
ప్రముఖ హాలీవుడ్ సింగర్ కన్నుమూత
సీటెల్: ప్రముఖ హాలీవుడ్ సింగర్, నాలుగుసార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన ఎర్నెస్టీన్ ఆండర్సన్ (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె తుదిశ్వాస విడిచారు. వయోభారంతో వచ్చే సమస్యల కారణంగా షోరెలైన్ లోని ది కింగ్ కౌంటీ మెడికల్ హాల్ లో చికిత్స పొందుతున్న ఆమె మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఆండర్సన్ ప్రపంచ వ్యాప్తంగా తన గానామృతంతో ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్, కార్నిజీ హాల్లో ఎక్కువ ప్రదర్శనలు, జపాన్, యూరప్ తదితర దేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు. ఒకసారి అధ్యక్ష పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంలో కూడా ఆమె ప్రోగ్రాం నిర్వహించారు. గాయనిగా మొత్తం 60 ఏళ్ల జీవిత కాలంలో నాలుగుసార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యి రికార్డు సృష్టించారు.