాజిటివ్, నెగిటివ్ అని రెండు రకాల వర్గీకరణలు ఉన్నాయి. దీనిని రీసస్(ఆర్‌హెచ్)ఫ్యాక్టర్ అని కూడా అంటారు. ఆర్‌హెచ్ నెగిటివ్ రక్తమున్న మహిళ, ఆర్‌హెచ్ పాజిటివ్ ఉన్న వ్యక్తి కారణంగా గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డకు ఆర్‌హెచ్ పాజిటివ్ ఉండే ఛాన్సుంది. దీంతో కొన్ని సార్లు ప్రాణాంతకమైన సమస్య తలెత్తుతుంది. తల్లి ఎర్ర రక్తకణాలు పుట్టబోయే బిడ్డ రక్తకణాలపై దాడిచేసి కొత్త వ్యాధిని సృష్టిస్తాయి. దీనినే హీమోలైటిక్ డిసీజ్ ఆఫ్ ది న్యూబార్న్(హెచ్డీఎన్)గా పిలుస్తారు. అంటే పుట్టబోయే/పుట్టిన బిడ్డలో ఎర్రరక్త కణాలు అత్యంత వేగంగా క్షీణించిపోతాయి.దీంతో బిడ్డకు రక్తహీనత సమస్య రావడం, గుండె వైఫల్యం చెందడంతోపాటు ప్రాణాలు పోయే అవకాశాలు చాలా అధికం. హెచ్డీఎన్ సమస్యతో ఆ్రస్టేలియాలో ప్రతి ఏటా వేలాది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే జేమ్స్ హారిసన్లోని రక్తంలో అరుదైన యాంటీ–డీ యాంటీబాడీని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈయన రక్తం ప్లాస్మా నుంచి సేకరించిన యాంటీబాడీతో ఔషధాన్ని తయారుచేసి దానిని ఆర్‌హెచ్‌డీ సమస్య ఉన్న గర్భిణులకు ఇచ్చారు.దీంతో పిండస్థ దశలోని చిన్నారుల ప్రాణాలు నిలబడ్డాయి. ఇలా 1967వ సంవత్సరం నుంచి ఎప్పటికప్పుడు హారిసన్ తన ప్లాస్మాను దానం చేస్తూనే ఉన్నారు. ఆస్ట్రేలియాలో 81 ఏళ్లు దాటిన వాళ్లు ప్లాస్మా దానం చేయకూడదనే నిబంధన ఉంది. దాంతో ఆయన తన 82వ ఏట ప్లాస్మా దానాన్ని ఆపేశారు. అప్పటికే ఆయన 1,173 సార్లు ప్లాస్మాను దానంచేశారు. దాని సాయంతో ఒక్క ఆస్ట్రేలియాలోనే దాదాపు 24 లక్షల మంది పసిపాపలను కాపాడటం విశేషం. ఆరు దశాబ్దాలపాటు దానం 1936 డిసెంబర్ 27న హారిసన్ జన్మించారు. 14వ ఏట అంటే 1951 ఏడాదిలో హారిసన్‌కు ఛాతిలో పెద్ద శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు పెద్దమొత్తంలో రక్తం అవసరమైంది. ఇతరుల రక్తదానంతో బతికానన్న కృతజ్ఞతాభావం ఆయనలో ఆనాడే నాటుకుపోయింది. బ్రతికినంతకాలం రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నారు. నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాతే రక్తదానం ఇవ్వడం మొదలెట్టారు. ఇలా దాదాపు 60 ఏళ్లపాటు ప్లాస్మాను దానంచేశారు.ప్రతి రెండు వారాలకోసారి ప్లాస్మా దానమిచ్చారు. అత్యధిక సార్లు ప్లాస్మా దానం చేసిన వ్యక్తిగా 2005లో ఆయన ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 2018 మే11వ తేదీన చివరిసారిగా ప్లాస్మా దానంచేశారు. న్యూ సౌత్ వేల్స్(ఎన్ఎస్డబ్ల్యూ) జాతీయ యాంటీ–డీ కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యునిగా హారిసన్ ఉన్నారు. ఇన్నేళ్లలో ఎన్ఎస్డబ్ల్యూ తయారుచేసిన యాంటీ–డీ ప్రతి బ్యాచ్‌లో ఒక్క డోస్ అయినా హారిసన్ది ఉండటం విశేషం.లక్షల ప్రాణాలు కాపాడి రికార్డ్ సృష్టించారని గతంలో మీడియా ఆయన వద్ద ప్రస్తావించగా నవ్వి ఊరుకున్నారు. ‘‘రికార్డ్ సృష్టించడం అంటూ ఏదైనా జరిగిందంటే అది కేవలం ఆ దాతృత్వ సంస్థ చేసిన విరాళాల వల్లే. ఇందులో నా పాత్ర ఏమీ లేదు’’అని నిగర్విలా మాట్లాడారు. నేనూ బతికా: కూతురు హారిసన్ మరణంపై ఆయన కూతురు ట్రేసీ మెలోషి ప్ మాట్లాడారు. ‘‘మా నాన్న ఇన్నిసార్లు దానం చేసి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆయన అందించిన యాంటీ–డీ డోస్‌తో ఎంతో మంది బ్రతికారు. అందులో నేను కూడా ఉన్నా’’అని ట్రేసీ అన్నారు. ఈ డోస్ పొందిన వారిలో హారిసన్ మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉండటం విశేషం. 14 ఏళ్ల వయసులో ఆపరేషన్ వేళ తీవ్రస్థాయిలో రక్తం ఎక్కించుకోవడం వల్లే హారిసన్ ఈ అరుదైన లక్షణాన్ని సంతరించుకున్నారని కొందరి వాదన. – సాక్షి, నేషనల్ డెస్క్