నెస్లేకు 'కిట్ క్యాట్' బాధిత యువతి అల్టిమేటం
ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కిట్ క్యాట్ చాక్లెట్ లో ఒట్టి చాక్లెట్ తప్ప వేఫర్ లేకపోవడంతో కంగుతిన్న అమ్మాయి.. ఏకంగా తయారీదారులైన నెస్లే కంపెనీకి హెచ్చరికలు పంపింది. నష్టపరిహారంగా తనకు జీవితకాలం ఉచితంగా చాక్లెట్లు పంపాలని డిమాండ్ చేసింది.
లండన్ కు చెందిన న్యాయవిద్యార్థిని సైమా అహ్మద్(20) గత వారం ఓ షాపులో కిట్ క్యాట్ చాక్లెట్లు కనుక్కుంది. ఇంటికెళ్లి చూస్తే.. వేఫర్ లేకుండా కిట్ క్యాట్ మొత్తానికిమొత్తం చాక్లెట్ మాదిరే కనిపించడంతో అవాక్కయింది. ఆ వెంటనే వినియోగదారుల పట్ల కంపెనీ తీరును నిరసిస్తూ నెస్లేకు లేఖ రాసింది.
తాను కొన్న చాక్లెట్ శాంపిళ్లను కంపెనీకి పంపుతూ పరిహారంగా జీవితకాలం తనకు ఉచితంగా చాక్లెట్లు సరఫరా చేయాలని సైమా అహ్మద్ డిమాండ్ చేసింది. అలా కాని పక్షంలో విషయం కోర్టులో తేల్చుకుంటానని హెచ్చరించింది. ఇప్పటివరకైతే నెస్లే ఆమె డిమాండ్ కు స్పందించలేదు. మ్యాగీ నూడుల్స్ లో విషపదార్థాలు కలుస్తున్నాయనే ఆరోపణలతో ఇండియాలో పరువుపోగొట్టుకున్న నెస్లే.. కిట్ క్యాట్ రచ్చ ద్వారా ఇప్పుడు ఇంగ్లాండ్ లోనూ అదేపరిస్థితికి దిగజరినట్లయింది.