సియోల్/వాషింగ్టన్: ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్.. పార్టీ కీలక పదవిలో తన సోదరిని నియమించారు. కిమ్ యో జోంగ్‌ను పార్టీ శక్తివంతమైన పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమించినట్లు ప్రభుత్వ అధికార వార్తాసంస్థ కేసీఎన్‌ఏ స్పష్టం చేసింది. ఆదివారం కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న ఉత్తరకొరియా అణ్వాయుధ కార్యక్రమంపైనా కిమ్ ప్రశంసలు కురిపించారు. ఆంక్షలు పెరుగుతున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మెరుగుపడిందని కిమ్ పేర్కొన్నారు.
సోదరికి కీలకమైన పార్టీ పదవి కట్టబెట్టడం ఆశ్చర్యం కలిగించింది. అణుపరీక్షల సమయంలో, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కొంతకాలంగా కిమ్‌తోపాటుగా అతని సోదరి కనబడుతున్నారు. కాగా, ఉత్తరకొరియాతో దౌత్య ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ‘25 ఏళ్లుగా ఉత్తరకొరియాతో యూఎస్ అధ్యక్ష భవనం మాట్లాడుతూనే ఉంది. ప్రతిసారీ అమెరికన్ అధికారులు అవమానాల పాలవుతున్నారు. వారితో దౌత్య ప్రయత్నం సరికాదు. ప్రత్యామ్నాయం ఒక్కటే (పరోక్షంగా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ) మిగిలింది’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment