ర్యాన్సమ్ వేర్ బారిన మరో ప్రముఖ దేశం
ర్యాన్సమ్ వేర్ బారిన మరో ప్రముఖ దేశం
Published Mon, May 15 2017 12:55 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM
టోక్యో : ప్రపంచ దేశాలకు పెను ముప్పుగా, ఆధునిక టెక్నాలజీ భద్రతకు సవాలు విసురుతూ ఉద్భవించిన వనాక్రై ర్యాన్సమ్ వేర్ బాధిత దేశ జాబితాలో జపాన్ కూడా వచ్చి చేరింది. ఇప్పటికే ఈ సైబర్ దాడి 150 దేశాల్లో బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జపాన్ లోని అతిపెద్ద మోటార్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ కు చెందిన కొన్ని యూనిట్లను వనాక్రై టార్గెట్ చేసిందని ఆ కంపెనీ ధృవీకరించింది. కానీ తమ బిజినెస్ లపై అంతపెద్ద ప్రభావమేమీ పడలేదని పేర్కొంది. హిటాచి అధికార ప్రతినిధి కూడా తమ ఫైల్స్ ఓపెన్ కావడం లేదని, ఈ-మెయిల్స్ వ్యవస్థ స్తంభించిందని, అసలు డెలివరీ కావడం లేదని పేర్కొన్నారు.
దీనికి కారణం ర్యాన్సమ్ వేర్ అటాకేనని తాము నమ్ముతున్నట్టు, అయితే ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్లు ఆ అటాకర్ల నుంచి రాలేదని చెప్పారు. ఇప్పటికే జపాన్ లో 600 ప్రాంతాల్లో 2000 కంప్యూటర్లు ఈ బారిన పడినట్టు జపాన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కో-ఆర్డినేటర్ సెంటర్ రిపోర్టు చేసింది. కొంతమంది వ్యక్తిగతంగా కూడా తాము ఈ సైబర్ దాడిన పడినట్టు చెప్పినట్టు వెల్లడించింది. ఆధునిక టెక్నాలజీ భద్రతకు సవాల్ విసురుతూ ఊహించనిరీతిలో హ్యాకర్లు విరుచుకుపడ్డారు. యూరప్, లాటిన్ అమెరికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు ఈ ర్యాన్సమ్ వేర్ మాల్‌వేర్ బారినపడ్డాయి. భారత్‌లోని కొన్ని కంపెనీలు దీని ప్రభావానికి గురయ్యాయి.
Advertisement